breaking news
L. Nageswara rao
-
తెలుగు ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
సాక్షి, బెంగళూరు : నిరుపేద ప్రవాసాంధ్రులకు చేయూతనిచ్చే దిశగా ప్రభుత్వ రంగ తెలుగు ఉద్యోగుల సమన్వయ సమితి పనిచేస్తుందని సమితి అధ్యక్షుడు ఎల్.నాగేశ్వరరావు తెలిపారు. సమితి ఏర్పాటైన తర్వాత తొలిసారిగా గురువారం సాయంత్రం ఇందిరానగర క్లబ్లో ఏర్పాటు చేసిన క్యాలెండర్, వెబ్సైట్ ఆవిష్కరణల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న తెలుగు ఉద్యోగుల సమస్యలు పరిష్కారంతో పాటు పేద ప్రవాసాంధ్ర విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయడం కోసం సమితి తరుఫున కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రవాసాంధ్రులకు ఉపయోగకరంగా ఉండేందుకు గాను రాష్ట్రంలో ఐపీఎస్, ఐఏఎస్‌లుగా ఉన్న తెలుగు వారితో పాటు వివిధ విద్యాసంస్థల యజమానులు, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లోని తెలుగు ప్రముఖుల వివరాలతో ఓ డెరైక్టరీని అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏడీజీపీ టి.సునీల్‌కుమార్(సీఆర్ఈ), బి.ఎన్.ఎస్.రెడ్డి(డీఐజీ డెరైక్టర్ ఆఫ్ విజిలెన్స్ కేఎస్ఆర్టీసీ), ఎం.చంద్రశేఖర్(డీఐజీ ఆఫ్ పోలీస్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ), టి.వి.రవి (అడిషనల్ కమిషనర్ కస్టమ్స్ విభాగం)లకు సమితి తరఫున జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. ముఖ్య అతిథులుగా హాజరైన వారితో కలిసి 2014 క్యాలండర్‌తో పాటు పేరిట రూపొందించిన వెబ్‌సైట్‌ను సమితి అధ్యక్షుడు ఎల్.నాగేశ్వర రావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ... ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే మనుషులను, మనసులను దగ్గర చేయగల శక్తి ఒక్క భాషకు మాత్రమే ఉందని, అందుకే ప్రతి ఒక్కరూ తమ మాతృభాష ప్రాభవాన్ని కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. తెలుగు వారందరినీ దగ్గరకు చేర్చే ఇలాంటి సంఘాల ఆవశ్యకత ప్రస్తుతం ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి బుచ్చిబాబు, ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం.ఎన్.సంపత్‌కుమార్, నృత్యకారిణి రూపారాణి తదితరులు పాల్గొన్నారు. -
వారికి ప్రత్యేక రక్షణలెందుకు?
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు అవినీతి నిరోధక చట్టంలో ప్రత్యేక రక్షణలు కల్పించడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. అది ఆ చట్ట స్ఫూర్తికే విరుద్ధమని స్పష్టం చేసింది. వారిపై దర్యాప్తును ప్రారంభించే ముందు సీబీఐ వారి పై అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలన్న నిబంధనను తప్పుపట్టింది. వారికా ప్రత్యేక రక్షణ ఎందుకని ప్రశ్నించింది. అవినీతికి సంబంధించినంత వరకు నిందితులంతా ఒకే తరగతి అని కుండబద్ధలు కొట్టింది. అది రాజ్యాంగంలోని సమాన హక్కు నిబంధనకు వ్యతిరేకమేనని బుధవారం జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తేల్చి చెప్పింది. ధర్మాసనం ప్రశ్నల పరంపరను ప్రభుత్వం తరఫు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ ఎల్.నాగేశ్వరరావు తట్టుకోలేకపోయారు. ‘ఒకదాని వెంట మరొక ప్రశ్న దూసుకొస్తుంటే జవాబివ్వడం కష్టం. బదులిచ్చేందుకు నాకు కాస్త అవకాశమివ్వండి’ అంటూ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. బెంచ్ సంధించిన ప్రశ్నలు.. కొందరికే ఈ రక్షణ ఎందుకు? ఏ పద్ధతి ప్రకారం వర్గీకరణ చేశారు? వేరే ఉద్యోగులకు ఈ ప్రయోజనం ఎందుకు లేదు? వీరికి, వారికి ఏంటీ తేడా? విధానరూపకర్తలైన ఉన్నతాధికారులకు దర్యాప్తు నుంచి రక్షణ లభించి.. ఆ విధానాలను అమలు పరిచేవారు మాత్రం ఈ చట్టం పరిధిలోకి వస్తారా? సంయుక్త కార్యదర్శి, ఆపై స్థాయి అధికారులు నిర్భీతితో పనిచేసేందుకు.. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలోనూ ప్రత్యేక రక్షణలు కల్పించారని, వాటి ప్రకారం అవినీతి ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించే ముందు వారి ఉన్నతాధికారి అనుమతి సీబీఐ తీసుకోవాల్సి ఉంటుందని అదనపు సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి తెలిపారు.