breaking news
lady mro attacked
-
నాపై దాడి చేసి.. ఏకవచనంతో తిట్టారు
చెరువు కబ్జాను అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు తనపై టీడీపీ సర్పంచ్ రమణారెడ్డి దాడిచేసి, నానా దుర్భాషలు ఆడారని చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు ఎమ్మార్వో నారాయణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తాను కలెక్టర్ ఆదేశాల మేరకే అక్కడకు వెళ్లానని, అయితే అక్కడ తనకు తీరని అవమానం జరిగిందని ఆమె తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగ సంఘాలకు ఫిర్యాదు చేశానన్నారు. ప్రజాప్రతినిధిగా ఆయన సక్రమంగా ఉండాలని, తమ పని తాము సక్రమంగా చేసేలా అడ్డు లేకుండా ఉంటే చాలని ఆమె తెలిపారు. అదే తాము ఏదైనా తప్పుచేస్తే అడగొచ్చని.. అంతే తప్ప లేనిపోని అభియోగాలు మోపి మానసికంగా చిత్రహింసలు చేయడం మాత్రం సరికాదని తహసీల్దార్ నారాయణమ్మ అన్నారు. తాము మానవతా దృక్పథంతో ప్రజలకు సేవ చేయడానికే ఉన్నామని, ప్రజలకు ఏం కావాలో అది చేస్తామని, మనస్సాక్షిని బట్టే పనిచేస్తామని తెలిపారు. తాను కూడా ఒకప్పుడు పేదింటి పిల్లనేనని, అందుకే వాళ్ల మేలు కోసం పనిచేస్తున్నానని చెప్పారు. తన వెనక తమ సంఘం వాళ్లు ఉండబట్టే ధైర్యంగా ఉన్నానన్నారు. -
తొడగొట్టిన రౌడీ రాజ్యం
మహిళా తహసీల్దార్‌పై ఎమ్మెల్యే చింతమనేని దాడి ముసునూరు: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ రెచ్చిపోయారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ఆర్ఐపై దౌర్జన్యం చేసి నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకుని వచ్చిన మహిళా తహసీల్దార్‌పై విచక్షణారహితంగా దాడి చేయించారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్లకు అడ్డంగా నిల్చున్న ఆమెను దుర్బాషలాడారు. ఆమెను తీవ్రంగా కొట్టించి, ఇసుకలో లాగించి పక్కన పడేయించారు. ఆమె సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేయించారు. అడ్డువచ్చిన ఇతర అధికారులను కూడా చితకబాదించారు. ఏదైనా ఉంటే కలెక్టర్‌కు లెటర్ రాసుకో... నేనిప్పుడు ఇసుక తోలుకెళ్తున్నానంటూ దౌర్జన్యంగా ఇసుక తోలుకెళ్లారు. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న సాక్షి విలేకరిని ఎమ్మెల్యే అనుచరులు తీవ్రంగా కొట్టి, కెమెరా లాక్కొని మెమరీ కార్డును తీసుకుని ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే దౌర్జన్యంతో మనస్తాపం చెందిన మహిళాధికారి ఈ విషయమై సీఎంకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. వివరాల్లోకి వెళితే... కృష్ణాజిల్లా ముసునూరు మండలం రంగంపేట వద్ద తమ్మిలేరు నుంచి ఇసుకను చింతమనేని వందలాది ట్రాక్టర్లలో తరలిస్తున్నారన్న సమాచారం మేరకు తహశీల్దారు వనజాక్షి రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ) మరియన్నను సంఘటనాస్థలానికి పంపించారు. అక్కడకు వెళ్లిన ఆర్ఐని ఎమ్మెల్యే మనుషులు అడ్డుకొని దౌర్జన్యం చేసి నిర్బంధించారు. ఆయన ఈ విషయాన్ని తహశీల్దారుకు, ముసునూరు పోలీసులకు ఫోన్లో తెలియజేశారు. ముసునూరు ఎస్ఐ పి.విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు తమ్మిలేరుకు చేరుకున్నారు. రికార్డులుంటే చూపించి మాట్లాడాలని పోలీసుల సమక్షంలోనే ఆర్ఐని ప్రభాకర్ నిలదీశారు. సరిహద్దుకు సంబంధించిన రికార్డులు తనవద్ద లేకపోవడంతో ఆర్ఐ మిన్నకుండిపోయారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ట్రాక్టర్లలో యధేచ్ఛగా ఇసుక రవాణాను కొనసాగించారు. ఈ విషయం తెలుసుకున్న ముసునూరు తహశీల్దారు వనజాక్షి మధ్యాహ్నం మూడు గంటల వేళ అక్కడకు చేరుకుని ఇసుక రవాణాను ఆపాలని కోరారు. ఎమ్మెల్యే అనుచరులు ఖాతరు చేయకపోవడంతో వాహనాలకు అడ్డంగా కూర్చున్నారు. అక్కడినుంచే కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్లో విషయం తెలిపారు. అనంతరం ఘటనాస్థలం వద్దకు వచ్చిన ఎమ్మెల్యే చింతమనేని... మీకు ఫోన్లో విషయం తెలిపినప్పటికీ ట్రాక్టర్లకు అడ్డంగా ఎందుకు కూర్చున్నారంటూ తహసీల్దార్‌ను దుర్భాషలాడారు. ఇసుక తరలిస్తున్న ప్రదేశం ముసునూరు మండలానికి సంబంధించింది కాబట్టి తరలించడానికి తాను ఒప్పుకోనని అమె అక్కడే బైఠాయించారు. రేపు సర్వేయర్ వచ్చి హద్దులు నిర్దేశించాక మీదైతే తోలుకోవచ్చని స్పష్టంచేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ఆమెపై తన అనుచరులను ఉసిగొల్పారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు, డ్వాక్రా మహిళలు మూకుమ్మడిగా మహిళా తహశీల్దారుపై దాడి చేశారు. ఆమెకు తీవ్రంగా గాయపరిచి ఇసుకలో లాగి పక్కన పడేశారు. దాడిని అడ్డుకున్న తహశీల్దారు కార్యాలయ సిబ్బందిని ఎమ్మెల్యే అనుచరులు చితకబాదారు. విషయం తెలిసి అధికారులతోపాటు అక్కడికి వెళ్లిన ‘సాక్షి’ విలేకరి కర్రా నవీన్‌కుమార్ తహశీల్దార్‌పై దాడి దృశ్యాలను తన కెమెరాలో బంధిస్తుండటం చూసిన ప్రభాకర్ అనుచరులు మూకుమ్మడిగా వచ్చి పిడిగుద్దులు గుద్దుతూ వాగులో పడేసి కొట్టారు. అతడి దగ్గరున్న సెల్‌ఫోన్‌ను, కెమెరాను లాక్కొన్నారు. ఆ తర్వాత పొక్లెయిన్‌తో ఇసుక తవ్వుకుని అక్రమంగా తరలించారు. ఈ దాడి సమాచారం అందుకున్న రెవెన్యూ,పోలీసు ఉన్నతాధికారులు అక్కడకు వచ్చి పరిస్థితులను తెలుసుకున్నారు. పుష్కర విధుల బహిష్కరణ కాకినాడ సిటీ: చింతమనేని, ఆయన అనుచరుల తీరు అమానుషమని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పితాని త్రినాథరావుఅన్నారు. నిందితులను 48 గంటల్లో అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పుష్కర సేవలను బహిష్కరిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సూసైడ్ చేసుకోవాలనిపిస్తోంది * ఎమ్మెల్యే దాడిలో గాయపడిన మహిళా తహశీల్దార్ ‘‘బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే మహిళనని కూడా చూడకుండా నోటికొచ్చినట్లు తిట్టడమేమిటి? వారి ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు అనుచరులతో దాడి చేయించడమేమిటి? అందరిముందూ ఇంత అవమానం జరిగాక బతకాలనిపించడంలేదు. సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది’’ అని ముసునూరు తహశీల్దార్ వనజాక్షి వాపోయారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరుల దాడిలో బుధవారం తీవ్రగాయాలపాలైన ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్యేపై కేసు పెడతామని, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోనని స్పష్టంచేశారు. రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్‌లో మాట్లాడాక భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యేనే అనుచరులతో మమ్మల్ని కొట్టిస్తే మాకు విలువేముంటుందని ప్రశ్నించారు. ఇంత జరిగాక బతకాలనిపించడంలేదని, సూసైడ్ చేసుకోవాలనిపిస్తోందని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. -
నన్ను ఈడ్చేశారు.. ఫోను లాక్కున్నారు: ఎమ్మార్వో
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు తనపై దాడి చేశారని, తనను ఇసుకలో ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని ముసునూరు మహిళా ఎమ్మార్వో వనజాక్షి తెలిపారు. తన ఫోను కూడా లాక్కుని విసిరేశారన్నారు. దాడి ఘటన అనంతరం ఆమె 'సాక్షి టీవీ'తో ప్రత్యేకంగా మాట్లాడారు. తన ఫోనును ఎమ్మెల్యే వ్యక్తిగత భద్రతా సిబ్బందే లాగేసుకున్నారని ఆమె చెప్పారు. తనను కొట్టి 25 ట్రాక్టర్ల ఇసుక అక్కడి నుంచి తీసుకెళ్లారన్నారు. జరిగిన ఘటనపై తాను కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని, వాళ్లు అంతా వస్తున్నారని ఆమె తెలిపారు. ప్రభుత్వ డ్యూటీమీద వచ్చిన తమపై ఇలా దౌర్జన్యం చేయకూడదని.. ఆయనకు నిజంగా పర్మిట్లు ఉంటే, సర్వే చేసేవరకు ఆగి చెప్పాలి గానీ, తమను కొట్టి ట్రాక్టర్లు తీసుకెళ్లడం సరికాదని అన్నారు. విషయం తెలిసిన తర్వాత అక్కడకు ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారని.. అయితే ఎమ్మెల్యే అనుచరులు 50 మందికి పైగా ఉండటంతో వీళ్లు ఏమీ చేయలేకపోయారని ఎమ్మార్వో వనజాక్షి వివరించారు. జరిగిన దాడిని తమ ఉద్యోగుల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లానని, వాళ్లు కూడా దీంట్లో కలగజేసుకుంటున్నారని తెలిపారు. ఇలా దాడులు చేస్తే ఇక విధులు ఎలా నిర్వహిస్తామని ప్రశ్నించారు. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటునే ఇలా చేస్తే వీఆర్వో, ఆర్ఐ లాంటివాళ్లకు తగిన అధికారాలు కూడా ఉండవని.. వాళ్లు ఏమీ చేయలేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ దృష్టికి కూడా ఈ దాడి విషయాన్ని తీసుకెళ్లానని, ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా చెప్పారని అన్నారు. -
మహిళా ఎమ్మార్వోపై ఎమ్మెల్యే చింతమనేని దాడి
కృష్ణాజిల్లాలోని ఒక మహిళా ఎమ్మార్వోపై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేశారు. అక్కడే ఉండి, ఆ దృశ్యాలను ఫొటో తీస్తున్న సాక్షి విలేకరి నవీన్‌పై కూడా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు భౌతిక దాడి చేసి, కెమెరాను నేలకేసి కొట్టారు. దాంతో అది పగిలిపోయింది. పోలీసులకు ఫోన్ చేస్తానని అనగా.. ఫోన్ కూడా విసిరేశారు. ముసునూరు మండలం రంగంపేటలో ఉన్న ఇసుక రీచ్ వద్ద అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ విషయం తెలిసిన ఎమ్మార్వో వనజాక్షిని అక్కడున్న ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు. దాంతోపాటు వాళ్లు ఎమ్మెల్యేకు చెప్పడంతో ఆయన స్వయంగా అనుచరులను తీసుకుని అక్కడకు వచ్చారు. ఎమ్మార్వోపై ప్రభాకర్ తదితరులు దాడి చేశారు. ఇసుక రీచ్ వద్ద బీభత్సమైన వాతావరణాన్ని సృష్టించారు. ఇసుక అక్రమ రవాణాను ఎవరైనా అడ్డుకుంటే ఇదే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కొద్దిసేపటి క్రితమే పోలీసులకు తెలియడంతో వారు కూడా అక్కడకు వెళ్తున్నారు. చింతమనేనిపై గతంలో ఏలూరు పోలీసు స్టేషన్లో రౌడీషీట్ ఉంది. కోడిపందాలు, ఇతర సందర్భాలలో కూడా పోలీసుల పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించారు.