breaking news
lalitha kalathoranam
-
ప్రతి అసెంబ్లీ కేంద్రంలో మహిళా దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వేడుకలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన నిధులను జిల్లాలకు విడుదల చేస్తామని చెప్పారు. బుధవారం సచివాలయంలో మహిళా దినోత్సవ ఏర్పాట్లపై ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి, సాంస్కృతిక మండలి చైర్మన్ రసమయి బాలకిషన్ తదితరులతో ఆయన సమావేశం నిర్వహించారు. మార్చి 8న రాష్ట్ర స్థాయిలో నిర్వహించే కార్యక్రమానికి వేదికగా లలితకళాతోరణాన్ని పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్య జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు అవార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. శుక్రవారం మరోమారు ఉత్సవ కమిటీ సమావేశం అవుతుందని తెలిపారు. ‘భేటీ బచావో, భేటీ పడావో’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసి కేంద్రం ప్రశంసలు పొందిన హైదరాబాద్ జిల్లా యంత్రాంగాన్ని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల ప్రత్యేకంగా అభినందించారు. -
నాంపల్లిలో స్వరూపానంద.. భారీ భద్రత!
హైదరాబాద్: షిరిడీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్వరూపానంద సరస్వతి ఆదివారం సాయంత్రం నగరానికి రావడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ద్వారకా శారద పీఠం అధిపతి అయిన స్వరూపానంద సరస్వతి నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని లలిత కళాతోరణంలో గురువందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయిబాబాపై వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. ‘షిరిడీ సాయిబాబా ఓ ముస్లిం తెగకు చెందినవారు. ఆయన్ను వ్యక్తిగతంగా ఆరాధిస్తూ చాలా మంది హిందువులు తప్పు చేస్తున్నారు. ఆయన చిత్రపటాలను పూజ గదిలో ఉంచుకోవద్ద’ని స్వరూపానంద సరస్వతి గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన వ్యాఖ్యలను సాయిబాబా భక్తులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆయనను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.