breaking news
laparoscopic
-
గైనిక్ సర్జరీల్లోనూ రోబోలు
సాక్షి, హైదరాబాద్: వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రొబోటిక్ సర్జరీలు హైదరాబాద్‌లోనూ విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. పేరొందిన దాదాపు ప్రతి ఆసుపత్రీ ఈ శస్త్రచికిత్సా విధానాన్ని ఉపయోగిస్తోంది. చికిత్సా వ్యయం ఎక్కువైనప్పటికీ ఎక్కువ మంది రోగులకు నప్పే అనేక ప్రయోజనాల వల్ల రానురానూ రొబోటిక్ సర్జరీల ఎంపిక కూడా పెరుగుతోంది. విభిన్న రకాల శస్త్రచికిత్సల్లో దోహదపడుతున్న రొబోటిక్ సర్జరీ గైనకాలజీ విభాగంలోనూ ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో గైనకాలజీ శస్త్రచికిత్సల్లో రోబోల వాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అపోలో ఆసుపత్రికి చెందిన కన్సెల్టెంట్ అబ్స్ట్రిటిషియన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనురాధా పాండా మరిన్ని వివరాలు తెలియజేశారు. అవి ఏమిటంటే... మరింత కచ్చితత్వం... ‘‘గైనకాలజీలో రోబో అసిస్టెడ్ కీహోల్ సర్జరీని కొత్త ఆవిష్కరణగా చెప్పొచ్చు. సాధారణ లేపరోస్కోపిక్ సర్జరీలతో పోలిస్తే రోబో సాయంతో చేసే సర్జరీల్లో త్రీడీ విజన్ (త్రిమితీయ ఆకారం) ఎక్కువ కచ్చితత్వాన్ని అందిస్తుంది. శస్త్ర చికిత్సలకు ఉపయోగించే పరికరాలను 360 డిగ్రీల కోణంలో తిప్పడానికి వీలుండటం వల్ల శరీరంలో సంక్లిష్టమైన ప్రదేశాలను సైతం చేరుకోవచ్చు. ఈ శస్త్రచికిత్సా విధానంలో తక్కువ రక్త నష్టంతోపాటు నొప్పి, ఇన్ఫెక్షన్ ముప్పు కూడా తక్కువగా ఉంటుంది. తద్వారా రోగులు ఆసుపత్రిలో ఉండాల్సిన వ్యవధి కూడా తగ్గుతుంది. ఈ శస్త్రచికిత్సల్లో సర్జన్ ఒక కంప్యూటర్ కన్సోల్ నుంచి పనిచేస్తారు. తన చేతి కదలికలతో రొబోటిక్ చేతులను కదిలిస్తూ ఆపరేషన్ నిర్వహిస్తారు. ‘‘క్లిష్టమైన హిస్టెరెక్టమీ (గర్భాశయం తొలగింపు) ఆపరేషన్లకు రోబో సాయాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యేకించి ఊబకాయంతో ఉన్న రోగి పొత్తికడుపుపై పలు శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. కచ్చితత్వం, తక్కువ నొప్పితోపాటు చిన్న కోతల ద్వారానే శస్త్రచికిత్స చేయడానికి ఈ విధానం వీలు కల్పిస్తుంది’’అని డాక్టర్ అనురాధా పాండా వివరించారు. గైనిక్ రొబోటిక్ సర్జరీలతో ప్రయోజనాలు... మయోమెక్టమీ అనేది గర్భాశయ కండరాల గోడ (ఫైబ్రాయిడ్) నుంచి నిరపాయకరమైన కణుతులను తొలగించడానికి ఉపయోగించే ఒక ప్రక్రియ. రొబోటిక్ సర్జరీ ఫైబ్రాయిడ్ కుట్టు తొలగింపునకు కూడా వీలు కల్పిస్తుంది. ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయం వెలుపల గర్భాశయ లైనింగ్ వంటి కణజాలాలు పెరిగే పరిస్థితి. ఈ కణజాలాలు హార్మోన్లకు ప్రతిస్పందిస్తాయి. పీరియడ్స్ సమయంలో రక్తస్రావం, నొప్పి ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ శస్త్రచికిత్స ఒక సవాలు వంటిది. దీనికోసం పెల్విస్, పెల్విక్ సైడ్ వాల్స్‌లో లోతుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రోబో అసిస్టెడ్ ఎండోమెట్రియోసిస్ శస్త్రచికిత్స ద్వారా మరింత కచ్చితమైన రీతిలో అండాశయ తిత్తిని తొలగించడం సాధ్యపడుతుంది. పేగు, మూత్రాశయం, మూత్ర నాళానికి అతుక్కొని ఉండే డీప్ ఇన్ఫిల్ట్రేటింగ్ ఎండోమెట్రియోసిస్ వ్యాధి చికిత్సలోనూ రొబోటిక్ సర్జరీ తక్కువ సంక్లిష్టతతో కూడుకుంటున్నదని పలు అధ్యయనాలు తెలిపాయి. హిస్టెరెక్టమీ సర్జరీ తర్వాత కొందరిలో తలెత్తే వాల్ట్ ప్రోలాప్స్ అనే పరిస్థితిని సరిదిద్దడంలోనూ రొబోటిక్ సర్జరీ ఉపకరిస్తుంది. ఊబకాయ రోగుల్లో శస్త్రచికిత్సలకు లేపరోస్కోపీతో పోలిస్తే రోబోటిక్ సర్జరీ వారి అనారోగ్యాన్ని, ఆసుపత్రిలో ఉండే వ్యవధిని తగ్గిస్తుంది. లేపరోస్కోపీతో పోల్చినప్పుడు రొబోటిక్ శస్త్రచికిత్స ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. అయితే భవిష్యత్తులో ఈ చికిత్సా విధానం వాడకం మరింత విస్తృతమైతే ఈ సర్జరీల ధరలు తగ్గే అవకాశం ఉంది. -
తీవ్రమైన కడుపునొప్పి.. తిరగబడిన మూత్రనాళం
కర్నూలు(హాస్పిటల్): అరుదైన మూత్రనాళ సమస్యతో బాధపడుతున్న మహిళకు కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు ల్యాప్రోస్కోపిక్‌తో శస్త్రచికిత్స చేసి ఉపశమనం కలిగించారు. వివరాలను మంగళవారం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యురాలజిస్టు డాక్టర్ మనోజ్‌కుమార్ వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే...‘నంద్యాలకు చెందిన నాగమణి (47) నెలరోజులకు పైగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఇటీవల ఆసుపత్రికి వచ్చింది. వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె కుడి కిడ్నీకి వాపు రావడంతో పాటు కిడ్నీ సంబంధిత రెట్రోకావల్ యురేటర్ (తిరగబడిన మూత్రనాళం) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించాం. వారం రోజుల క్రితం ఆమెకు ల్యాప్రోస్కోపిక్ కీహోల్ సర్జరీ చేశాం. ప్రస్తుతం ఆమె కోలుకుంది. ప్రతి వెయ్యి మందిలో ఒకరికి పుట్టుకతో సంభవించే అరుదైన వ్యాధి ఇది. ఈ ఆపరేషన్‌ను ఎక్కువగా ఓపెన్ సర్జరీ పద్ధతిలోనే చేస్తాం. అయితే అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉండటంతో ల్యాప్రోస్కోపిక్ ద్వారాసులభంగా చేయగలిగాం’ అని వివరించారు. చదవండి: ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట మృతదేహాలు లభ్యం -
పెద్దాసుపత్రిలో అరుదైన కిడ్నీ ఆపరేషన్లు
–ల్యాప్రోస్కోపిక్‌తో కిడ్నీల తొలగింపు –ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొదటిసారి కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మొదటిసారి ల్యాప్రోస్కోపిక్ పరికరంతో ఇద్దరు రోగులకు కిడ్నీలను తొలగించే శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. వివరాలను యురాలజిస్టు డాక్టర్ సీతారామయ్యతో కలిసి బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి తన చాంబర్లో విలేకరులకు వివరించారు. కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన ఓబులేసు(27)కు జన్మత ఎడమ కిడ్నీ నాళం మూసుకుపోయి ఇబ్బంది పడేవాడు. ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన శేఖర్(23) సైతం ఎడమ కిడ్నీ చీము పట్టి బాధపడేవాడు. వీరిద్దరికీ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని యురాలజీ విభాగాధిపతి డాక్టర్ సీతారామయ్య ఆధ్వర్యంలో వైద్యులు ల్యాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా కిడ్నీలను తొలగించారు. సాధారణంగా ఇలాంటి కేసులకు గతంలో ఓపెన్ సర్జరీలు చేసేవారమని, దీనివల్ల రోగికి 15 సెంటిమీటర్ల పరిధిలో కోత పెట్టి శస్త్రచికిత్స చేసేవారన్నారు. దీంతో పాటు ఆరు నెలల పాటు వీరు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో మూడు చోట్ల చిన్న గాటు పెట్టి ఆపరేషన్ చేస్తారని, విశ్రాంతి ఎక్కువగా అవసరం లేదని, రోగి త్వరగా కోలుకుంటాడన్నారు. ఇలాంటి ఆపరేషన్లు రాయలసీమలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొదటిసారిగా తామే చేశామన్నారు. ఆపరేషన్‌ను పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ చలపతి, డాక్టర్ అరుణలత, డాక్టర్ విశాల, అనెస్తెటిస్ట్ డాక్టర్ కొండయ్య, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ సాయిక్రిష్ణ నిర్వహించినట్లు చెప్పారు.