breaking news
kundur janareddy
-
అన్నివిధాలా ఆదుకుంటాం
పెద్దవూర, న్యూస్‌లైన్: లైంగికదాడికి గురైన అభంశుభం తెలియని 12మంది బాలికలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి కుందూరు జానారెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం మండలంలోని పులిచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో గల బాసోనిబావితండాను సందర్శించి బాధిత బాలికలను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బాధిత చిన్నారులు, వారి తల్లిదండ్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బాలికలను ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పార్టీలకతీతంగా ఖండించాలి ఏనెమీది తండా సంఘటనను యావత్ సమాజం పార్టీలకు అతీతంగా ఖండించాలని మంత్రి జానారెడ్డి కోరారు. బాధితులను పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముక్కుపచ్చలారని చిన్నారులు, విద్యార్థినులు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న మానవ మృగాలను సమాజం నుంచి వెలివేయాలన్నారు. అమాయకులైన బాధిత చిన్నారులకు మానసిక గాయాలు లేకుండా చూసి వారికి గౌరవప్రదమైన స్థానంకల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాలికలకు తగిన భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్ని సౌకర్యాలున్న పాఠశాలల్లో చేర్పించి ఉన్నత విద్య పూర్తయ్యే వరకు ప్రభుత్వమే చదివిస్తుందని తెలిపారు. ఈమేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు, సంబందిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లైంగికదాడికి పాల్పడిన మానవరూపంలోని క్రూరుడికి విధించే శిక్ష ఇతరులకు గుణపాఠం అయ్యేలా చూస్తామన్నారు. మంత్రి వెంట కలెక్టర్ చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్‌రావు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, మాజీ ఎంపీపీ కర్నాటి లింగారెడ్డి, పీసీసీ సభ్యుడు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు కురాకుల అంతయ్యయాదవ్, హాలియా ఏఎంసీ చైర్మన్ రమావత్ శంకర్‌నాయక్, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. పరామర్శ లైంగిక దాడికి గురైన బాలికలను, వారి కుటుంబ సభ్యులను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మాలె శరణ్యారెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నీలం సహానీ, ఏఎస్పీ రమారాజేశ్వరి, ఐసీడీఎస్ జేడీ శ్యామసుందరి, పీడీ ఉమాదేవి, డ్వామా పీడీ కాలిందిని, ప్రజాసంఘాల నాయకులు పరామర్శించారు. -
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
గుర్రంపోడు, న్యూస్‌లైన్: అర్హులందరికీ పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలను అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. శనివారం గుర్రంపోడులో నిర్వహించిన మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు, పేదలు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 10 జిల్లాల తెలంగాణకు కేంద్ర క్యాబినేట్ ఆమోద ముద్ర వేసినందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలిపారు. ఆమెకు తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని గ్రామపంచాయతీలకు వివిధ పథకాల కింద 90 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం రచ్చబండ ద్వారా 405 మందికి రేషన్‌కార్డులు, 631 మందికి పింఛన్లు, 711 ఇందిరమ్మ ఇళ్లు, 36 బంగారు తల్లి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను మంత్రి, ఎంపీలు అందజేశారు. అంతకు ముందు 20 కోట్లతో నిర్మించిన చేపూరు మంచినీటి ప్రాజెక్టుకు మంత్రి, ఎంపీతో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చెర్మైన్ యడవల్లి విజేందర్‌రెడ్డి, జెడ్పీసీఈఓ వెంకట్రావు, ఆర్డీఓ రవినాయక్, ఎంపీడీఓ రాంపర్తి భాస్కర్, తహసీల్దార్ టి. వెంకటేశం, జెడ్పీ మాజీ చెర్మైన్ చింతరెడ్డి మల్లారెడ్డి, రచ్చబండ కమిటీ సభ్యులు జాలచినసత్తయ్య యాదవ్, కంచర్ల వెంకటేశ్వర్‌రెడ్డి, నీలా భారతమ్మ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.