breaking news
kurnool- mantralayam
-
మంత్రాలయం–కర్నూలు రైల్వే లైనెప్పుడో?
సాక్షి, ఎమ్మిగనూరు(కర్నూలు) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయాన్ని జిల్లా కేంద్రమైన కర్నూలుతో అనుసంధానం చేస్తూ ప్రతిపాదించిన మంత్రాలయం–కర్నూలు రైల్వే లైన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాల ప్రజల వ్యాపార–వాణిజ్య రంగాల్లో వృద్ధి చెందేందుకు ఉద్దేశించిన ఈ రైల్వే ప్రాజెక్టు 49 ఏళ్లుగా జిల్లా ప్రజలను ఊరిస్తునే ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు మంత్రాలయంలో జరిగిన ఆర్ఎస్ఎస్ శిక్షణా తరగతుల సందర్భంగా బీజేపీ అగ్రనేత అమిత్ షా మంత్రాలయం రైల్వేలైన్‌ను పూర్తిచేస్తామని శ్రీ మఠం అధికారులకు చెప్పినా ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ ప్రస్థావన: శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం, జిల్లా అంతర్గత వాణిజ్య– వ్యాపార రంగాల అభివృద్ధి కోసం మంత్రాలయం–కర్నూలు రైల్వే లైన్ ప్రస్తావన 49ఏళ్ల క్రితమే పార్లమెంట్లో ప్రస్తావనకు వచ్చింది. 1970లో కర్నూలు పార్లమెంట్ సభ్యుడు, ఎమ్మిగనూరు ప్రాంత నేత వై.గాదెలింగన్న గౌడ్ పార్లమెంట్లో మంత్రాలయం వయా కర్నూలు మీదుగా శ్రీశైలం వరకు రైలు మార్గం ఏర్పాటు చేయాలని ప్రస్తావించినట్లు పార్లమెంట్ మినిట్స్ బుక్‌లో నమోదైంది. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న నేతలు 2002 నుంచి మంత్రాలయం– కర్నూలు రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రయత్నాలు మెుదలుపెట్టారు. 2003లో రాష్ట్రానికి చెందిన 14 మంది ఎంపీలు, అప్పటి రైల్వే బోర్డు సభ్యులు ఎర్రంనాయుడుతో కలసి అప్పటి రైల్వే మంత్రి నితీష్కువూర్తో మంత్రాలయం– కర్నూలు రైల్వేను ఏర్పాటు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఆయన 2004 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.165 కోట్లతో రైల్వే లైన్‌ను ప్రస్తావిస్తూ సర్వే కోసం నిధులు కేటాయించారు. సర్వే పనులు పూర్తి చేసిన రైల్వే ఉన్నతాధికారులు అప్పట్లో రూట్‌మ్యాప్‌ను కూడా రూపొందించారు. మంత్రాలయం క్రాస్ (తుంగభద్ర) నుంచి మాధవరం, ఇబ్రహీపురం, నందవరం, ఎమ్మిగనూరు, ఎర్రకోట, గోనెగండ్ల, హెచ్‌కైరవాడి, వేముగోడు, కోడుమూరు, గూడూరు, నాగలాపురం, పెద్దకొట్టాల, దూపాడు మీదుగా కర్నూలు రైల్వేలైన్‌కు అనుసంధానం చేస్తూ సర్వే ద్వారా రూట్‌మ్యాప్ రూపొందింది. మెుత్తం 110.700 కి.మీ. మధ్య దూరం గల ఈ రైలు మార్గంలో 14 స్టేషన్లు, 22 మలుపులతో రూట్‌మ్యాప్ తయారైంది. సర్వేలతో సరి మంత్రాలయం–కర్నూలు రైల్వేలైన్ ఏర్పాటుకు 2010 ఫిబ్రవరి 24న అప్పటి రైల్వే మంత్రి మమత బెనర్జీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బడ్జెట్లో రూ.10కోట్లు కేటాయించారు. అయితే వివిధ శాఖల అధికారుల మ«ధ్య సమన్వయ లోపం, పెరిగిన నిర్మాణ వ్యయం దృష్ట్యా పునఃసర్వే చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అందులో భాగంగా 2011 ఫిబ్రవరి 23న రూ.6 కోట్లతో టెండర్లను పిలిచారు. హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ టెండర్లను దక్కించుకున్నారు. సర్వే పనులు పూర్తి చేసి 2013లో నివేదిక పంపారు. కి.మీ. రూ.6 కోట్లు చొప్పున 110 కి.మీ.లకు రూ.660 కోట్లు ఖర్చు అవుతుందని నివేదికలో పేర్కొన్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర చేపట్టిన చంద్రబాబునాయుడు మంత్రాలయం–కర్నూలు రైల్వేలైన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడచిపోయాయిగానీ రైల్వే ప్రాజెక్టుపై శాసనసభలో తీర్మానం కూడా చేయలేదు. ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం కూడా రైల్వే బడ్జెట్లో మొండిచేయి చూపడంతో అప్పటి ఎంపీ బుట్టారేణుక కోరడంతో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ మంత్రాలయం–కర్నూలు రైల్వేలైన్ రీసర్వేకు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ బీజేపీయే అధికారంలోకి వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. -
కర్నూలు-మంత్రాలయం లైన్ రీసర్వే చేపట్టండి
- అమరావతి సమావేశంలో రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ను కోరిన ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(ఓల్డ్‌సిటీ): కర్నూలు- మంత్రాలయం రైల్వే లైన్ నిర్మాణానికి రీసర్వే నిర్వహించాలని ఎంపీ బుట్టా రేణుక కోరారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ మంగళవారం అమరావతిలో నిర్వహించిన సమావేశానికి ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ కర్నూలు రైల్వే స్టేషన్‌ను మాడరన్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు త్వరగా చేపట్టాలని జీఎంను కోరారు. కర్నూలు, మద్దికెర, కోసిగి స్టేషన్లలో అదనపు రిజర్వేషన్ కౌంటర్లు, ఆదోని క్రాంతినగర్ వద్ద రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జీ, వెంకట్రాది ఎక్స్‌ప్రెస్‌కు రద్దీ దృష్ట్యా అదనపు రైలు ఏర్పాటు చేయాలని కోరారు. కర్నూలు- అమరావతి లైన్ నిర్మాణంతో పాటు కొత్త ట్రైన్స్ నడపాలన్నారు. బుట్టా రేణుక ప్రతిపాదనలపై జీఎం వినోద్‌కుమార్ యాదవ్ సానుకూలంగా స్పందించినట్లు మంగళవారం ఎంపీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.