breaking news
Major Mukund Varadarajan
-
ముకుంద్ వరదరాజన్‌కు అశోకచక్ర అవార్డు
టీనగర్: ఈ ఏడాది అశోకచక్ర అవార్డుకు చెన్నై తాంబరానికి చెందిన సైనిక మేజర్ ముకుంద్ వరదరాజన్, నాయక్ నీరజ్‌కుమార్ పేర్లను ప్రకటించారు. గత ఏడాది ఏప్రిల్ 25వ తేదీ కాశ్మీర్ సోపియాన్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు తీవ్రవాదులు చొరబడి దాడులు జరిపారు. వారిని పట్టుకునేందుకు వెళ్లారు. ఇక్కడ జరిగిన దాడిలో మేజర్ ముకుంద్ వరదరాజన్ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రవాదులతో వీరోచితంగా పోరాడిన ఆయన ఇద్దరిని హతమార్చి తను ప్రాణత్యాగం చేశారు. అదేవిధంగా నాయక్ నీరజ్‌కుమార్ గత ఏడాది ఆగస్టు 24వ తేదీన కాశ్మీర్ గుబ్వారా జిల్లాలో తీవ్రవాదుల తుపాకీ కాల్పుల్లో మృతిచెందారు. సోమవారం ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలలో మేజర్ ముకుంద్ వరదరాజన్ భార్య ఇందు రెబెక్కాకు రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ అశోకచక్ర అవార్డు అందజేశారు. అదేవిధంగా నాయక్ నీరజ్‌కుమార్ భార్య అశోక చక్ర అవార్డును అందుకున్నారు. ఆరుగురు తమిళులకు పద్మ అవార్డులు తమిళనాడుకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు సుధారఘునాథన్, మాజీ భారత ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాల సామితో సహా ఆరుగురిని పద్మ అవార్డులు వరించాయి. అనేక రంగాలలో రాణించిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ అవార్డులను అందజేసి గౌరవిస్తోంది. ఈ ఏడాదికి పద్మ అవార్డులకు 104 మంది ఎంపికయ్యారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎంఆర్ శ్రీనివాసన్‌కు పద్మ విభూషణ్ అవార్డు, ఎన్ గోపాలసామి, సుధా రఘునాథన్ పద్మభూషణ్ అవార్డులకు ఎంపికయ్యూరు. ఎ.కన్యాకుమారి, పివి రాజారామన్, దివంగత ఆర్.వాసుదేవన్‌కు పద్మశ్రీ అవార్డులు అందజేశారు. -
మేజర్ ముకుంద్‌కు అశోకచక్ర
12 మందికి శౌర్యచక్ర మొత్తం 55 మందికి సాహస పతకాలను ప్రకటించిన కేంద్రం న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను ఎన్కౌంటర్లో హతమార్చి, అమరుడైన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్(31)కు శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత శౌర్య పతకం అశోక చక్రను కేంద్రం ప్రకటించింది. అలాగే విధి నిర్వహణలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన మరో 12 మందికి దేశ మూడో అత్యున్నత శౌర్య పతకమైన శౌర్య చక్ర ప్రకటించింది. వీరిలో నలుగురు మరణానంతరం ఈ పతకానికి ఎంపికయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది సాయుధ బలగాల సిబ్బందికి మొత్తం 55 శౌర్య పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ఒక అశోక చక్ర, 12 శౌర్య చక్ర, 39 సేనా పతకాలు, ఒక నవో సేనా పతకం, 2 వాయు సేనా పతకాలు ఉన్నాయి. కాగా, 44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు నేతృత్వం వహించిన మేజర్ ముకుంద్ కాశ్మీర్‌లోని ఖాజీపత్రి గ్రామం వద్ద ఉగ్రవాదులతో హోరాహోరీ తలపడి ఇద్దరిని హతమార్చారు. రక్తమోడుతున్నా.. నేలపై పాకుతూ వెళ్లి వారిని కాల్చిచంపి, ఎన్నికల సిబ్బందిని కాపాడారు. ఈ సంఘటనలో మూడో ఉగ్రవాదిని చంపిన మరో వీర సైనికుడికీ మరణానంతరం శౌర్యచక్ర లభించింది. -
కన్నీటి వీడ్కోలు
తీవ్రవాదుల కాల్పుల్లో అమరుడైన మిలటరీ మేజర్ ముకుంద్ వరదరాజన్‌కు సోమవారం చెన్నైలో కన్నీటి వీడ్కోలు పలికారు. అశేష జన సందోహం నడుమ అంతిమ యాత్ర సాగింది. రాజకీయ పక్షాల నేతలు తరలివచ్చి, అమరవీరుడి భౌతిక కాయానికి ఘన నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి రూ.పది లక్షల చెక్కును రాష్ర్ట ప్రభుత్వం తరపున మంత్రి చిన్నయ్య అందజేశారు. సాక్షి, చెన్నై:జమ్ము కాశ్మీర్ రాష్ట్రం సోఫియా జిల్లాలో తీవ్రవాదులను పట్టుకునే క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మేజర్ ముకుంద్ వరదరాజన్ అమరుడైన విషయం తెలిసిందే. మేజర్ ముకుంద్ వరదరాజన్ చెన్నైవాసి కావడంతో ఆయన భౌతికకాయూన్ని ఇక్కడికి తరలించారు. ఆదివారం అర్ధరాత్రి మీనంబాక్కం విమానాశ్రయంలో మేజర్ భౌతిక కాయూన్ని స్వాధీనం చేసుకున్న ఆర్మీ అధికారులు ఉదయాన్నే ఈస్ట్ తాంబరం ప్రొఫెసర్స్ కాలనీలోని ఆయన నివాసానికి తరలించారు. తండ్రి వరదరాజన్, తల్లి గీత, సతీమణి ఇందుతో పాటుగా ఆప్తులు, సన్నిహితులు, స్థానికులు శోకతప్త హృదయంతో ముకుంద్ భౌతిక కాయం వద్ద కన్నీటి నివాళులర్పించారు. ముకుంద్ ధరించిన ఆర్మీ దుస్తులను ఆయన సతీమణి ఇందుకు అప్పగించారు. ఈ సమయంలో ముక్కు పచ్చలారని హర్షిత(3) తన తండ్రి భౌతిక కాయం ఉన్న బాక్సు వద్ద పుష్పగుచ్ఛం ఉంచడం అక్కడున్న వాళ్లను కంట తడి పెట్టించింది. అశ్రు నివాళి: ముకుంద్‌కు నివాళులర్పిస్తూ వెస్ట్, ఈస్ట్ తాంబరం, మేడవాక్కం, వేళచ్చేరి పరిసరాల్లో పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటయ్యాయి. ఆ పరిసరాల్లోని యువకులు ముకుంద్‌కు తమ నివాళిని తెలియజేస్తూ, దేశం కోసం అమరుడైన వారికి కన్నీటి నివాళులర్పిద్దాం అని ప్రజలకు పిలుపునిచ్చే విధంగా ఆపోస్టర్లు ఏర్పాటు అయ్యాయి. దీంతో ప్రొఫెసర్స్ కాలనీకి పెద్ద ఎత్తున జన ం తరలి వచ్చారు. రాష్ట్ర మంత్రి చిన్నయ్య, కాంచీపురం జిల్లా కలెక్టర్ భాస్కరన్ ప్రభుత్వం తరపున నివాళులర్పించారు. సీఎం జయలలిత ప్రకటించిన రూ.పది లక్షల చెక్కును ముకుంద్ తండ్రి వరదరాజన్‌కు అందజేశారు. పల్లావరం ఎమ్మెల్యే ధన్సింగ్, తాంబరం మునిసిపల్ చైర్మన్ కరిగాలన్, శ్రీ పెరంబదూరు అన్నాడీఎంకే ఎంపీ అభ్యర్థి రామచంద్రన్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్, కాంగ్రెస్ చెన్నై జిల్లా పార్టీ నేత కరాటే త్యాగరాజన్, డీఎంకే తరపున మాజీ మంత్రి తాము అన్భరసు, మాజీ ఎమ్మెల్యే రాజా, బీజేపీ తరపున ఆ పార్టీ జాతీయ మహిళా నేత తమిళిసై సౌందరరాజన్తోపాటుగా పెద్ద ఎత్తున వివిధ పార్టీలు, ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులు ముకుంద్‌కు ఘన నివాళులర్పించారు. రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య ఓ ప్రకటనలతో తన సంతాపం తెలియజేశారు. ముకుంద్ కుటుంబానికి తన సానుభూతి తెలియజేశారు. అంత్యక్రియలు: ప్రొఫెసర్ కాలనీ నుంచి ఆర్మీ లాంఛనాలతో ముకుంద్ పార్థివ దేహానికి అంతిమ యాత్ర ఆరంభం అయింది. ఆర్మీ అధికారి సంజీవ్ చోప్రా తదితరులతో పాటుగా ఆర్మీ సిబ్బంది, పెద్ద ఎత్తున జన సందోహం అంతిమయాత్రలో పాల్గొన్నారు. బెసెంట్ నగర్ శ్మశాన వాటికలో ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 42 తూటాలు గాల్లో పేలగా, ముకుంద్ భౌతిక కాయాన్ని ఎలక్ట్రానిక్ శ్మశాన వాటికలో దహనం చేశారు. ఈ సందర్భంగా అమరుడికి అక్కడున్న జనం, ఆర్మీ సిబ్బంది, అధికారులు నివాళి అర్పించారు.