breaking news
Marri Chenna Reddy Memorial Trust
-
భారీ ప్రాజెక్టులు అనవసరం
- కరువు నివారణపై మర్రి చెన్నారెడ్డి స్మారక ట్రస్ట్ రౌండ్ టేబుల్ - సమావేశంలో నిపుణుల అభిప్రాయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు నివారణ తోపాటు వ్యవసాయానికి నీళ్లు అందించేందుకు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు పరిష్కారం కాదని నీటిపారుదల రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. దివంగత నీటిపారుదల రంగ నిపుణుడు టి. హనుమంతరావు సూచించిన చతుర్విద జలప్రక్రియ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని సూచించారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడ సెంటర్ ఫర్ ఎకనమిక్ సోషల్ స్టడీస్(సెస్)లో కరువు నివారణకు సంబంధించి జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జస్టిస్ ఎల్.నర్సింహా రెడ్డి, ఇక్రిశాట్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ వీరమణి, కర్ణాటక కరువు పర్యవేక్షక కేంద్రం మాజీ డైరెక్టర్ వీఎస్ ప్రకాశ్, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మ య్య, నీటిపారుదల రంగం నిపుణులు ప్రదీప్ తలషెరీ, డాక్టర్ సోమ్‌కుమార్ తోమార్, డాక్టర్ డి.నరసింహారెడ్డి, డాక్టర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సమావేశ వివరాలను ట్రస్ట్ కార్యదర్శి మర్రి శశిధర్‌రెడ్డి విలేకరులకు తెలిపారు. కరువు నివారణకు హనుమంతరావు రూపొందించిన చతుర్విద జలప్రక్రియ ఎవరూ ఊహించని ఫలితాలనిచ్చిందని, కరువు కాలంలో, మండు వేసవిలోనూ నీటి లభ్యతతో ఆదుకుందని చెప్పారు. దీనిని రాజస్థాన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేసి ఎంతో ప్రయోజనం పొందిందని, రాష్ట్రంలోనూ ఆదిలాబాద్‌లో, మెదక్‌జిల్లా జహీరాబాద్ సమీపంలోని గొట్టిగారిపల్లిలో గత 15 ఏళ్లుగా కరువులోనూ నీరు అందుబాటులో ఉంటోందన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా విద్యుత్ చార్జీలు, మెయింటెనెన్స్ ఇతరాలు కలుపుకుని ఏడాదికి ఎకరానికి రూ.1.28 లక్షల ఖర్చు అవుతుందని తేలిందని చెప్పారు. హనుమంతరావు రూపొందించిన చతుర్విద జలప్రక్రియ ద్వారా ఎకరానికి రూ.7 వేల ఖర్చుతో మూడు పంటలకు నీటిని ఇవ్వొచ్చని పేర్కొన్నారు. దీనిపై ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాసినా ఇంత వరకు ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పర్యావరణ కమిటీ ఎదుట ప్రజంటేషన్‌కు అవకాశం ఇవ్వాల్సిందిగా స్పీకర్‌ను కోరాలని నిర్ణయించామన్నారు. ఎక్కడ వర్షం పడితే అక్కడే దానిని స్టోరేజ్ చేసుకుంటే అది అక్కడే ఉంటుందని, ఇందుకోసం తక్కువ ఖర్చుతో సులభమైన విధానాన్ని అమలు చేయవచ్చని చెప్పారు. తెలంగాణకు చెందిన వెదిరె శ్రీరాం రాజస్థాన్‌లో ఈ ప్రక్రియను అమలు చేయించగా లేనిది ఇక్కడ దానిని ఎందుకు అమలు చేయించలేక పోతున్నామో అర్థం కావడం లేదన్నారు. టి.హనుమంతరావు వద్ద శిక్షణ పొంది, ఆయన సేవలను ఉపయోగించుకున్న వెదిరె శ్రీరాం ఈ ప్రక్రియపై ఇటీవల ముద్రించిన పుస్తకంలో కనీసం హనుమంతరావు ప్రస్తావన కూడా లేకపోవడం విచారకరమన్నారు. -
పునర్విభజనతోనే రాజకీయ సుస్థిరత
అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచాలని అఖిలపక్ష రౌండ్‌టేబుల్ భేటీ డిమాండ్ హైదరాబాద్‌లో సమావేశమైన తెలంగాణ, ఏపీ రాజకీయ పార్టీల నేతలు అవసరమైతే రాజ్యాంగ సవరణ చేపట్టాలి.. కేంద్రంపై ఒత్తిడి పెంచాలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టాలని, అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఇరు రాష్ట్రాలకు చెందిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. ఇరు రాష్ట్రాల్లో రాజకీయ సుస్థిరతకు ఇది ఎంతో అవసరమని అభిప్రాయ పడింది. ఆదివారం హైదరాబాద్‌లో మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన-తక్షణ కర్తవ్యం’ అనే అంశంపై ట్రస్ట్ కార్యదర్శి మర్రి శశిధర్‌రెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు (అదనంగా 34) పెంచాలని.. ఏపీలో 175 స్థానాలను 225 (అదనంగా 50)కు పెంచాల్సి ఉందని పేర్కొంది. ఇప్పటికే నియోజకవర్గాల పునర్విభజనకు కమిషన్ ఏర్పాటు కావాల్సి ఉన్నా, ఆ ప్రయత్నాలు జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కి లోబడి అమలవుతుందని స్పష్టం చేస్తున్నందున.. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఇరు రాష్ట్రాల నేతలు నిర్ణయించారు. ఇందుకోసం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలు చొరవ తీసుకోవాలని.. ఇరు అసెంబ్లీలు, శాసనమండళ్లలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాలని రెండు తీర్మానాలు చేశారు. అలాగే ఇరు రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రధానిని కలవాలని నిర్ణయించారు. కేంద్రంపై ఒత్తిడి తేవాలి.. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయితేనే కొత్త జిల్లాల ఏర్పాటు సాధ్యపడుతుందని.. పునర్విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను కేంద్రం అమలు చేయాలని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. పున ర్విభజన అంశంపై అన్ని పార్టీలు కలిసికట్టుగా ఉన్నాయన్న సంకేతాలను కేంద్రానికి పంపాలని శాసనమండలిలో కాంగ్రెస్ పక్షనేత డి.శ్రీనివాస్ చెప్పారు. ఇరు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పునర్విభజన ప్రక్రియ వేగవంతమయ్యేలా ఎన్నికల కమిషన్‌ను కేంద్రం ఆదేశించాలని తెలంగాణ టీడీఎల్పీ డిప్యూటీ నేత రేవంత్‌రెడ్డి తెలిపారు. వెంటనే మొదలు పెట్టాలి... ఇరు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పునర్విభజన ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ అన్ని పార్టీల నాయకులు ఒకే అభిప్రాయంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ఇప్పటికైనా కేంద్రం మేలుకొని చర్యలు చేపట్టాలని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి, సీఎల్పీ డిప్యూటీ నేత గీతారెడ్డి, ఏపీ శాసనమండలిలో కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, ఎం.ఎ.ఖాన్, బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఆ పార్టీ ఏపీ నేత రఘునాథ్‌బాబు, సీపీఎం నుంచి పాటూరి రామయ్య, సీపీఐ నుంచి పశ్య పద్మ, ఎంఐఎం నుంచి జాఫ్రీ, టీడీపీ నుంచి ఎల్.రమణ, కాంగ్రెస్ నుంచి షబ్బీర్‌అలీ తదితరులు పాల్గొన్నారు.