breaking news
Lucknow mosque
-
యూపీలో బీజేపీ మరో ఎత్తుగడ
లక్నో : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నలు ముమ్మరం చేస్తోంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో లక్ష్మణుడు విగ్రహం ఏర్పాటు చేయాలని యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం భావిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేలు రామకృష్ణ యాదవ్, రజ్నీష్ గుప్తాలు లక్నోలో లక్ష్మణుడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. లక్నోలోని చారిత్రాత్మక తేలి వాలీ మసీద్‌కు ఎదురుగా విగ్రహ నిర్మాణం జరగాలని కోరారు. దీనిపై ముస్లిం సామాజిక వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మసీద్‌కు ఎదురుగా లక్ష్మణుడి విగ్రహం నిర్మిస్తే రాష్ట్రంలో మత కల్లోలాలు సంభవించే అవకాశం ఉందని, తాము ప్రశాంతంగా నమాజ్ కూడా చేసుకోలేమని మసీద్ ఇమామ్ మోలానా ఫజీల్ అన్నారు. విగ్రహ ఏర్పాటు సంబంధించి పూర్తి వివరాలను రానున్న అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. యూపీలో రామ్-లక్ష్మణులకు ఘనమైన చరిత్ర ఉందని, అది భవిష్యత్తు తరాలకు గుర్తుండే విధంగా భారీ విగ్రహన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. లక్నో పేరును లక్ష్మణ్‌పురిగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరినట్లు రామకృష్ణ యాదవ్ వెల్లడించారు. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన నిర్ణయం
లక్నో: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆలయాలను సందర్శించడం మామూలే. కానీ ఈసారి ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. మసీదును సందర్శించాలని ఆయన నిర్ణయించుకున్నారు. లక్నోలో కొత్తగా నిర్మించిన మసీదుకు ఆయన వెళ్లనున్నారు. ఆల్ ఇండియా ముస్లిం వుమన్ లా బోర్డ్(ఏఐఎంపీడబ్ల్యూ ఎల్బీ) చైర్ పర్సన్ షైస్తా అంబర్ ఆహ్వానం మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మోహన్ లాల్ గంజ్ లోని మాధో ఆశ్రమంలో మంగళవారం జరిగిన కార్యక్రమానికి హాజరైన భాగవత్ ను అంబర్ కలిశారు. 'మాధో ఆశ్రమానికి సమీపంలో నేను నిర్మించిన మసీదును సందర్శించాలని భాగవత్ ను ఆహ్వానించాను. ఈసారి లక్నో వచ్చినప్పుడు మసీదుకు వస్తానని ఆయన నాకు హామీయిచ్చార'ని అంబర్ తెలిపారు. భాగవత్ మసీదును సందర్శిస్తే ఆర్ఎస్ఎస్ ముస్లింలకు వ్యతిరేకమనే భావన సమసిపోతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. జాతి నిర్మాణం, సామాజిక విషయాల గురించి కూడా భాగవత్ తో చర్చించినట్టు చెప్పారు.