breaking news
lands in donakonda
-
ఎంపీ రాయపాటి ఆరోపణలపై సీఎం విచారణ జరిపించాలి
- ముఖ్యమంత్రికి మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విజ్ఞప్తి - దొనకొండలో నాకు సెంటు భూమి లేదు - గట్టిగా అడక్కపోతే మేనిఫెస్టోలో హామీలు అమలు చేయరు సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనపై చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని మాజీ సీఎస్, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రకాశం జిల్లా దొనకొండలో తనకు సెంటు భూమి కూడా లేదని స్పష్టం చేశారు. దొనకొండలో వేల ఎకరాలు కొన్నారని, అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తిని సీఎం చంద్రబాబు తిరస్కరించినందునే ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేస్తున్నారని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తనపై చేసిన ఆరోపణలను ఐవైఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. వివిధ అంశాలపై ఐవైఆర్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే... జిల్లాలో ఒక్కసెంటు కూడా లేదు.. నాకు దొనకొండలోనే కాదు. నా సొంత జిల్లా ప్రకాశంలో ఒక్క సెంటు భూమి కూడా లేదు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పించడం ద్వారా నిజమనిపించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈరోజు ఒకరు ఆరోపిస్తారు. రేపు ఒక పేపర్లో రాస్తారు. మరో రోజు ఫేస్బుక్లో పెడతారు. ఆయన స్పందించలేదు కదా. ఇది నిజమేననిపిస్తారు. అందువల్లే నేను స్పందిస్తున్నాను. ఎంపీ ఆరోపణలపై విచారణ చేపట్టి నిజాలుంటే నాపై చర్యలు తీసుకోవాలని సీఎంకు విన్నవిస్తున్నా. గట్టిగా అడగకపోతే ఎన్నికల మేనిఫెస్టోలోని వాగ్దానాలు నెరవేర్చరు. ముద్రగడ పద్మనాభం గట్టిగా అడగబట్టే కాపు కార్పొరేషన్‌కు నిధులిచ్చారు. బ్రాహ్మణ సంక్షేమానికి కూడా మేనిఫెస్టోలో చెప్పిన మాదిరిగా రూ. 500 కోట్లు కేటాయించాలి. అది ప్రభుత్వ అనుబంధ సొసైటీ... బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రైవేట్ సంస్థ అని, దానికి నేను నిధులు మళ్లించానని ఆర్థిక శాఖ మంత్రి యనమల ఆరోపించారు. సహకార సంస్థల చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ఏర్పాటైన ప్రభుత్వ అనుబంధ సంస్థ అది. దానిని ప్రైవేట్ సంస్థ అనడం తప్పు. దీనిపై ఆర్థిక మంత్రి స్పష్టత ఇవ్వాలి. ఇక సొసైటీ సీఈవో నాకు బంధువంటూ అభియోగాలు మోపారు. అది తప్పు. విశాఖలో ప్రభుత్వ భూముల రద్దు తప్పు.. విశాఖపట్నంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన 35 ఎకరాలను రద్దు చేసి ప్రైవేటు సంస్థకు ఇవ్వాలనే ప్రయత్నాలు భూ కేటాయింపుల చట్టంలోని మార్గదర్శకాలకు పూర్తి విరుద్ధం. ప్రభుత్వ భూమి కేటాయింపులో మొదటి ప్రాధాన్యం ప్రభుత్వ సంస్థలకు, రెండో ప్రాధాన్యం ప్రభుత్వరంగ సంస్థలకు ఇవ్వాలి. తర్వాతే ప్రైవేటు వ్యక్తులు, సంస్థలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూ కేటాయింపులు రద్దు చేసి ప్రైవేటు సంస్థకు ఇస్తే పెద్ద తప్పవుతుంది. -
‘రాయపాటి అబద్దాలు చెబుతున్నారు’
హైదరాబాద్: దొనకొండలో తనకు ఎలాంటి భూములు లేవని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. దొనకొండలో తనకు భూములు ఉన్నట్టు టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశిరావు చెప్పడం పెద్ద అబద్దమని అన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏవైనా వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించుకోవాలని సూచించారు. ఆదివారం సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వానికి దమ్ముంటే రాయపాటి ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం టీడీపీ నాయకులకు అలవాటైందని ధ్వజమెత్తారు. ‘చాలా సీనియర్ పార్లమెంటేరియన్ అయిన రాయపాటి వ్యాఖ్యలపై సీఎం విచారణ జరపాలి. నా మనోభావాలు దెబ్బితినడం కాదు.. ఈ ప్రభుత్వంలో చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏమీ లేకపోయినా వందల కోట్ల రూపాయల విలువైన భూములు ఉన్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. నాకు దొనకొండలో ఎటువంటి భూములు లేవు. విశాఖలో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుని ప్రైవేటు వారికి అప్పజెప్పడం సబబు కాద’ని ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 500 కోట్లు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ హామీయిచ్చిందని, కానీ ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి చర్య తీసుకోలేదని తెలిపారు. గట్టిగా అడిగితేనే ప్రభుత్వం స్పందిస్తుందని, ముద్రగడ పద్మనాభం అడిగితేనే కాపులకు నామమాత్రపు నిధులిచ్చిందని చెప్పారు.