breaking news
Married woamn death
-
మనస్తాపంతో వివాహిత తీవ్ర నిర్ణయం!
కర్నూలు: నగరంలోని కొత్తపేటలోని రామాలయం దగ్గర నివాసముంటున్న బోయ మహాలక్ష్మి (19) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జూపాడుబంగ్లా మండలం తంగడంచె గ్రామానికి చెందిన ఈమె.. తల్లిదండ్రులు చనిపోవడంతో సాయిబాబా సంజీవ నగర్లో ఉంటున్న అవ్వ భవానమ్మ వద్ద పెరిగింది. కొత్తపేటకు చెందిన అబ్దుల్ గనిని ప్రేమించి రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వీరికి 8 నెలల కూతురు ఉంది. భర్త చికెన్ పకోడి బండి పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగా వీరు నాలుగు నెలల క్రితం వేరు కాపురం పెట్టారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలతో మహాలక్ష్మి మనస్తాపం చెందింది. బుధవారం తెల్లవారుజామున పాపను తీసుకెళ్లి పాలు తీసుకురమ్మని పంపి తిరిగి వచ్చేలోగా ఇంట్లో కొక్కికి చీరతో ఉరి వేసుకుంది. భర్త వచ్చి గమనించి ఉరి నుంచి కిందికి దించి చూడగా అప్పటికే మృతి చెందింది. అవ్వ భవానమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
వివాహిత అనుమానాస్పద మృతి
(విశాఖపట్నం) : ఎంవీపీ లాసన్స్ బే కాలనీలో నివాసం ఉంటున్న వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతదేహాన్ని మూడో పట్టణ పోలీసులు కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మంగళవారం ఉదయం మార్చురీ వద్ద మృతురాలి తల్లి సుబ్బలక్ష్మి, సోదరి శిరీష తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరుకు చెందిన సునీల్ రాజు (36), విశాఖపట్నం పాత ఐటీఐ వద్ద నివాసం ఉంటున్న రాజేశ్వరి (33)లకు గత ఏడాది ఆగస్టులో ఏలూరులోని ఓ చర్చిలో ఫాస్టర్ సమక్షంలో వివాహం జరిగింది. ఇద్దరూ లాసన్స్‌బే కాలనీలో కాపురం పెట్టారు. రాజేశ్వరి నగరానికి చెందిన ఫుల్‌క్రం గ్లోబల్ టెక్నాలజీస్‌లో సీనియర్ బిల్లర్‌గా పనిచేస్తోంది. సునీల్రాజు మాత్రం పనిచేస్తున్నానని ఇంట్లో చెప్పినా ఖాళీగా తిరుగుతున్నాడు. ఇటీవల సునీల్రాజు తన తల్లిదండ్రులతో రాజేశ్వరి తల్లి సుబ్బలక్ష్మికి ఫోన్ చేయించి రూ.3లక్షలు కట్నంగా ఇవ్వాలని, లేదంటే వారి వద్ద ఉన్న ఖాళీ స్థలాన్ని తన పేరున రాయించాలని కోరాడు. అందుకు రాజేశ్వరి తల్లి నిరాకరిచండంతో వారితో వివాదానికి దిగాడు. అప్పుడప్పుడు తన భార్యతో కట్నం విషయంలో గొడవపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న సునీల్రాజు పుట్టినరోజు వేడుకను ఇంట్లో రాజేశ్వరి ఘనంగా నిర్వహించింది. అదేరోజు రాత్రి చివరిసారిగా తల్లితో మాట్లాడి రెండు రోజుల్లో ఇంటికి వస్తానని చెప్పింది. సోమవారం ఉదయం నుంచి రాజేశ్వరి, సునీల్‌రాజుల ఫోన్లు పనిచేయకపోవడంతో మధ్యాహ్నం 2 గంటలకు అక్క బావ ఉంటున్న ఇంటికి వెళ్లి రాజేశ్వరి సోదరి శిరీష చూడగా తాళం వేసి ఉండడంతో వెనుతిరిగింది. దిక్కుతోచని స్థితిలో ఏలూరులో ఉంటున్న సునీల్ తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయమని వారు సలహా ఇచ్చారు. అదే రోజు రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో సునీల్రాజు ఫోన్ కలవడంతో వివరాలు అడిగారు. ఇంటికి వెళ్లి కిటికీ తెరిచి చూడమని సునీల్ రాజు చెప్పడంతో అనుమానం వచ్చిన బంధువులు ముందుగా మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాత్రి 9.30 గంటల సమయంలో పోలీసుల సమక్షంలో ఇంటి తలుపును బలవంతంగా తెరిచారు. బెడ్ రూంలోని మంచంపై రాజేశ్వరి మృతదేహం పడి ఉంది. దుస్తులతో ఉన్న సూట్‌కేస్ బాత్రూంలోను, కప్‌బోర్డ్‌లో ఉన్న చీరలు ఆ గదినిండా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రస్తుతం సునీల్రాజు పరారీలో ఉన్నాడు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాడని తల్లి సుబ్బలక్ష్మి ఆరోపిస్తోంది. కట్నం కోసమే తన కుమార్తెను బలి తీసుకున్నారని, విషయం ఏలూరులో ఉన్న సునీల్రాజు తల్లిదండ్రులకు కూడా తెలుసని చెబుతున్నారు. పోలీసులు తమకు తగిన న్యాయం చేయాలని మృతురాలి బంధువులు, స్నేహితులు కోరుతున్నారు.