breaking news
Majidhussen
-
మాజిద్ హల్చల్
సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పాలక మండలి తొలి సమావేశంలో మాజీ మేయర్, ప్రస్తుత మెహదీపట్నం కార్పొరేటర్ మాజిద్‌హుస్సేన్ హంగామా సృష్టించారు. ప్రభుత్వం ప్రకటించిన వంద రోజుల ప్రణాళికలో చేపట్టిన పనులన్నీ పాతవేనని... కొత్తగా చేస్తున్నవేమిటని ప్రశ్నించారు. వార్డు కమిటీలు రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయాల్సినవేనని.. 569 రహదారుల పనుల బాధ్యత జీహెచ్ఎంసీపై ఉందన్నారు. శ్మశాన వాటికల అభివృద్ధి పనులు ఏడాదిన్నర క్రితం మంజూరైనవేనని చెప్పారు. 350 ఖాళీ ప్రదేశాలకు ప్రహరీలు నిర్మించేబదులు వాటిలో ఫంక్షన్ హాళ్లు, వృద్ధాశ్రమాలు, ఈ లైబ్రరీలు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రశ్నను ముగించాలని... కమిషనర్ సమాధానమిస్తారని మేయర్ పదేపదే వారించినా మాజిద్ పట్టించుకోలేదు. తన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా అందిన సమాధానం సంతృప్తికరంగా లేనందునే వీటిని ప్రస్తావిస్తున్నానన్నారు. ‘మేం చెప్పేది వినిపించుకోనప్పుడు.. కౌన్సిల్‌కు ఎందుకు రావాలి? ఇంకెవరికి చెప్పుకోవాలి?’ అని ప్రశ్నించారు. మీరు సీనియర్.. కొత్తవారికి చెప్పాలి. మీరే ఎక్కువ సమయం తీసుకోవడం బాగుంటుందా? ఇదేనా డిసిప్లిన్? అంటూ మేయర్ వారించే ప్రయత్నం చేశారు. మాజిద్ అనేకసార్లు మేయర్ పోడియం వైపు వెళ్లారు. ఆయనతో పాటు మిగతా ఎంఐఎం సభ్యులంతా మేయర్ పోడియం వద్దకు చేరడంతో టీఆర్ఎస్ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. వాదోపవాదాలతో గందరగోళం నెలకొంది. రూ.5 కోట్లకు పెంచాలి కార్పొరేటర్ల బడ్జెట్‌ను రూ.5 కోట్లకు పెంచాలని.. జోనల్ కమిషనర్లకు రూ.20 లక్షల పనులకుఅధికారమివ్వాలని మాజిద్ కోరారు. తద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవచ్చున ని చెప్పారు. -
పారిశుధ్య కార్మికుల సమ్మె విరమణ
సాక్షి, సిటీబ్యూరో: ఐదు రోజులుగా కొనసాగుతున్న జీహెచ్ఎంసీ కార్మికుల సమ్మె నుంచి నగర ప్రజలకు ఉపశమనం లభించింది. బుధవారం సాయంత్రం మునిసిపల్ మంత్రి ఆయా కార్మిక సంఘాలతో జరిపిన చర్చలతో నేతలు తాత్కాలికంగా సమ్మె ఉపసంహరణకు అంగీకరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు.. పొంచివున్న అంటువ్యాధులు.. తదితర కారణాల దృష్ట్యా ఒక మెట్టు దిగినట్లు యూనియన్ల నేతలు వెల్లడించారు. బుధవారం అర్ధరాత్రి నుంచే కార్మికులు పారిశుధ్య కార్యక్రమాల్లో నిమగ్నమవుతారని పేర్కొన్నారు. సచివాలయంలో మంత్రి మహీధర్‌రెడ్డి జీహెచ్ఎంసీ మేయర్ మాజిద్‌హుస్సేన్, కమిషనర్ సోమేశ్‌కుమార్, మునిసిపల్ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో కార్మిక సం ఘాల నేతలతో చర్చలు జరిపారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కార్మిక సంఘాలు కోరినంత మేర వేతనాలు పెంచలేకపోతున్నామని మంత్రి చె ప్పారు. ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాల్ని నెలకు రూ. 6700 నుంచి రూ. 8500లకు పెంచేం దుకు అంగీకరించారు. త ద్వారా సంవత్సరానికి రూ. 53.64 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ప్రస్తుతం జీహెచ్ ఎంసీ కార్మికులకు 27 శాతం ఐఆర్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ముట్టడి.. అంతకుముందు మధ్యాహ్నం వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. సంఘాల నేతలు మాట్లాడుతూ.. కార్మికుల వేతనాలు పెంచకపోవడమే కాక, ఎస్మా ప్రయోగిస్తామని బెదిరించ డం దారుణమని దుయ్యబట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, సీపీఐ శాసనసభా పక్ష నాయకుడు గుండా మల్లేశ్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ నాయకుడు జె.చలపతిరావు, సీఐటీయూ నాయకుడు పాలడుగు భాస్కర్, బీఎం ఎస్ నాయకుడు శంకర్,ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, తదితర సంఘాలకు చెందిన నాయకులు ప్రసంగించారు. అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలించారు. -
మేయర్ మాజిద్ రాజీనామా చేస్తారా?
=మేయర్ మాజిద్ రాజీనామా చేస్తారా? =పదవి కోసం కాంగ్రెస్ కార్పొరేటర్ల ముమ్మర యత్నాలు =ఎవరి అంచనాలు, లెక్కలు వారివే! సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత మేయర్ మాజిద్‌హుస్సేన్ నేడో, రేపో రాజీనామా చేయనున్నారా?, లేక మరికొంత కాలం కొనసాగి చివరి ఏడాది కూడా ఉంటారా? అనేది ప్రస్తుతం జీహెచ్ఎంసీలో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్- ఎంఐఎం ఒప్పందం మేరకు.. మేయర్ ఐదేళ్ల పదవీ కాలంలో తొలి రెండేళ్లు.. చివరి ఏడాది కాంగ్రెస్ అభ్యర్థి మేయర్‌గా, మధ్యలోని రెండేళ్లలో ఎంఐఎం అభ్యర్థి మేయర్‌గా ఉండాలి. ఒప్పందానికి అనుగుణంగా డిసెంబర్లోనే మేయర్ మార్పు జరగాల్సి ఉన్నా.. తొలి రెండేళ్లకు ఎన్నికైన మేయర్ కార్తీకరెడ్డి రాజీనామా చేయడంలో జాప్యం, ఇతరత్రా కారణాల వల్ల 2012 జనవరి 3న మేయర్‌గా మాజిద్ హుస్సేన్ ఎన్నికయ్యారు. 5న బాధ్యతలు స్వీకరించారు. మాజిద్ ఎన్నికై రెండేళ్లు పూర్తయినందున, తిరిగి కాంగ్రెస్‌కు అవకాశం కల్పించేలా ఆయన రాజీనామా చేస్తారా? లేదా? అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. నిర్ణీత వ్యవధిలో గా కాంగ్రెస్ మేయర్ ఎన్నిక జరిగేం దుకు మొదట్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు పెద్దగా దృష్టి సారించలేదు. పార్టీ శ్రేణుల ఒత్తిడితో ఎట్టకేలకు ఇటీవలే దృష్టిపెట్టారు. ఒప్పందానికి అనుగుణంగా నడచుకునేందుకు ఎంఐఎం కూడా సానుకూలత వ్యక్తం చేయడంతో.. తమ పార్టీ అభ్యర్థి మేయర్ అయ్యేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని కొద్ది రోజుల క్రితం కాంగ్రె స్ నుంచి ఎంఐఎంకు లేఖ అందజేశారు. ముమ్మర యత్నాలు.. కాంగ్రెస్ నుంచి మేయర్ పదవి ఆశిస్తున్న వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీలోని బీసీ కార్పొరేటర్ ఒకరికి గతంలో ఇస్తామన్న డిప్యూటీ మేయర్ ఇవ్వకపోవడంతో, ఈసారి ఆయనకే మేయర్ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతుండగా, పీఆర్పీ నుంచి పోటీచేసి గెలిచిన మరో కార్పొరేటర్ కేంద్ర మంత్రి చిరంజీవి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎస్సీ వర్గానికి చెందిన ఒకరిద్దరు కార్పొరేటర్లు సైతం రేసులో ఉన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని మైనార్టీ వర్గానికి చెందిన మరో కార్పొరేటర్ మర్రి శశిధర్‌రెడ్డి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. శశిధర్‌రెడ్డి ఇటీవల పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైనట్టు సమాచారం. నగరానికి చెందిన మంత్రి దానం నాగేందర్ బీసీ కార్పొరేటర్‌కు మేయర్ పదవినివ్వాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా, తొలి రెండేళ్లు ఓసీ వర్గానికి చెందిన మహిళకు అవకాశం లభించడంతో.. ఈసారి తమకు చాన్స్ లభిస్తుందని ఎస్సీ, మైనార్టీ, బీసీ వర్గాల వారు ఊహాగానాల్లో మునిగారు. మాకే కావాలి! మరోవైపు, రిజర్వేషన్ వర్తించినప్పుడు మహిళ, బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన వారు మేయర్‌గా ఎన్నికయ్యే అవకాశాలు ఎలాగూ ఉంటాయని, ప్రస్తుతం ఓసీకి అవకాశం ఉన్నందున మిగిలిన ఏడాది సమయాన్ని సైతం తమ వర్గాలకే కేటాయించాలనేది ఓసీల వాదనగా ఉంది. మరో పది, పదిహేనేళ్ల వరకు తమకా అవకాశం రాకుండా పోయే ప్రమాదం ఉందని, కాబట్టి తిరిగి తమకే కేటాయించాలని ఓసీ వర్గాలకు చెందిన కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. వ్యవధి తక్కువ.. ప్రస్తుత మేయర్ రాజీనామా చేసినా.. కొత్త మేయర్ ఎన్నిక ప్రక్రియకు ఎంతలేదన్నా 20 రోజులు పడుతుంది. దీంతో మేయర్ రాజీనామాపైనే అందరి దృష్టి ఉంది. కాంగ్రెస్‌కు చెందిన డిప్యూటీ మేయర్ రాజీనామా చేశాకే ఎంఐఎంకు చెందిన మేయర్ రాజీనామా చేస్తారని దారుస్సలాం వర్గాల ద్వారా తెలుస్తోంది. కాంగ్రెస్- ఎంఐఎం ముఖ్యనేతలు నేడో, రేపో భేటీ కానున్నారని.. అందులో తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా ప్రస్తుత మేయర్, డిప్యూటీ మేయర్ల రాజీనామాలు ఉండవచ్చునని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా పూర్తయ్యే సరికి ఎన్నికయ్యే కొత్త మేయర్‌కు పది నెలలలోపే అధికారమే ఉంటుందని జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.