breaking news
loka bhuma Reddy
-
నేనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.. మరే కారణం లేదు! : లోక భూమారెడ్డి
ఆదిలాబాద్: బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, విజయ డెయిరీ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈయన తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్నారు. వయస్సు పైబడడంతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు ‘సాక్షి’తో పేర్కొన్నారు. 1978లో కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి పలు పదవుల్లో కొనసాగారు. 1981 నుంచి 1992 వరకు తలమడుగు మండలం రుయ్యాడి సర్పంచ్‌గా కొనసాగగా, ఆ సమయంలో పంచాయతీకి ఐదుసార్లు ఉత్తమ అవార్డులు దక్కాయి. 1992లో డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈయన చైర్మన్‌గా పనిచేసిన కాలంలో మూడు సార్లు (1992, 1993, 1995) ఉత్తమ బ్యాంక్‌గా అవార్డులు దక్కాయి. 2001లో బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు కొనసాగారు. 2017 ఫిబ్రవరి 17న రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్‌గా నియామకం అయ్యారు. ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగారు. అలాగే జిల్లా అధ్యక్షుడిగా 2021 వరకు పనిచేశారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల ఆయనకు పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడంతో కొంత కాలంగా అంటిముట్టనట్టుగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆ పార్టీలో చర్చ సాగుతోంది. ఈ విషయమై లోక భూమారెడ్డిని అడగగా, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, మరే కారణం లేదని స్పష్టం చేశారు. -
పోటాపోటీ....ఎమ్మెల్సీ పదవి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఎమ్మెల్సీ పదవి కోసం టీఆర్ఎస్ పార్టీ నేతల్లో పోటీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇప్పటి వరకు ఆ పార్టీ పశ్చిమ, తూర్పు జిల్లాల అధ్యక్షులు లోక భూమారెడ్డి, పురాణం సతీష్ మాత్రమే ఈ పదవి రేసులో ఉన్నారని అందరూ భావిస్తుండగా, ఈ ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ ఇతర నాయకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.ప్రవీణ్ పేరు కూడా వినిపిస్తోంది. బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసిన ఆయనకు ఈ సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్టు దక్కలేదు. అనూహ్యంగా దుర్గం చిన్నయ్యకు టిక్కెట్ రాగా, ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం విధితమే. పార్టీని నమ్ముకుని ఉన్న ప్రవీణ్‌కు సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ అధినేత కేసీఆర్ అప్పట్లో ఎన్నికల ప్రచార సభలో ప్రకటించారు. అలాగే టీఆర్ఎస్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలెవరూ ఎమ్మెల్సీలుగా లేరు. దీంతో ప్రవీణ్‌కు కలిసొచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో బోథ్ ని యోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేపట్టిన నేత గా ఉన్న రాములు నాయక్‌కు కూడా ఈ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. అప్పట్లో రాములు నాయక్‌కు కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆయనకు ఇటీవల ఎమ్మెల్సీ పదవి దక్కిన విషయం విధితమే. అలాగే గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓటమి పాలైన ముఖ్య నాయకులు వేణుగోపాలచారి, కె.శ్రీహరిరావు కూడా ఈ పదవి కోసం తమవంతు ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పరాజయం పాలైన చారీకి ఇప్పటికే కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా స్థానం కల్పించి క్యాబినేట్ హోదా ఇచ్చారు. అయితే.. మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశాలు తక్కువేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా పార్టీలో, ప్రభుత్వంలో ఎంతో కీలకంగా ఉన్న మంత్రి కేటీఆర్‌తో శ్రీహరిరావుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ మేరకు ఆయన కూడా ఈ పదవి రేసులో ఉంటారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వీరే కాకుండా ఎన్నికల సమయంలో చివరకు అనూహ్యంగా ఇతర నేతల పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటర్ల జాబితా సిద్ధం.. రాష్ట్రంలో ఆదిలాబాద్‌తోపాటు, మహబూబ్‌నగర్ జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కె.ప్రేంసాగర్ రావు పదవీకాలం 2013 మే 31తోనే ముగియగా, అప్పటి నుంచి ఈ పదవి భర్తీకి నోచుకోలేదు. మూడున్నర ఏళ్లుగా జెడ్పీ, మండల, మున్సిపల్ ఎన్నికలు జరగకపోవడంతో ఈ పరిస్థితికి దారితీసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం జెడ్పీ, మండల పరిషత్‌లకు, మున్సిపాలిటీలకు పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఎన్నిక తెరపైకి వచ్చింది. ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే ఈ స్థానిక సంస్థల నియోజకవర్గం ఓటర్ల జాబితాను సిద్దం చేశారు. ఓటర్ల పేర్లు, ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థ తదితర వివరాలతో కూడిన జాబితాను ఎన్నికల సంఘానికి కూడా పంపారు. జనవరిలో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మేరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఆ పార్టీ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు నేతలు ఇప్పటికే పలు సందర్భాల్లో అధినేత కేసీఆర్‌ను కలిసి తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.