breaking news
list goalmal
-
గేదెల సబ్సిడీ కొందరికే..
సాక్షి, ఆదిలాబాద్: ఎన్నో ఏళ్లుగా ఆదిలాబాద్‌లోని పాలశీతలీకరణ కేంద్రం (డెయిరీ)కి రోజూ పాలు సరఫరా చేస్తున్నప్పటికీ సబ్సిడీ గేదె పథకం జాబితాలో అర్హుల పేర్లు లేవు. పథకంలో వందలాది మందికి మొండి చెయ్యే ఎదురైంది. కేవలం 76 మంది పేర్లను ఎంపిక చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరి డెయిరీకి వీళ్లే పాలు సరఫరా చేశారా అంటే అదీకాదు.. మిగితా వారు సరఫరా చేసినప్పటికీ వారిని పరిగణనలోకి తీసుకోలేదు. అలా ఎందుకు జరిగిందంటే అధికారులు చెప్పే సమాధానం ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉంది. ఎంపికలో గందరగోళం.. ఆదిలాబాద్‌లోని పాలశీతలీకరణ కేంద్రంలో డీఆర్డీఏ ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైతుల నుంచి పాలు సేకరిస్తున్నారు. ఈ పాలను పాల శీతలీకరణ కేంద్రం ద్వారా నేరుగా ప్రజలకు విక్రయిస్తున్నారు. అదే విధంగా పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య అనుబంధ రంగ సంస్థ విజయ డెయిరీకి ఇక్కడి నుంచి పాలను పంపించడం జరుగుతుంది. కాగా పాడి రైతులకు సబ్సిడీ ద్వారా గేదెను అందజేసే పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికింద డెయిరీకి పాలు సరఫరా చేసే రైతులను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా ఆదిలాబాద్ జిల్లాలో లబ్ధిదారుల జాబితా ఎంపిక ప్రక్రియను విజయ డెయిరీకి అప్పగించడం జరిగింది. ఆన్లైన్ పద్ధతిన ఈ–ల్యాబ్‌లో అర్హులను ఎంపిక చేయాలని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా జిల్లాలో డెయిరీకి పాలు సరఫరా చేస్తూ లీటర్‌కు రూ.4 ఇన్సెంటివ్ పొందుతున్న వారి పేర్లను ఈ–ల్యాబ్‌లో నమోదు చేయాలని అధికారులు పేర్కొన్నారు. ఇక్కడే ఐకేపీ అధికారులు, విజయ డెయిరీ అధికారులు చెబుతున్న మాటలకు పొంతన కుదరడం లేదు. విజయ డెయిరీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు గడిచిన ఏప్రిల్, మే నెలలో పాలు సరఫరా చేసిన వారి పేర్లు పంపించామని ఐకేపీ అధికారులు చెబుతున్నారు. వారు పంపిన పేర్లనే తామూ పరిగణనలోకి తీసుకున్నామని విజయ డెయిరీ అధికారులు చెబుతున్నారు. ఈ ఇద్దరి నిర్వాకంతో అర్హులైన పలువురు పాడి రైతులకు మొదటి దశలోనే సబ్సిడీ గేదె అందకుండా పోతోంది. కేవలం బరంపూర్, రుయ్యాడి, ఆదిలాబాద్ గ్రామాలకు చెందిన కొంతమంది పాడి రైతులను ఎంపిక చేశారు. దీంట్లో ఏదైనా రాజకీయ కోణం ఉందా అన్న అనుమానాలు లేకపోలేదు. ఏళ్లుగా పాలు పోస్తున్నా మొండి చెయ్యే.. ఆదిలాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లోని తాంసీ, తలమడుగు, ఆదిలాబాద్‌తో పాటు పలు మండలాల్లోని గ్రామాల నుంచి ఎన్నో ఏళ్లుగా పలువురు పాడి రైతులు పాలశీతలీకరణ కేంద్రంలో పాలు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు సబ్సిడీ గేదె విషయంలో మాత్రం వీరికి మొండిచెయ్యి ఎదురైంది. లీటర్ పాలకు రూ.4 ఇన్సెంటివ్ కూడా పొందినవారిని కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. సాధారణంగా ఏడాదిలో ఒక వేసవిలో మినహాయించి మిగితా కాలంలో పాలశీతలీకరణ కేంద్రానికి భారీగా పాల సరఫరా జరుగుతుంది. నెలకు 6 వేల లీటర్ల నుంచి 10 వేల లీటర్ల వరకు, కొన్నిసార్లు 12 వేల లీటర్ల వరకు కూడా పాల సేకరణ జరుగుతుంది. అయితే వేసవిలో మాత్రం పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో పలువురు రైతులు పాలశీతలీకరణ కేంద్రానికి పాలు సరఫరా నిలిచిపోతుంది. అలాంటప్పుడు ఏప్రిల్, మే నెలల్లో పాలు సరఫరా చేసిన వారి పేర్లు మాత్రమే పంపాలని విజయ డెయిరీ ప్రతినిధులు కోరడంలో ఆంతర్యం ఏమిటో అంతు పట్టని విషయం. ఒకవేళ విజయ డెయిరీ ప్రతినిధులు కేవలం రెండు నెలల వివరాలు మాత్రమే అడిగిన పక్షంలో మిగితా ఏడాదిలో పాలు సరఫరా చేసిన రైతుల పరిస్థితిపై తెలియజేయకపోవడంతో ఇటు ఐకేపీ సంఘాల ప్రతినిధులతో పాటు పశుసంవర్థక శాఖ అధికారుల వైఫ ల్యం కనిపిస్తోంది. విజయ డెయిరీ ఎంపిక చేసిన జాబితాను పశుసంవర్థక శాఖకు పంపడం జరుగుతుంది. అక్కడి నుంచి కలెక్టర్ అనుమతి పొంది లబ్ధిదారులకు గేదెల పంపిణీ జరుగుతుంది. నిర్వహణలో లోపభూయిష్టం.. ఆదిలాబాద్‌లో పాలశీతలీకరణ కేంద్రం నిర్వహణ పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. ప్రధానంగా జిల్లాలో కేవలం వడ్డాడి, రుయ్యాడి, బరంపూర్‌లో మాత్రమే మిల్క్ కలెక్షన్ సెంటర్లు ఉన్నాయి. ఈ గ్రామాలకు సమీపంలో ఉన్న పాడి రైతులు ఉత్పత్తి అయిన పాలను పెద్ద మొత్తంలో ఆయా కలెక్షన్ సెంటర్లో అందజేయడం జరుగుతుంది. అక్కడ పెయిడ్ సెక్రెటరీ వారి వివరాలను నమోదు చేసి ఆ పాలను పాల శీతలీకరణ కేంద్రానికి పంపిస్తారు. ఇక్కడే లోపం ఎదురవుతుంది. ప్రధానంగా మిల్క్ కలెక్షన్ సెంటర్స్ అన్ని గ్రా మాల రైతులకు అనువుగా లేకపోవడంతో వారు నేరుగా ఆదిలాబాద్‌లోని పాలశీతలీకరణ కేంద్రానికి వెళ్లి విక్రయించడం జరుగుతోంది. నేరుగా వెళ్లే రైతులను వ్యక్తిగతంగా పాలు అమ్మే కోవలో పరిగణనలోకి తీసుకుని వారికి ప్రభుత్వం ద్వారా అందజేసే లీటరుకు రూ.4 ఇన్సెంటివ్ అందకుండా పోతోంది. మిల్క్ కలెక్షన్ సెంటర్లో పా లు పోసిన రైతుల వివరాలు మాత్రమే విజయ డె యిరీకి పంపించినట్లు ఐకేపీ అధికారులు చెబుతున్నారు. దీంతో కొంత మంది పాడి రైతులకే గేదె ప్రయోజనం దక్సాల్సి ఉండగా, మిగితా రైతుల కు మొండి చెయ్యి ఎదురవుతుంది. పాడి రైతుల ఆవేదన.. కేవలం 76 మంది రైతులను మాత్రమే సబ్సిడీ గేదెకు అర్హులుగా ఎంపిక చేయడంపై పలువురు పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ రోజూ డెయిరీ కేంద్రానికి వస్తున్నారు. దీంతో తమ లోపం ఎక్కడ బయటపడుతుందోనన్న అధికారులు మరో 122 మంది రైతులను గుర్తించి రెండో విడత కింద వారికి సరఫరా చేస్తామని చెబుతున్నారు. ప్రత్యేక అనుమతితో వారికి సబ్సిడీ గేదెలను అందించే ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొం టున్నారు. మిగతా రైతులను సొసైటీల ద్వారా ఎంపిక చేసి వారికి న్యాయం చేస్తామని నమ్మబలుకుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు సొసైటీలు లేకపోవడంతో ఇప్పట్లో పాడి రైతులకు న్యాయం జరిగే అవకాశాలు కనిపించడంలేదు. ముందునుంచి సొసైటీల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఏప్రిల్, మే నెలలో సరఫరా చేసిన వారి పేర్లు అడిగారు పాల శీతలీకరణ కేంద్రానికి ఏప్రిల్, మే నెలలో పాలు సరఫరా చేసిన వారి పేర్లు మాత్రమే అడిగారు. అందుకు తగినట్లు వారి వివరాలను పంపించాం. కొన్నేళ్లుగా సరఫరా చేసిన వారి పేర్లు అడిగి ఉంటే అలాగే పంపించేవాళ్లం. పలువురు పాడి రైతులకు సంబంధించి ఆధార్‌కార్డు, పాస్‌బుక్, పాస్ ఫొటోలు, ప్రొఫార్మాలు సేకరించి విజయ డె యిరీకి పంపించినప్పటికీ వారు తిరిగి ఈ–ల్యాబ్‌లో ఆదిలాబాద్‌లోనే నమోదు చే యాలని పంపించారు. పైనుంచి వ చ్చిన ఆదేశాలకనుగుణంగా నడుచుకున్నాం. – వసంత్, మేనేజర్, పాలశీతలీకరణ కేంద్రం మరో 122 మంది జాబితా.. మొదట ఎంపిక చేసిన 76 మంది లబ్ధిదారుల జాబితాతో పాటు మళ్లీ ప్రత్యేక అనుమతితో మరో 122 మంది పాడి రైతులను ఎంపిక చేశాం. మొదట 76 మంది రైతులకు సబ్సిడీ గేదెలను అందజేయనున్నాం. ఇప్పటికే సుమారు 40 మంది డీడీలు కట్టారు. వారికి ఈ మూడునాలుగు రోజుల్లో గేదెలను పంపిణీ చేస్తాం. ఆ తర్వాత ఈ 122 మందిని పరిగణనలోకి తీసుకుంటాం. సొసైటీల ఏర్పాటు జరుగుతుంది. వారికి కూడా గేదెలను అందజేసే అవకాశం ఉంది. ఐకేపీ నుంచి వచ్చిన జాబితాను అనుగుణంగానే లబ్ధిదారులను ఎంపిక చేశాం. లీటర్‌కు రూ.4 ఇన్సెంటివ్ పొందుతున్న రైతులను పరిగణనలోకి తీసుకున్నాం. – నాగేశ్వర్రావు, డీఎం, విజయ డెయిరీ -
కలెక్టరేట్లోనూ బోగస్ బాగోతం
సాక్షి ప్రతినిధి, కడప: అవకాశం ఉంది అనతి కాలంలో సొమ్ము చేసుకోవచ్చు.. స్వల్ప మార్పులు చేర్పులు చేస్తే లక్షలు దండుకోవచ్చు.. చేతివాటం ప్రదర్శిస్తే ఏకంగా ఉద్యోగాలు స్వాధీనం చేసుకోవచ్చు అని కొందరు అధికారులు దురాలోచన చేశారు. జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ వ్యవహారంలో విద్యాశాఖ పీకల్లోతు ఆరోపణల్లో కూరకపోగా, కలెక్టరేట్ యంత్రాంగం పాత్ర సైతం మెండుగా ఉన్నట్లు బయటపడుతోంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ చేతివాటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాబితా ఆధారంగా అభ్యర్థులతో రాయబేరాలు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకనుగుణంగానే అర్హుల జాబితాలో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నట్లు సమాచారం. జిల్లాలో బోగస్ కలకలం ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీలో బోగస్ సర్టిఫికెట్ల బాగోతం జిల్లాలో కలకలం రేపుతోంది. ఇప్పటికే కడప, మైలవరం ఎంఈఓలు నాగమునిరెడ్డి, మస్తాన్‌రెడ్డిలు సస్పెన్షన్‌కు గురయ్యారు. దీంట్లో మరికొందరు కూడా ఉన్నట్లు ఆరోపణలు రావడంతో తేలుకుట్టిన దొంగల మాదిరిగా విద్యాశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఈమొత్తం వ్యవహారంపై ఈనెల 17న ‘బోగస్ బాగోతం’ అంటూ సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఏడవ తరగతి పాస్ అయిన అభ్యర్థులు 600కు 598 మార్కులు వచ్చినట్లు సర్టిఫికెట్లతో దరఖాస్తులు చేసుకున్నారు. రాయచోటి ప్రాంతంలో మూతపడిన ఓ పాఠశాల నుంచి పెద్దఎత్తున సర్టిఫికెట్లు పొందినట్లు తెలుస్తోంది. దాదాపు 66మందికి 5వతరగతి, 7వతరగతి పాస్ అయినట్లు సర్టిఫికెట్లు అందజేసినట్లు సమాచారం. అలా పొందిన వారే మెరిట్ జాబితాలో వచ్చిచేరినట్లు తెలుస్తోంది. రాయచోటిలోని వాణి పాఠశాల, బి.మఠంలోని దీప్తి పాఠశాల నుంచి ఇలా సర్టిఫికెట్లు జారీ అయ్యినట్లు తెలుస్తోంది. ఇలా కొందరు హెచ్ఎంలు ఇష్టారాజ్యంగా మార్కులు జాబితా అందించినట్లు సమాచారం. తొలిదశ విచారణలో నిర్లక్ష్యం ఎస్సీ, ఎస్టీ ఆఫీసు సబార్డీనేట్ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ వ్యవహారం తెరపైకి రావడంతో ఇబ్బడిముబ్బడిగా బోగస్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. 61 ఖాళీలకు 25,373 దరఖాస్తులు చేరాయి. తొలిదశలో ఎంఈఓలు పర్యవేక్షించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. కొందరు పైరవీలకు తలొగ్గిని కారణంగా నకిలీలు అలాగే ఉండిపోయారు. ఈవ్యవహారాన్ని ఉదాహరణలతో సహా సాక్షి వెలుగులోకి తెచ్చింది. కలెక్టర్ కెవి సత్యనారాయణ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో డీఈఓ ప్రతాప్‌రెడ్డి నేతత్వంలో రెండవమారు విచారణ చేయించారు. అసలు విషయం బహిర్గతం కావడంతో కడప, మైలవరం ఎంఈఓలు నాగమునిరెడ్డి, మస్తాన్‌రెడ్డిలు సస్పెన్షన్‌కు గురయ్యారు. కాగా ఉప విద్యాశాఖాధికారి ఒకరు పెద్దఎత్తున ఎంఈఓలపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ కీలక భూమిక డీఈఓ కార్యాలయం నుంచి మెరిట్ జాబితా రూపొందించే క్రమంలో వచ్చిన జాబితాను కాకుండా తన ఇష్టానుసారం ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ పొందుపర్చినట్లు తెలుస్తోంది. కలెక్టరేట్ కార్యాలయంలోని ఆపరేటర్ తన చేతివాటం చూపినట్లు సమచారం. మెరిట్ అభ్యర్థుల వద్దకు తన వారిని పంపించి, మీకు ఉద్యోగం గ్యారంటీ, అంతా మేము చూసుకుంటాం. మాకు ఏమిస్తారని బేరం పెట్టినట్లు సమచారం. ఈక్రమంలో రామాంజనేయపురంలో ఉన్న మహిళా అభ్యర్థిని వద్దకు దళారీని పంపినట్లు తెలుస్తోంది. తన భర్త అనారోగ్యంతో ఉన్నారు, తాను డబ్బు ఇచ్చుకునే పరిస్థితి లేదని అమె తేల్చిచెప్పినట్లు సమాచారం. లిస్టులో లేని పేర్లను కూడా ఇదే ఆపరేటర్ ఎంటర్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈక్రమంలో కూడా అనర్హులు వచ్చి చేరినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు సైతం ఒత్తిడి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన నాయకులు సైతం పెద్దఎత్తున ఒత్తిడి చేసినట్లు సమాచారం. విద్యాశాఖ ఉన్నతాధికారిపై మైదుకూరు ప్రాంత నాయకుడు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. తన నియోజకవర్గ పరిధిలోని వారందరికీ ఉద్యోగాలు దక్కాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అత్యధిక ప్రోటోకాల్ ఉన్న నాయకుడు సైతం పైరవీలు చేసినట్లు సమాచారం. తన సిఫార్సులకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మెరిట్ జాబితాలో ఉన్నవారి పేర్లు...వారి మార్కులే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 1995–2000 ప్రాంతంలో పబ్లిక్ పరీక్షలో 600 మార్కులకు 590పైగా మార్కులు పొందిన ఎస్టీలు తర్వాత అర్ధంతరంగా చదువులకు దూరం కావడమే చూస్తే ఈ వ్యవహారం ఓ బోగస్ అని తేటతెల్లం అవుతోందని అర్హులైన అభ్యర్థులు అంటున్నారు. లోతుగా పరిశీలిస్తే ఈవ్యవహారంలో మరికొందరి బాగోతం బహిర్గతం కానుందని పలువురు పేర్కొంటున్నారు.