breaking news
m mahendarreddy
-
గణేష్ ఉత్సవాలతో అంతా అప్రమత్తం
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగం ప్రతి ఏటా అనేక ఉత్సవాలు, సందర్భాలకు బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తుంది. అయితే అన్నింటికంటే గణేష్ ఉత్సవాలు, ఆఖరి రోజు జరిగే సామూహిక నిమజ్జనం అత్యంత కీలకమైనవి. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అన్ని విభాగాలూ రంగంలోకి దిగాయి. నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎవరికి వారు తమ బాధ్యతల్ని నిర్వర్తించడంపై దృష్టిపెట్టారు. శాంతిభద్రతల విభాగం అధికారులు స్థానికంగా ఉన్న మండపాలు, నిమజ్జన ఊరేగింపు జరిగే మార్గాలపై దృష్టి పెట్టగా., ప్రత్యేక విభాగాలు ఇతర అంశాలపై చర్యలు తీసుకుంటున్నాయి. గణేష్ మండపాలతో పాటు నిమజ్జనం ఊరేగింపు నేపథ్యంలో డీజేలు, పరిమితికి మించి శబ్ధం చేసే సౌండ్ సిస్టమ్స్ వెలుస్తుంటాయి. వీటి కారణంగా కొన్నిసార్లు ఘర్షణలు చోటు చేసుకుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు డీజే, సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసేవారితో సమావేశమయ్యారు. మండపాల వద్ద, ఊరేగింపులోను పరిమితికి మించిన శబ్ధం చేసే సౌండ్ సిస్టమ్స్‌తో పాటు డీజేలు ఏర్పాటు చేయవద్దని స్పష్టం చేశారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి, సౌత్‌జోన్ ఇన్స్పెక్టర్ ఎ.యాదగిరి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో దీనికి సంబంధించి కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వుల్ని నిర్వాహకులకు తెలియజేశారు. వీటిని అతిక్రమిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోపక్క మండపాలతో పాటు ఊరేగింపులో ఈవ్‌టీజింగ్ ఇతర వేధింపులు లేకుండా చూడటంపై సీసీఎస్ ఆధీనంలోని ‘షీ–టీమ్స్’ చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ప్రత్యేక బృందాలు మండపాల వద్దకు వెళ్లి నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నాయి. మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా అవగాహన కల్పించడానికి షీ–టీమ్స్ ఇటీవల రూపొందించిన పాటల సీడీలను మండపాల వద్ద పంపిణీ చేస్తున్నారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ఈ బృందాలు పోకిరీల కోసం మాటువేసి ఉంటున్నాయి. -
10న హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
చార్మినార్ (హైదరాబాద్ సిటీ): పాతబస్తీలో ఈ నెల 10 (సోమవారం)న నిర్వహించనున్న అమ్మవారి ఘటాల ఊరేగింపు సందర్భంగా నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దక్షిణ మండలంలోని చార్మినార్, మీర్‌చౌక్, ఫలక్‌నుమా తదితర ఏసీపీల పరిధిలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షాలు అమలులో ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలున్నా.. తాము సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల గుండా ప్రయాణికులు, వాహనదారులు వెళ్లాలని కోరారు. పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షల వివరాలు... కందికల్‌గేట్ నుంచి లాల్‌దర్వాజ వైపు వచ్చే వాహనాలను ఛత్రినాక పోలీస్‌స్టేషన్ వద్ద టీ జంక్షన్ నుంచి గౌలిపురా మీదుగా మళ్లీస్తారు. పుల్బాగ్ నుంచి లాల్‌దర్వాజ వైపు వచ్చే వాహనాలు పత్తర్‌కీదర్గా వద్ద మళ్లీస్తారు. అక్కడి నుంచి ఛత్రినాక పాత ఏసీపీ కార్యాలయం మీదుగా వెళ్లాలి. గౌలిపురా మార్కెట్ నుంచి వచ్చే వాహనాలను సుధా టాకీస్, అశోకా ఫిల్లర్ క్రాస్ రోడ్డు మీదుగా మళ్లీస్తారు. బాలాగంజ్ నుంచి లాల్‌దర్వాజ వైపు వచ్చే వాహనాలు గౌలిపురా క్రాస్‌రోడ్డు మీదుగా వెళ్లాలి. ఉప్పుగూడ, ఛత్రినాక నుంచి వచ్చే వాహనాలను హరిబౌలి క్రాస్ రోడ్డుగా పంపిస్తారు. మీరా-కా-దయిరా, మొఘల్‌పురా నుంచి శాలిబండ వైపు వచ్చే వాహనాలను హరిబౌలి క్రాస్ రోడ్డు మీదుగా పంపిస్తారు. చాంద్రాయణగుట్ట నుంచి అలియాబాద్ వైపు వచ్చే వాహనాలను న్యూ షంషీర్గంజ్ టీ జంక్షన్ మీదుగా తాడ్బన్ వయా ఆల్మాస్ హోటల్ మీదుగా మళ్లీస్తారు. భవానీనగర్ నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనదారులు బీబీ బజార్ క్రాస్ రోడ్డు మీదుగా ఆలిజా కోట్లా రోడ్డు మీదుగా వెళ్లాలి. మొఘల్‌పురా నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను ఆలిజాకోట్లా మొఘల్‌పురా ఫైర్ స్టేషన్ మీదుగా మళ్లీస్తారు. యాకుత్‌పురా నుంచి గుల్జార్ హౌస్ వైపు వచ్చే వాహనాలను ఐత్బార్ చౌక్ మీదుగా మళ్లీస్తారు. పురానాపూల్ నుంచి లాడ్‌బజార్ వైపు వచ్చే వాహానాలను మోతీగల్లీ వైపు మళ్లీస్తారు. షక్కర్‌కోట్ నుంచి మిట్టికా షేర్ వైపు వచ్చే వాహనాలను ఘన్సీబజార్, చేలాపూర్ వైపు మళ్లీస్తారు. ఖిల్వత్ నుంచి లాడ్‌బజార్ వైపు వచ్చే వాహనాలను మోతీగల్లీ జంక్షన్ నుంచి చౌక్ మసీదు మీదుగా మళ్లీస్తారు. పురానాపూల్ మహబూబ్కీ మెహిందీ మీదుగా నయాపూల్ వైపు వెళ్లే వాహనాలు ముస్లింజంగ్ బ్రిడ్జి, బేగంబజార్ మీదుగా వెళ్లాలి. గౌలిగూడ, సిద్దంబర్ బజార్ నుంచి నయాపూల్‌కు వచ్చే వాహనాలు అఫ్జల్‌గంజ్ క్రాస్ రోడ్డు నుంచి ఉస్మానియా ఆసుపత్రి రోడ్డు మీదుగా వెళ్లాలి. ఆర్టీసీ బస్సులు పాత సిబిఎస్, దారుల్షిఫా క్రాస్ రోడ్డు,ఇంజన్‌బౌలి నుంచి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి. ఈ ప్రాంతాల్లో వెళ్లడాన్ని అనుమతించరు.. ఫతేదర్వాజ నుంచి హిమ్మత్‌పురా వైపు వాహనాలను అనుమతించారు. వీరంతా ఓల్గా హోటల్ నుంచి ఖిల్వత్ లేదా మోతీగల్లీ మీదుగా వెళ్లాలి. చాదర్ఘట్, నూర్ఖాన్ బజార్, దారుల్‌షిఫాల నుంచి నయాపూల్ వైపు వెళ్లే వాహనాలను అనుమతించరు. దారుల్షిఫా నుంచి సాలార్జంగ్ బ్రిడ్జి మీదుగా గౌలిగూడ, అఫ్జల్‌గంజ్ వైపు వెళ్లాలి.