breaking news
Male dress
-
లోకంచుట్టిన తొలి వీరురాలు
పీఛేముడ్ ఆధునిక వాహనాలేవీ అందుబాటులో లేని కాలంలోనే జీన్ బారెట్ అనే ఫ్రెంచి మహిళ ప్రపంచాన్ని చుట్టివచ్చింది. పద్దెనిమిదో శతాబ్దిలో ఆమె ఈ సాహసకృత్యం చేసి, ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి మహిళగా చరిత్రలో నిలిచిపోయింది. అడ్మిరల్ లూయీ ఆంటోనీ ఆధ్వర్యంలో ఫ్రెంచి నౌకాదళం 1766లో ప్రపంచాన్ని చుట్టివచ్చేందుకు నౌకాయానాన్ని తలపెట్టింది. అప్పట్లో నౌకాదళంలోకి మహిళలకు అనుమతి ఉండేది కాదు. అయితే, జీన్ బారెట్ పురుషవేషం ధరించి, నౌకాదళంలో చేరింది. బోగన్‌విల్లె రేవు నుంచి బయలుదేరిన బృందంతో కలసి నౌకపైకి చేరుకుంది. జీన్ బారెట్కు మొదటి నుంచి మొక్కలపై ఆసక్తి ఉండేది. ఔషధ మొక్కలపై విస్తృతంగా ఆమె అధ్యయనం సాగించేది. మొక్కలపై పరిశోధనలు సాగిస్తున్న కాలంలోనే వృక్షశాస్త్రవేత్త ఫిలిబెర్ట్ కామర్సన్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోకుండానే సహజీవనం సాగించారు. ఆ కాలంలోనే ఫ్రెంచి నౌకాదళంతో కలసి ప్రపంచయాత్ర చేసే అవకాశం ఫిలిబెర్ట్కు దక్కింది. ఎలాగైనా బారెట్‌ను కూడా తనతో తీసుకుపోవాలని అతను భావించాడు. ప్రపంచమంతా తిరిగి మొక్కలపై పరిశోధనలు చేయవచ్చని బారెట్ కూడా ఉత్సాహపడింది. మహిళగా ఆమెను రానిచ్చే పరిస్థితి లేకపోవడంతో పురుషవేషం ధరించి ఫిలిబెర్ట్తో కలసి నౌకాయాత్రకు బయలుదేరింది. మూడేళ్ల యాత్ర తర్వాత కొందరు నావికులు ఆమెను మహిళగా గుర్తించారు. దీంతో మార్గమధ్యంలోనే ఫిలిబెర్ట్ను, బారెట్‌ను అప్పటి ఫ్రెంచి పాలిత ప్రదేశమైన మారిషస్‌లో విడిచిపెట్టారు. -
గాంధారదేశంలో ‘మగమ్మాయిలు’
పాలన, z అవసరాల కోసం మగవేషం ధరించిన రాజకుమార్తెలు, సామాన్య మహిళలు చరిత్రకు కొత్త కాదు. మన దేశంలో కాకతి రుద్రమ, ఫ్రాన్స్‌లో జోన్ ఆఫ్ ఆర్క్ ఇందుకు ఉదాహరణలు. కాని ఆప్ఘనిస్థాన్‌లో పలు కుటుంబాలు ఆడపిల్లను అబ్బాయిల్లా పెంచుకోవడం ఆర్థిక అవసరమవుతోంది. మగ సంతానమే కావాలని డిమాండ్ చేసే సమాజాల్లో కుమార్తె జుత్తు కురచ చేసి మగపేరును పెట్టడం కద్దు. ఇలా కుటుంబాలలో ‘మగమ్మాయిలు’ ఉండటం చరిత్రకు కొత్తది కాదు కానీ, ఆప్ఘనిస్థాన్‌లో ఇది ప్రస్తుతం కొత్త పోకడలు పోతోంది. రాజధాని కాబూల్‌లోనే, పాఠశాలల్లో అంతవరకు ఆడపిల్లలుగా కనిపించిన వారు తరగతి మారగానే మగపిల్లల వేషంలో కనిపిస్తున్నారు. ఇలా అబ్బాయిలను పోలిన అమ్మాయిలు రికార్డులలో ఉండకపోవచ్చు. కానీ పొరు గువారు, బంధువులు, సహోద్యోగి లేదా కుటుంబంలో ఎవరో ఒకరు తమ కూతురిని కుమారుడిగా పెంచడం అక్కడ వాడుకైపోయింది. ఇలాంటి పిల్లలను స్థానికంగా ‘బచా పోష్’ అని పిలుస్తు న్నారు. అంటే అబ్బాయిల్లా బట్టలు ధరించడమని అర్థం. సంపన్నులు, నిరుపేదలు, విద్యావంతులు, నిరక్షరాస్యులు అందరూ ఇంటికొక్క ‘బచా పోష్’ను పెంచుకుంటున్నారు. కుమార్తెలను చిన్నచూపు చూసే సమాజంలో కుమారుల కోసం కుటుంబాల అవసరంలోంచే ‘బచా పోష్’లు ఉనికిలోకి వస్తున్నారు. బాలికలను పనికి అనుమతించని చోట, అబ్బాయిల ద్వారా ఆదాయం అవసరమయ్యే కుటుంబాలకు ఈ మగమ్మాయిలు చేదోడుగా ఉంటున్నారు. సంపన్న కుటుంబాలకంటే పేద కుటుంబాలకే మగవేషం లోని అమ్మాయిల అవసరం ఎక్కువగా ఉంటోంది. ఎటొచ్చీ రజస్వల కావడానికి ముందే ‘అతడు’ మళ్లీ ‘ఆమె’ రూపంలోకి తప్పకుండా మారాలి. పెళ్లికి, పిల్లలను కనడానికి ఇది ఓ ముందు షరతు. బహిరంగంగా తరగతి గదుల్లో సంవత్సరాలపాటు ఆడ పిల్లలు మగవేషంలో ఉండటం, పని స్థలాల్లోనూ మారు రూపంలో మెలగడం చాలా కష్టం. ఇది తాను ఆడపిల్లను అనే ఎరుకతో ఉంటూనే బయటి సమాజంలో అచ్చం అబ్బాయిలా మెలగడం. అబ్బాయి వేషం దాల్చినప్పటినుంచి ఆమె కుట్టడం, బొమ్మలాటలు మానేయాలి. వాటికి బదులు సైక్లింగ్, సాకర్, పరుగు పందేలలో పాల్గొనాలి. సగటు అబ్బాయికి భిన్నంగా ఆమె ప్రవర్తన ఉండరాదు. అలాగని వయసొచ్చిన అబ్బాయి లకు సన్నిహితంగా ఉండకూడదు. పొరపాటున వారు ఆమెను తాకినా, ఆమే వారిని తాకినా ఆమె అపవిత్రురాలై పోతుంది. గుట్టు బయటపడితే కుటుంబం పరువు పోవడంతోపాటు ఇక పెళ్లయ్యే అవకాశం కూడా ఉండదు. అందుకే మైనర్ బాలికలే ఆ దేశంలో ‘బచా పోష్’లుగా ఉంటున్నారు. తమ మధ్యన కూర్చున్నది అబ్బాయి రూపంలోని అమ్మాయి అని తెలిస్తే విద్యార్థులు భోజనం కూడా ముట్టరు. ఇక బయట పనిచేయవ లసిన బచా పోష్లకు మరీ కష్టం. షెల్ఫ్ పైనుంచి సరకులను తీసేటప్పుడు తన లోపల దాగిన ఆడతనం బయటపడకూడదు. పైగా దుకాణాల్లో కస్టమర్లకేసి నేరుగా చూస్తే తన మారు వేషం బయటపడొచ్చు. చివరకు ఎక్కువ మాట్లాడినా కష్టమే. ఎందుకంటే మాట్లాడితే అమ్మాయి గొంతు అని తెలిసిపోతుంది. ఇంత కష్టపడి ఆమె సంపాదించే రోజుకూలీ ఎనిమిదిమంది అక్కాచెల్లెళ్లున్న కుటుంబానికి ఏమాత్రం సరిపోదు. పైగా పుస్తూన్ మహిళలు, బాలికలు కొట్లలో పనిచేయడం నిషిద్ధం. పదేళ్లలోపు అమ్మాయి, అబ్బాయి అవతారమెత్తితే ఇన్ని ప్రమాదాలను ఎదుర్కోవాలి. వయసు పెద్దదయితే ఆమె తన కొత్త వేషం వదులుకోవాలి. ఆమె చెల్లి ఇకపై అబ్బాయిగా మారుతుంది. నిత్య ఘర్షణలతో నలిగిపోతున్న ఆప్ఘనిస్తాన్‌లో కుటుంబానికి కాసింత ఆసరా ఏ మూలనుంచి లభించినా అది కొండంత సహాయమే మరి. దేశంలోని అన్ని గ్రామాల్లో స్కూళ్లలో, స్టోర్లలో, హోటళ్లలో ఇలా ప్రతి చోటా వీరి ఉనికి కనబడుతోంది. చరిత్రలో ‘మగమ్మాయిలు’: ప్రాచ్య, పాశ్చాత్య దేశాల చరి త్రలో ఇలాంటి మగమ్మాయిలకు కొదవలేదు. ప్రాచీన కాలంలో పలువురు మహిళలు సైనికులుగా అవతరించారు. క్రీ.శ తొలి శతాబ్దంలోనే రోమ్ రాణి ట్రయారియా తన చక్రవర్తి భర్తతో కలిసి పురుషవేషంతో యుద్ధంలో పాల్గొన్నది. మూడో శతాబ్దంలో సిరియా రాణి జెనోబియా సైనిక దుస్తులతో రోమన్ సామ్రాజ్యంతో యుద్ధం చేసింది. ఇదే కాలంలో చైనాలో హువా ములన్ తన తండ్రి స్థానంలో అతడి దుస్తులు ధరించి యుద్ధంలోకి దిగింది. 1424లో ఇంగ్లండ్‌పై ఫ్రాన్స్ యుద్ధంలో జోన్ ఆఫ్ ఆర్క్ సైనికుడిలా పాల్గొని చరిత్రకెక్కింది. మన కాకతీయ సామ్రాజ్యంలో గణపతిదేవుడి కుమార్తె రుద్రమదేవి పురుష వేషంలోనే రాజ్యాన్ని పాలించింది. పురుషులకు, తమకు మధ్య ఉన్న తేడా ఏమిటిని అడిగితే ‘స్వతంత్రం’ అని నేడు ఆప్ఘన్ మహిళలు ముక్తకంఠంతో జవాబిస్తున్నారు. అక్కడ పురుషులకు ఉన్నదీ, మహిళలకు లేనిదీ ఆ మూడక్షరాలే. వారికి పుట్టుక మాత్రమే వాస్తవం. లైంగికత, స్వతంత్రం అనేవి కేవలం ఆదర్శాలు. ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి తమ లైంగికతను పరిత్యజించడం తప్పనప్పుడు... పొడుగు జడలు, కురచ జుత్తు, ప్యాంట్, స్కర్ట్ వంటి వాటి గురించి ఎవరు పట్టించుకుంటారు? ఖైదీగానో, బానిస గానో ఇంట్లో పడి ఉండటమే జీవితం అవుతున్న చోట మారు రూపంలో గడప దాటడానికి ఎవరు సంశయిస్తారు? ఆప్ఘనిస్తాన్‌లో అబ్బాయిల్లా జీవిస్తున్న మెహ్రాన్, షబ్నమ్, నీమా వంటి వేలాదిమంది అమ్మాయిలకు ఇష్టంలేని పెళ్లిని తప్పించుకో వడం, ఇల్లు దాటి బయట అడుగుపెట్టడమే నేడు స్వతంత్రం. కె.రాజశేఖరరాజు