breaking news
Manohar Ajgaonkar
-
జాతీయ క్రీడలు... మళ్లీ అనుమానమే!
పనాజీ (గోవా): షెడ్యూల్ ప్రకారం రెండేళ్ల క్రితమే జరగాల్సిన జాతీయ క్రీడలు పలు కారణాలతో ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డాయి. మరోసారి ఈ క్రీడలను వాయిదా వేస్తే భారీ మొత్తంలో జరిమానా కట్టాల్సి వస్తుందని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) జాతీయ క్రీడల ఆతిథ్య రాష్ట్రం గోవాను హెచ్చరించింది. దాంతో మూడోసారి సవరించిన షెడ్యూల్ ప్రకారం గోవా ఈ ఏడాది అక్టోబర్ 20 నుంచి నవంబర్ 4 వరకు జాతీయ క్రీడలను నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే కరోనా వైరస్‌తో తలెత్తిన అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో గోవా జాతీయ క్రీడల నిర్వహణ సందిగ్ధంలో పడింది. దాంతో తమ రాష్ట్రంలో జరిగే జాతీయ క్రీడలపై స్పష్టత ఇవ్వాలని భారత ఒలింపిక్ సంఘాన్ని కోరుతున్నామని గోవా క్రీడల మంత్రి మనోహర్ అజ్గాంవ్కర్ అన్నారు. ‘ఇప్పటికే అన్ని వేదికలు పూర్తయ్యాయి. ఈ క్రీడలకు మేము ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే కరోనా కారణంగా ఏం జరుగుతుందో చెప్పలేం. అనుకున్న షెడ్యూల్ ప్రకారం జాతీయ క్రీడలు జరగాలంటే తమకు మూడు నెలలు ముందుగానే తెలియజేయాలి’ అని మనోహర్ అన్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌తోపాటు ఎన్నో మెగా ఈవెంట్స్, భారత్‌లో అత్యధిక ఆదరణ కలిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా వాయిదా పడింది. దేశవ్యాప్తంగా కరోనా ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో మరోసారి జాతీయ క్రీడలు వాయిదా పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. -
ఇక్కడ మందు తాగితే జైలుకే..!
పనాజీ: గోవా అనగానే గుర్తొచ్చేది బీచులు. చాలా మంది అక్కడికి వెళ్లి బీచ్ పక్కన కూర్చొని మందు తాగటానికి ఇష్టపడతారు. కాకపోతే దీనికి గోవా ప్రభుత్వం చెక్ పెట్టాలని మంగళవారం నిర్ణయం తీసుకుంది. బీచుల్లో మద్యం తాగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర శాసనసభ హెచ్చరించింది. బీచులన్నీ శుభ్రంగా ఉంచాలని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి మనోహర్ అజ్గౌన్కర్ తెలిపారు. మద్యం తాగినా, ఎక్కడపడితే అక్కడ సీసాలు పడేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అవసరమైతే వారిని జైల్లో పెట్టడానికైనా వెనుకాడమని హెచ్చరించారు. దీనికోసం త్వరలో టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నామని తెలిపారు. మాదకద్రవ్యాల విషయంలోనూ టూరిస్ట్ గార్డులను నియమించామన్నారు. ఇప్పటికే పోలీసులు బీచుల్లో మద్యం తాగినవారిపై కొన్ని కేసులు నమోదు చేశారన్నారు. వారికి భారీగా జరిమానా విధిస్తామని చప్పారు.