breaking news
library employees
-
సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం
సాక్షి, అమరావతి: జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచడంపై రాష్ట్ర గ్రంథాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం విజయవాడలోని ఠాగూర్ గ్రంథాలయం వద్ద రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు ఆధ్వర్యంలో సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడుతూ ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో సమానంగా జిల్లా గ్రంథాలయ ఉద్యోగులకు కూడా ఉద్యోగ విరమణ వయస్సు పెంచడం సీఎం గొప్ప మనస్సుకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్కు వెన్నుదన్నుగా ఉంటామని గ్రంథాలయ ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పూర్ణమ్మ, కార్యదర్శి రవికుమార్, జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరాజు పాల్గొన్నారు. -
010 పద్దు ద్వారా వేతనాలకు కృషిచేస్తా
విజయవాడ (గాంధీనగర్) : గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు 010 పద్దు ద్వారా వేతనాలు అందించడానికి కృషిచేస్తానని మానవవనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం రామా ఫంక్షన్హాలులో బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ గ్రంథాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు. గ్రంథాలయాలను ఆధునీకరించి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇందుకు ఉద్యోగులు సహకరించాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం వేగం పుంజుకోవడం వలన గ్రంథాలయాలకు ఆదరణ తగ్గిన మాట వాస్తవమేనన్నారు. అయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వాడుకుని గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. గ్రంథాలయ సంస్థలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని క్రమబద్దీకరించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని, నివేదిక వచ్చిన తర్వాత వారికి మేలు జరిగేలా చూస్తామన్నారు. గ్రంథాలయ ఉద్యోగులు తమ సమస్యలను తెలియజేస్తూ మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావును ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోన దేవదాసు, ఉపాధ్యక్షులు కె శివశంకరప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పి వెంకటరమణ, విజయకుమార్ పాల్గొన్నారు.