రిజిస్ట్రేషన్ శాఖకు ఉద్యమ సెగ
మార్కాపురం, న్యూస్‌లైన్: మార్కాపురం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో రిజిస్ట్రేషన్లు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీగా తగ్గిపోయాయి. దీని పరిధిలో మార్కాపురం, కంభం, గిద్దలూరు, యర్రగొండపాలెం, పొదిలి, దర్శి, కందుకూరు, అద్దంకి, కనిగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. గతేడాది నవంబర్ 30వ తేదీ నాటికి 27,053 రిజిస్ట్రేషన్లు జరిగి రూ. 28.42 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది నవంబర్ నాటికి కేవలం 11,412 రిజిస్ట్రేషన్లు జరిగి రూ.12.55 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. సమైక్యాంధ్ర సమ్మె కారణంగా సెప్టెంబర్‌లో రిజిస్ట్రేషన్లు జరగలేదు. జరిగిన వాటిలో పొలం అమ్మకాలు, దాన దస్తావీజులు, బహుమతులు, పవర్ఆఫ్ అటార్నీ దస్తావీజులు ఎక్కువగా ఉన్నాయి.
ఇవీ కారణాలు..
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సమైక్యాంధ్ర సమ్మెతో ఉద్యోగులందరూ కార్యాలయాలకు హాజరు కాకపోవడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఇదే సమయంలో అకాల వర్షాల వల్ల పంట నష్టం జరగడంతో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ఇంకోవైపు రాష్ట్ర విభజన జరుగుతుందని, ఒంగోలు రాజధాని అయ్యే అవకాశాలున్నాయని వార్తలు వెలువడడంతో అమ్మకందారులు వెనక్కి తగ్గారు. తమ భూములను ఇంకా ఎక్కువ ధరకు అమ్మవచ్చనే ఉద్దేశం ఉండడంతో రియల్ ఎస్టేట్ రంగం ఆగిపోయింది. మార్కాపురం ప్రాంతంలో గతేడాది వివిధ సంస్థలు ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఇవ్వకపోవడంతో రియల్ వ్యాపారం మందగించి స్తబ్ధత ఏర్పడింది. కొత్త రాజధాని నిర్ణయం, పంటలకు గిట్టుబాటు ధర వంటివి అమలైతే తప్ప రిజిస్ట్రేషన్ శాఖ మళ్లీ పుంజుకోదు. ఒంగోలు రాష్ట్ర రాజధాని అయ్యే అవకాశం ఉందన్న వార్తలు రావడంతో ఇటీవల కాలంలో పొదిలి, మార్కాపురం, కనిగిరి, దొనకొండ, దర్శి ప్రాంతాల్లో పలువురు ప్రముఖులు భూములు కొన్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ 30 వరకు 9 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలిలా ఉన్నాయి..
నెల జరిగిన ఆదాయం రిజిస్ట్రేషన్లు
ఏప్రిల్ - 1921- 2,14,28,890
మే - 2208 - 2,63,27,085
జూన్ - 2590 - 2,85,75,019
జూలై - 2123 - 2,13,74,880
ఆగస్టు - 701 - 8,89,95,607
సెప్టెంబర్ నిల్
అక్టోబర్ - 1869 - 1,88,29,558
నవంబర్ - 3455 - 4,46,56,843