breaking news
kss venkateswararao
-
పారామెడికల్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం మెడికల్: అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2017–18 సంవత్సరానికి గాను పారా మెడికల్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. దరఖాస్తులు http://dme.ap.nic.in, www.appmb.org.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 5వ తేదీలోపు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. మొదటి కౌన్సెలింగ్ సెప్టెంబర్ 15న, రెండో కౌన్సెలింగ్ సెప్టెంబర్ 22న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెడికల్ కళాశాలలో ఉంటుందన్నారు. కోర్సుల వారీగా డీఎంఎల్టీ–10, డీఓఏ–10, డీఏఎన్ఎస్–30, డీఎంఐటీ–10, డీఈసీజీ–3, డీఆర్జీఏ–6, డీడీఆర్ఎ–3 ఖాళీలున్నట్లు తెలిపారు. ఇంటర్ అర్హత ఉన్న వారంతా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. -
ఇప్పటికింతే!
– మెడికల్ కళాశాలకు 4 పీజీ సీట్ల మంజూరుకు గ్రీన్‌సిగ్నల్ – 23 విభాగాల్లో ఇప్పటికొచ్చింది రెండింటికే.. – ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడి పరిస్థితి దారుణం – వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఇన్చార్జ్గా ఉన్నా ఫలితం శూన్యం అనంతపురం మెడికల్ : పీజీ సీట్లు మంజూరవుతున్నాయని ఆనందించాలో.. అవి వచ్చేందుకు 16 ఏళ్లు పట్టిందని బాధపడాలో తెలీని పరిస్థితి. ఇప్పటికైతే నాలుగు సీట్లు వస్తాయన్న కబురు ఊరటగా అనిపించినా, పూర్తి స్థాయిలో సీట్లు సాధించుకోవడంలో మాత్రం ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తిగా వైఫల్యం చెందుతున్నారన్నది సుస్పష్టం. రాయలసీమలోని ఇతర కళాశాలలు గతంలోనే పీజీ సీట్లు సాధించుకున్నాయి. సాక్షాత్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నా.. ‘అనంత’కు పూర్తిస్థాయి పీజీ సీట్లు మాత్రం కలగానే మారాయి.వచ్చే ఏడాది నుంచి మైక్రో బయాలజీ విభాగానికి పీజీ సీట్లు మంజూరు చేస్తున్నట్లు సమాచారం రావడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు అందాల్సి ఉంది. 'అనంత' కృషితో 18 సీట్లు వచ్చినా.. అనంతపురం మెడికల్ కళాశాల 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. దీనికి అనుబంధంగా 500 పడకల బోధనాస్పత్రి (సర్వజనాస్పత్రి) ఉంది. కళాశాలలో వంద ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. 2011 నవంబర్‌లో 18 పీజీ సీట్లు మంజూరు చేస్తూ కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. అప్పటి ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి కృషితో జనరల్ మెడిసిన్‌కు ఐదు, పెథాలజీకి నాలుగు, ఆర్థోపెడిక్‌కు మూడు, అనాటమీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్‌కు రెండేసి చొప్పున సీట్లు వచ్చాయి. అదనపు భవనాల నిర్మాణం, పరికరాలు, ఇతర సౌకర్యాల కల్పన కోసం రూ.2.66 కోట్లు ఇచ్చింది. అయితే.. నిబంధనల ప్రకారం ఇక్కడ సౌకర్యాలు లేవన్న కారణంతో పీజీ సీట్ల భర్తీకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) అనుమతి నిరాకరించింది. అడిగింది 37.. వచ్చేది నాలుగే.. మెడికల్ కళాశాలలో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పెథాలజీ, మైక్రో బయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఎస్పీఎం, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్, టీబీ అండ్ రెస్పిరేటరీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, ఆప్తాల్మాలజీ, రేడియోడయాగ్నసిస్, అనస్తీషియాలజీ, గైనిక్, డెంటిస్ట్రీ, రేడియో థెరపీ, మెడిసిన్–రీహ్యాబిలిటేషన్ విభాగాలు ఉన్నాయి. ప్రస్తుతం ఫార్మకాలజీలో మాత్రమే రెండు పీజీ సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర వ్యాప్తంగా 145 పీజీ సీట్లు మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)కు ప్రతిపాదనలు పంపింది. ఇందులో గుంటూరు మెడికల్ కళాశాలకు 45, అనంతపురం మెడికల్ కళాశాలకు 37, కడప రిమ్స్‌కు 25, విజయవాడ సిద్ధార్థ కళాశాలకు 17, ఒంగోలు రిమ్స్‌కు 21 పీజీ సీట్ల కోసం విన్నవించింది. ఆ తర్వాత అనంతపురం మెడికల్ కళాశాలను ఎంసీఐ బృందం తనిఖీ చేసింది. కొన్ని లోటుపాట్లను గుర్తించింది. ఈ నేపథ్యంలో తాజాగా మైక్రో బయాలజీ విభాగానికి నాలుగు సీట్లు మాత్రమే మంజూరు చేస్తామని కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించింది. సమష్టి కృషితోనే పీజీ సీట్లు సాధ్యం అనంతపురం మెడికల్ కళాశాలకు పీజీ సీట్లు పూర్తి స్థాయిలో రావాలంటే రాజకీయ నేతలు, అధికారులు సమష్టి కృషి అవసరమని సీనియర్ వైద్యులు చెబుతున్నారు. వైఎస్ఆర్, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో రాజకీయాలకు అతీతంగా పోరాడి పీజీ సీట్లను సాధించుకున్నారని గుర్తు చేస్తున్నారు. కడప రిమ్స్ (150 ఎంబీబీఎస్ సీట్లు) 2006లో ప్రారంభం కాగా 2013లో 20 పీజీ సీట్లు తెచ్చుకోగలిగింది. నంద్యాల శాంతరాం వైద్య కళాశాల (100 ఎంబీబీఎస్ సీట్లు) 2005లో మొదలవగా 2011లో క్లినికల్, నాన్ క్లినికల్ కలిపి 40 సీట్లు తెచ్చుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం మెడికల్ కళాశాల 2002లో (150 ఎంబీబీఎస్ సీట్లు) ప్రారంభమైతే 2009లో పీజీ సీట్లు వచ్చాయి. ప్రస్తుతం అక్కడ అన్ని విభాగాల్లో కలిపి 80 పీజీ సీట్లు ఉన్నాయి. ఈ కళాశాలలన్నింటి కంటే ముందు అంటే 2000లో అనంతపురం మెడికల్ కళాశాల 100 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభమైనా.. పీజీ సీట్లు తెచ్చుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో అంతా కలసికట్టుగా సాగితే భవిష్యత్‌లో మరిన్ని పీజీ సీట్లు సాధించుకునే అవకాశం ఉంది. భవిష్యత్‌లో మరిన్ని సీట్లు సాధిస్తాం మైక్రో బయాలజీకి 2017–18 సంవత్సరానికి గాను నాలుగు పీజీ సీట్లు మంజూరయ్యాయి. భవిష్యత్‌లో మరిన్ని సాధించుకునేందుకు కృషి చేస్తాం. త్వరలోనే పెథాలజీ, ఫొరెన్సిక్‌లో 8 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అందరి సహకారంతోనే ఇది సాధ్యమైంది. – కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్