breaking news
malaise
-
అంబులెన్సు లేక ఆగిన ప్రాణం
రత్లామ్: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారిని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్సు లేకపోవడంతో తల్లిదండ్రులు బైక్‌పై తీసుకెళ్లగా మార్గమధ్యంలోనే ఆ చిన్నారి ప్రాణాలుకోల్పోయింది. ఈ హృదయవిదారక ఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. నంద్లేటా గ్రామానికి చెందిన ఘన్‌శ్యామ్ నాథ్, దీనాబాయి దంపతుల కుమార్తె జీజా(4)న్యూమోనియాతో తీవ్రమైన జ్వరం రావడంతో ఆమెను సైలానాలోని సామాజిక ఆరోగ్యకేంద్రంలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం రత్లామ్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. దినసరి కూలీ అయిన ఘనశ్యామ్ తన కుమార్తెను రత్లామ్‌కు తీసుకెళ్లేందుకు అంబులెన్సును ఇవ్వాల్సిందిగా కోరగా ఆరోగ్యకేంద్రం సిబ్బంది అందుకు నిరాకరించారు. దీంతో స్నేహితుడి బైక్‌ను తెచ్చారు. ఆ స్నేహితుడు బైక్ నడుపుతుంటే జీజాను ఘనశ్యామ్, చిన్నారి చేతికి అమర్చిన సెలైన్‌ను భార్య పట్టుకున్నారు. ఇలా బైక్‌పై 30 కి.మీ దూరంలో ఉన్న రత్లామ్ ప్రభుత్వాసుపత్రికి చిన్నారిని తీసుకెళ్లారు. అక్కడ జీజాను పరీక్షించిన వైద్యులు ఆమె మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయిందని నిర్ధారించారు. -
భరోసా లేని ప్రాణాలు
నిజామాబాద్క్రైం/సుభాష్‌నగర్,న్యూస్‌లైన్: జిల్లా కేంద్ర కారాగారంలో అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్న ఇద్దరు శుక్రవారం అస్వస్థకు గురై మృతి చెందడం జైలు అధికారుల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. ఖైదీలు అనారోగ్యంతో మృతి చెందారని అధికారులు పేర్కొంటుండగా... అధికారులు ఇచ్చిన కలుషిత ఆహారమే విషమై తమవారిని బలి గొందని ఖైదీల బంధువులు ఆరోపించారు. బాధ్యులైన అధికారులను శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... డిచ్పల్లి మండల కేంద్రానికి చెందిన సూరి నేడీ సాయిలు(28) 2010 సంవత్సరంలో హత్యాయత్నం కేసులో అరెస్టు అయ్యాడు. బెయిల్‌పై విడుదలైన సాయిలు కోర్టు పేషీలకు హాజరు కాలేదు. దీంతో అరెస్టు వారెం ట్‌తో పోలీసులు ఈ ఏడాది మేలో పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు. ఇతనిని సారంగపూర్‌లోని జిల్లా జైలుకు పంపారు. ఈ క్రమంలో సాయిలు అనారోగ్యంతో జైలు ఆవరణలో కుప్ప కూలిపోవడంతో అధికారులు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరిన కొద్ది సేపటికే సాయిలు మృతి చెందాడు. ఈయనకు భార్య, కూతురు ఉన్నారు. ప్రస్తుతం సాయిలు భార్య గ ర్భవతి! అదేవిధంగా నిజామాబాద్ నగరంలోని పులాంగ్ ప్రాంతానికి చెందిన కొంగల భాస్కర్(30) చీటింగ్ కేసులో అరెస్టు అయి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇతను కూడా కోర్టు పేషీలకు హాజరు కాకపోవటంతో అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. పోలీసులు అక్టోబర్ 1న అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చగా జైలుకు పంపారు. అస్వస్థతకు గురైన సాయిలును ఆస్పత్రికి తరలించిన గంటలోపే భాస్కర్ అదే రీతిలో తీవ్ర ఆనారోగ్యంతో కింద పడిపోయాడు. జైలు అధికారులు గమనించి భాస్కర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ భాస్కర్ సైతం ఆస్పత్రిలో మృతి చెందాడు. ఇద్దరు ఖైదీలు ఒకేరోజు అస్వస్థత కారణంగా మృతి చెందటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖైదీల మృతికి కారణం పోస్టుమార్టంలో వెల్లడవుతుందని పోలీసులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా జైలుకు వచ్చే ఖైదీలు ఇక్కడి అధికారులు తీరువల్ల మరింత మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఖైదీల పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం ఒక కారణం కాగా, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఖైదీలకు శాపంగా మారిందని అంటున్నారు. ఖైదీలకు ఇచ్చే ఆహారంలోనూ పోషక పదార్థాలు లోపిస్తున్నాయనే విమర్శలు లేకపోలేదు. మెనూ ప్రకారం ఖైదీలకు ఆహారం అందడం లేదని, వారికి అందించే మాంసంలోనూ కోత విధించి జైలు సిబ్బంది జల్సాలు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా జైలు అధికారి ఒకరు ఖైదీల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు పలువురు ఖైదీల కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నింటికి ఒకే మాత్ర ఖైదీలకు వైద్య సేవల నిమిత్తం జిల్లా జైలుకు నెలకు రూ. 50 వేలు మంజూరవుతున్నట్లు సమాచారం. అయితే అందులో నుంచి రూ. 10 వేల లోపే ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ఖైదీలకు ఏ రోగం వచ్చినా ఒకే రకమైన మాత్రను ఇస్తున్నట్లు తెలుస్తోంది. మృతులకు రూ. 5 లక్షలు అందేనా ? జైలులో ఖైదీలు మృతి చెందితే వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారాన్ని జైలు శాఖ అందజేస్తుంది. అయితే ఖెదీ మృతి ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటారు. దీంతో అనారోగానికి గురైన ఖైదీలు జైలులోనే మృతి చెందినప్పటికీ అధికారులు ఆ విధంగా రికార్డులు నమోదు చేయడం లేదనిఅంటున్నారు. ఖైదీని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో... లేదా చికిత్స పొందుతూ మృతి చెందాడని నివేదికను ఉన్నతాధికారులకు పంపించి తమపై తప్పు రాకుండా చూసుకుంటారు. ఈ విధంగా ఖైదీల కుటుంబాలకు రావాల్సి పారితోషికం రాకుండా పోతోంది. డిప్యూటీ జైలర్‌పై చర్యలు తీసుకోవాలి జిల్లా జైలులో ఇద్దరు ఖైదీల మృతికి డిప్యూటీ జైలర్ బాధ్యత వహించాలని టీఆర్ఎస్ నగర మహిళా అధ్యక్షురాలు విజయ లక్ష్మి డిమాండ్ చేశారు.అధికారిని సస్పెండ్ చేయాలని కోరుతూ పోస్టుమార్టమ్ గది ఎదుట కొంత మంది టీఆర్ఎస్ మహిళా నాయకులు ఆందోళన నిర్వహించారు. రాఖీ పండుగ రోజున కూడ జైళ్లో ఖైదీలకు సరైన ఏర్పాటు చేయలేదన్నారు. జైలులో సీమాంధ్రాకు చెందిన సిబ్బందే ఎక్కువగా ఉన్నారని, ఈ కారణంగా ఇక్కడి ఖైదీలు వివక్షకు గురవుతున్నారని ఆరోపించారు. ఈ ఆందోళనలో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిలకల రాజు తదితరులు ఉన్నారు. కలెక్టర్ స్పందించి జిల్లా జైలులో జరుగుతున్న ఘటనలపై వాచారణ జరిపించాలని మృతి చెందిన ఖైదీల కుటుంబ సభ్యులు కోరారు. చనిపోయిన విషయం దాచిపెట్టారు.. జైలు అధికారులు తన భర్త చనిపోయిన విషయం దాచిపెట్టారని మృతుడు సాయిలు భార్య రజిత పేర్కొంది.ఆస్పత్రికి వచ్చే వరకు గానీ తన భర్త చనిపోయిన విషయం తెలియ లేదన్నారు. అస్వస్థతతోనే ఖైదీల మృతి.. జైలులో ఇద్దరు ఖైదీలు అస్వస్థతకు గురికావటంతో చికిత్స కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పతికి తరలించామని డిప్యుటీ జైలర్ మోహన్‌రావు తెలిపారు. వారికి చికిత్స జరుగుతున్న సమయంలో మృతి చెందారని ఆయన మీడియాతో పేర్కొన్నారు.