breaking news
maktal mla
-
'పోలీస్ కావాలనుకొని ఎమ్మెల్యేనయ్యాను'
తండ్రి ఆశయాలు.. నమ్మిన సిద్ధాంతాలను ఒంట బట్టించుకున్నారాయన. పోలీస్ అధికారి కావాలనే సంకల్పం చిన్ననాటి నుండే దృఢంగా ఉన్నా.. తండ్రి కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాసేవకు అంకితమైన తన తండ్రీ, తమ్ముడు నక్సలైట్ల తూటాలకు బలవడంతో ఆరు నెలల పాటు మంచంపట్టారు. ప్రజాసంక్షేమం.. అభివృద్ధి గురించి తరచూ తన తండ్రి చెప్పిన మాటలు.. తపన ఆయన్ను ప్రశాంతంగా నిద్రపోనీయలేదు. తండ్రి ఆశయం కోసం.. జనానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయన్ను ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. నాన్న ఆశయమే తన లక్ష్యమని చెబుతున్న మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డితో ‘సాక్షి’ ఈ వారం పర్సనల్ టైం.. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : మాది నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రం. నేను పుట్టింది అక్కడే అయినా తర్వాత మక్తల్‌లో స్థిరపడ్డాం. నాన్న చిట్టెం నర్సిరెడ్డి, అమ్మ సుమిత్రారెడ్డి. నాన్న స్వాతంత్య్ర సమరయోధులు.. మూడుసార్లు ఎమ్మెల్యేగా.. రెండుసార్లు ఎమ్మెల్సీగా ప్రజలకు సేవలందించారు. మేం ఇద్దరం అన్నదమ్ములం.. ఇద్దరు చెల్లెళ్లు. తమ్ముడు వెంకటేశ్వర్‌రెడ్డి ఇప్పుడు లేరు (చనిపోయారు). చెల్లెళ్లకు పెళ్లిళ్లయ్యాయి. 1986లో రంగారెడ్డి జిల్లాకు చెందిన సుచరితతో నాకు వివాహమైంది. మాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దబ్బాయి చాణక్యకు పెళ్లయింది. హైదారాబాద్‌లో ఎల్ఈడీ బల్బుల తయారీ కంపెనీ ఉంది. రెండో బాబు పృథ్వీష్ ఎంబీఏ చదివాడు. పోలీస్ అధికారి కావాలనే కోరిక తీరలే చిన్నప్పటి నుంచి నాకు పోలీస్ అధికారి కావాలనే కోరిక ఉండె. పోలీసులను చూస్తే చాలు.. వారి స్థానంలో నేనున్నట్లు ఊహించుకునేవాడిని. ధన్వాడలో ఆరోతరగతి వరకు చదివా. ఉన్నత చదువుల కోసం 1970లో నాన్న మమ్మల్ని హైదరాబాద్‌కు షిఫ్ట్ చేశారు. అక్కడే డిగ్రీ పూర్తి చేశా. అప్పటికే పోలీస్ కావాలనే కోరిక నాలో బలంగా నాటుకుపోయింది. కానీ ఇంట్లో నన్ను పోలీస్‌గా కాకుండా ప్రజలకు సేవచేసే ఓ ప్రజాప్రతినిధిగా చూడాలనుకున్నారు. అప్పట్లో ఓ సారి ఎస్ఐ రిక్రూట్మెంట్లో పాల్గొన్నా రాలె. తర్వాత చదువు మానేసి 1984 నుంచి వ్యాపారంలోకి దిగా. నాన్న వెంట రాజకీయాల్లో తిరుగుతుంటే అసలు లీడర్ అంటే ఏంటో..? నాకు తెలిసింది. జనానికి బాగు చేయాలనే నాన్న తపన.. నాన్నపై జనానికి ఉన్న గౌరవ, మర్యాదలు నా దృష్టిని రాజకీయాలవైపు మళ్లించాయి. నా జీవితంలో అదో దుర్దినం అది ఆగస్టు 15, 2005.. స్వాతంత్య్ర దినం. ఆ రోజు దేశవ్యాప్తంగా అందరూ ఘనంగా జాతీయ పండుగ నిర్వహించుకుంటున్న సందర్భం. నారాయణపేటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మా నాన్న ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు స్థానిక ఎస్సీవాడకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ కాపుకాసిన నక్సలైట్లు కాల్పులు జరిపారు. వారి తూటాలకు నాన్న, నా తమ్ముడు వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు.. గన్మెన్లు మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో ఆరు నెలల వరకు నేను కోలుకోలేక మంచానపడ్డా. భార్య సుచరిత, కుటుంబ సభ్యులు నన్ను వెన్నుతట్టి నడిపించారు. కాంగ్రెస్ అధిష్టానం నన్ను పిలిచి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కోరింది. అప్పుడు తొలిసారిగా పోటీ చేసి ఎమ్మెల్యేనయిన. రెండోసారి 2014లో అదే పార్టీ నుంచే పోటీ చేసి మక్తల్ ఎమ్మెల్యేగా గెలిచా. చివరికి నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను 2016లో టీఆర్ఎస్లో చేరాల్సి వచ్చింది. ‘సంగంబండ’ సంతృప్తినిచ్చింది 2004లో మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో 65వేల ఎకరాలకు సాగునీరందించేలా సంగంబండ రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేశారు. 2005లో ఆయన చనిపోయిన తర్వాత పనులు పడకేశాయి. అప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిచి కాల్వలు తవ్వించిన. 2009 ఎన్నికల్లో నేను ఓడిపోయాక ఆ పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత 2014లో గెలిచినా నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నందున నిధులు రాలేదు. 2016లో కేసీఆర్ పిలిచి నాన్న ప్రారంభించిన ప్రాజెక్టు పూర్తి చేద్దామన్నారు. టీఆర్ఎస్ చేరిన తర్వాత పనులు దాదాపుగా పూర్తయ్యాయి. నాన్న ప్రారంభించిన పనులు పూర్తి కావడం సంతృప్తినిచ్చింది. వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలనుంది ఎమ్మెల్యేగా వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు చాలా మంది ముసలివాళ్లతో మాట్లాడతా. వారిలో సగానికి పైగా మంది నాతో వారి బాధలు చెప్తారు. వారు పడుతున్న ఇబ్బందులు వింటుంటే కళ్లలో నీళ్లొస్తాయి. కని, పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులను ఆఖరి మజిలీలోనైనా బాగా చూసుకోని వారి కొడుకులు, కూతుళ్లపై కోపం వస్తుంది. ఓ ఎమ్మెల్యేగా ప్రభుత్వం నుంచి వారికి సాయం అందేలా చర్యలు తీసుకుంటున్న. అంతేకాదు ఉన్నత ఆశయాలు.. ప్రజాసేవే పరమావధిగా భావించిన నా తండ్రికి M öడుకుగా సమాజంలో ఆదరణకు నోచుకోని వృద్ధుల కోసం ఆశ్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నా. నారాయణపేట ఇప్పుడు జిల్లా అయింది కాబట్టి అక్కడ ఏర్పాటు చేయాలా? లేదా మహబూబ్నగర్లోనా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. జనంలో చైతన్యం వస్తోంది మా నాన్న సర్పంచ్‌గా.. సమితి ప్రెసిడెంట్‌గా.. ఎమ్మెల్యేగా.. ఎమ్మెల్సీగా ఎన్నో ఏళ్లపాటు ప్రజలకు సేవలందించారు. నేనూ నాన్నతో కలిసి ఎక్కువగా తిరిగేవాడిని.. పలు సందర్భాల్లో ఏదైనా పని ఉంటే తాను వెళ్లకుండా నన్ను పంపేవారు. అప్పట్లో ఏ ఊరికి వెళ్లినా.. అక్కడి పెద్ద మనిషిని పిలిచి మాట్లాడి వచ్చేవాళ్లం. ఏ అభివృద్ధి కార్యక్రమం ఉన్నా ఊరి పెద్ద మనుషులతో చర్చించేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. ప్రజాప్రతినిధులు ఎక్కడికి వెళ్లినా అక్కడి సమస్యలపై జనం ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నిలదీస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి చైతన్యం రావడం అభివృద్ధికి నాంది. కొండంత ధైర్యం రాజకీయ, వ్యక్తిగత జీవితంలో నాకెన్నో సమస్యలున్నాయి. తల్లిదండ్రులు ఉన్నంతకాలం నాకు ధైర్యానిచ్చేవారు. ఇప్పుడు నా బలం అంతా మా ఆవిడే. నాకు ఏ సమస్య వచ్చినా సుచరితతో చెప్తా. అర్ధాంగిగా నా కష్టసుఖాల్లో తోడుగా ఉంటుంది. నాన్న, తమ్ముడు చనిపోయినప్పుడు నేను మంచాన పడ్డా. జీవితంలో ఏదీ సాధించలేననే భావన ఉండేది. కానీ సుచరిత నన్ను మామూలు మనిషిని చేసింది. నాన్న మీద ఉన్న ప్రేమను జనానికి పంచాలని చెప్పింది. ఆమె నా భార్య కావడం అదృష్టంగా భావిస్తున్నా. మామయ్యే మార్గదర్శి.. మామయ్య అంటే మా ఆయనకు ఎంతో ఇష్టం. మామయ్యే ఆయనకు మార్గదర్శి. ఎప్పుడు.. ఏం మాట్లాడినా అందులో ఏదో ఒక రూపంలో మామయ్య ప్రస్తావన కచ్చితంగా తెస్తారు. ఎప్పుడూ జనానికి ఏం చేయాలనే ఆలోచనలో మా ఆయన ఉంటారు. వారికి మంచి చేయాలనే నిస్వార్థ రాజకీయ కుటుంబానికి కోడలిగా అయినందుకు ఎంతో గర్వపడుతున్నా. ప్రజా జీవితంలో వ్యక్తిగతం అనే ప్రస్తావన రావొద్దనేది మా ఆయన భావన. ఎమ్మెల్యే అయిన తర్వాత కుటుంబానికి పరిమిత సమయమే కేటాయిస్తున్నారు. ప్రజాసేవలోనే ఎక్కువగా గడుపుతారు. అమెరికా తిరిగొద్దామని పదేళ్ల క్రితం నిర్ణయించుకున్నాం. అయినా ఇంతవరకు వెళ్లలేకపోయాం. వీసా గడువు పూర్తయ్యేలోగా అక్కడికి వెళ్లి రావాలని ఉంది. – సుచరిత, ఎమ్మెల్యే భార్య -
గులాబీ గూటికి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
సీఎం కేసీఆర్ సమక్షంలో చేరిన మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లోకి మరో చేరిక జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి బుధవారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి సి.లక్ష్మారెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజులతో కలసి సీఎం అధికారిక నివాసానికి వచ్చిన రామ్మోహన్‌రెడ్డికి... ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ సోదరుడైన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి, టీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రెండు నెలలుగా ప్రచారం జరుగుతోంది. గత నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనే ఆయనతోపాటు డీకే అరుణ కూడా చేరనున్నారని వార్తలు వెలువడ్డాయి. దీనిని డీకే అరుణ ఖండించగా... రామ్మోహన్‌రెడ్డి మాత్రం గులాబీ గూటికి చేరారు. ఇదే బాటలో మరికొందరు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరగా.. చిట్టెం చేరికతో ఆ సంఖ్య ఐదుకు చేరింది. ఇక మహబూబ్‌నగర్ జిల్లాకే చెందిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా త్వరలోనే టీఆర్ఎస్లో చేరేందుకు ఏర్పా ట్లు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు ఇదే జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి, ఓ మాజీ ఎమ్మెల్యే కూడా చేరికల వరుసలో ఉన్నట్లు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఒకరిద్దరు ప్రజా ప్రతినిధులు సైతం టీఆర్ఎస్ ప్లీనరీలోగా గులాబీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందంటున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ఒకరిద్దరు నేతలు కూడా టీఆర్ఎస్ గూటికి చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. ‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే’ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామి కావాలనే ఆకాంక్షతోనే టీఆర్ఎస్లో చేరినట్లు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి చెప్పారు. తన నియోజకవర్గం అభివృద్ధికి కూడా సీఎం హామీ ఇచ్చారని, తన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమం తనకు ప్రధానమని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజె క్టులను పూర్తి చేయడానికి సీఎం కేసీఆర్ చూపిస్తున్న చొరవ తనను ఆకర్షించిందన్నారు. తన తండ్రి నర్సిరెడ్డి కూడా నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి కావాలని కోరుకున్నారని, భీమా ప్రాజెక్టు రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. తన సోదరి డీకె అరుణ రాజకీయం వేరని, తన రాజకీయం వేరని వ్యాఖ్యానించారు.