breaking news
Martyrs family
-
అమర జవాన్ భార్యకు వేధింపులు
బెంగళూరు: దేశం కోసం అమరుడైన సీఆర్పీఎఫ్ జవాన్ భార్యకు రక్షణ లేకుండా పోయింది. భర్త చనిపోయి రెండు వారాలు కూడా గడవకముందే.. అత్తింటివారి నుంచి ఆ మహిళకు వేధింపులు మొదలయ్యాయి. ఈ వేధింపులు తాళలేక ఆమె పోలీసులను కూడా ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే.. ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా ఉగ్రదాడిలో కర్ణాటక మండ్యాకు చెందిన జవాన్ హెచ్ గురు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ విషాదంతో ఆయన భార్య కళావతి(25) తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు. అమరుడైన భర్తకు కన్నీటి నివాళులర్పించారు. (సైన్యంలో చేరతా అమర జవాన్ భార్య) గురు అంత్యక్రియలు ముగిసిన కొద్ది రోజులకు అతని కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. అమర జవాన్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ప్రకటించాయి. అంతేకాకుండా ప్రజలు కూడా పెద్ద ఎత్తున విరాళాలు అందజేయడానికి ముందుకొచ్చారు. అయితే ఈ మొత్తాన్ని కళావతికి చెందకుండా తామే దక్కించుకోవాలని భావించిన గురు కుటుంబ సభ్యులు.. అందుకోసం పథకం రచించారు. గురు చిన్న సోదరుడుకి, కళావతికి పెళ్లి చేస్తే వచ్చిన పరిహారం అంత తమకే చెందుతుందని భావించారు. ఈ మేరకు మరిదిని పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమెపై ఒత్తిడి తీసుకోచ్చారు. ఈ వేధింపులు శ్రుతి మించడంతో.. ఈ సమస్యను పరిష్కరించాలని ఆమె బుధవారం మండ్యా పోలీసులను ఆశ్రయించారు. (అమర జవాన్ కుటుంబానికి సుమలత సాయం) దీనిపై ఓపికతో ఉండాలని ఆమెకు సూచించిన పోలీసులు.... ఈ ఘటనపై ఎటువంటి విచారణ చేపట్టలేదని, కేసు కూడా నమోదు చేయలేదని తెలిపారు. అయితే కళావతి అత్తింటివారిని పోలీసులు హెచ్చరించారు. ఈ సమస్య ఇలాగే కొనసాగితే సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తుందని హితవు పలికారు. ఈ ఘటనపై ఓ సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఇది కుటుంబ సమస్య అని, సున్నితమైన అంశమని పేర్కొన్నారు. మరోవైపు బుధవారం మండ్యాలో పర్యటించిన సీఎం కుమారస్వామి కళావతికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
ఎవరిదీ పాపం..మాకెందుకీ శాపం?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వాళ్లు భవిష్యత్‌పై ఎన్నో కలలుగన్నారు. ఆకాంక్ష కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరులయ్యారు. వారి ఆకాంక్ష ఫలించింది.. కొత్త రాష్ట్రం ఆవిర్భవించింది. కానీ అమరత్వాన్ని గుర్తించేందుకు నిబంధనలు అడ్డొస్తున్నాయి. ‘ఎఫ్ఐఆర్' లు కాదు.. కాదు.. లెక్కలేదు! అంటున్నాయి. తెలంగాణ కోసం ప్రాణం త్యాగం చేసినవారు జిల్లాలో 37మంది ఉండగా, 17మంది మాత్రమే ఉన్నట్లు గుర్తించడం పట్ల బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అమరవీరుల కుటంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.100కోట్లు కేటాయించింది. తెలంగాణ అమరవీరుల కుటుంబాల వేదిక లెక్కల ప్రకారం జిల్లాలో 37 మంది స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేశారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 36ను అనుసరించి జిల్లాలో కేవలం 17మంది మాత్రమే అమరులైనట్లు రెవెన్యూ విభాగం ప్రభుత్వానికి నివేదిక పంపింది. యువత ఆత్మబలిదానాలకు పాల్పడిన సందర్భంలో నమోదైన పోలీసు ఎఫ్ఐఆర్లు, వారి క్రైమ్ నివేదికల ఆధారంగా వీరిని గుర్తించినట్లు రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది. అయితే అమరవీరుల గుర్తింపులోనూ శాస్త్రీయత లోపించిందనే విమర్శలు ఉన్నాయి. 21పోలీసు ఎఫ్ఐఆర్లను పరిశీలించి కేవలం 17మందినే అమరులుగా గుర్తించారు. మరో నలుగురు తెలంగాణ రాష్ట్రం కోసమే ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆధారాలు ఉన్నా జాబితాలో చేర్చలేదు. కొందరు గుండెపోటుకు గురికాగా, మరికొందరి పేరిట ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. మొత్తంగా జిల్లా నుంచి 37 మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినట్లు అమరుల కుటుంబాల వేదిక లెక్కలువేసింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో వేయి మందికి పైగా ప్రాణ త్యాగం చేశారని ప్రకటించిన నేతలు ఇప్పుడు ఆ సంఖ్యను 459కి పరిమితం చేయడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇవిగో ఉదాహరణలు వీపనగండ్ల మండలం కొండూరుకు చెందిన వినోద్ అనే బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే అతని బ్యాగ్‌లో మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఉందనే కారణంతో ప్రతిపాదన తిరస్కరించినట్లు తెలుస్తోంది. అచ్చంపేటకు చెందిన దినేశ్‌చంద్ర, మహేశ్‌కుమార్‌ల మరణాలకు సంబంధించి తగిన ఆధారాలు ఉన్నా అమరవీరులుగా గుర్తించ లేదు. తమ పిల్లల పేర్లు జాబితాలో చేర్చాలంటూ వారి కుటుంబాలు అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. ఆత్మబలిదానం గుర్తించండి తెలంగాణ కోసం అసువులుబాసిన అమరులనందరినీ ప్రభుత్వం గుర్తించాలి. అధికారుల అలసత్వంతోనే మా కొడుకు పేరు లిస్టులో పొందుపర్చలే దు. మా కొడుకు తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్నట్లు వాంగ్మూలం, ఎఫ్ఐఆర్లో పొందుపర్చినట్లు పత్రాలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవతీసుకుని అర్హులైన ప్రతి అమరవీరుడి కుటుంబాన్ని ఆదుకోవాలి. - అమరుడు దినేష్చంద్ర తల్లిదండ్రులు శశికళ, రమేష్, అచ్చంపేట