ప్రేమ కథ సుఖాంతం
జిల్లా ఎస్పీ ఎదుట హాజరైన ప్రేమికులు
ప్రేమ వివాహాన్ని సమర్థించిన న్యాయస్థానం
భద్రత కల్పించాలని పోలీసులకు ఆదేశం
హొసూరు, న్యూస్‌లైన్ : వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన ఓ యువజంట ప్రేమ కథ సుఖాంతమైంది. వీరి ప్రేమ వివాహాన్ని న్యాయస్థానం సైతం ఆమోదించి, భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెళితే... బైరమంగలానికి చెందిన రాజప్ప కూతురు దీప(22), కెలమంగలం సమీపంలోని కుటూరు గ్రామానికి చెందిన కుపేంద్రన్(22) పరస్పరం ప్రేమించుకున్నారు.
వీరి కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో వీరు పెద్దలను ఎదిరించి ఈ నెల 27న వెళ్లిపోయారు.
దీంతో కెలమంగలం పోలీస్ స్టేషన్లో రాజప్ప ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అతడి మనోభావాలు దెబ్బతినేలా ఎస్ఐ మదనలోకన్ వ్యవహరించడంతో మనస్థాపం చెందిన రాజప్ప ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిపై రాజప్ప బంధువులు, పీఎంకే పార్టీ నేతలు ఆందోళనకు దిగడంతో ఎస్ఐని అక్కడి నుంచి ఎస్పీ బదిలీ చేశారు. అనంతరం ప్రేమజంటను వెదికేందుకు చర్యలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ప్రేమజంటను పోలీసులు డెంకణీకోట మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో న్యాయమూర్తి సావిత్రి విచారణలో తమిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు యువతి అంగీకరించింది. అంతేకాక తన భర్తతో కలిసి జీవించేందుకు అనుమతివ్వాలని కోరింది. దీంతో వీరి ప్రేమ వివాహాన్ని న్యామూర్తి ఆమోదిస్తూ, వీరికి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు.