breaking news
kotavuratla
-
విషాహారానికి ముగ్గురు విద్యార్థులు బలి.. .. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అనకాపల్లి: ఫుడ్ పాయిజన్‌తో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, మరో 35 మంది అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విషాద ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది. కోటవురట్ల మండలం కైలాసపట్నం శివారు రాజగోపాలపురంలో పరిశుద్ధాత్మ అగ్ని స్తుతి ఆరాధన (పాసా) ట్రస్ట్ నిర్వహిస్తున్న ఆశ్రమంలో శనివారం రాత్రి మిగిలిపోయిన బిర్యానీని తినడం వల్ల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ట్రస్ట్ నిర్వాహకుడు, పాస్టర్ ఎం.కిరణ్‌కుమార్ ఈ నెల 17న పందూరులో మధ్యాహ్నం జరిగిన ఓ ప్రైవేట్ ఫంక్షన్‌కు వెళ్లాడు. అక్కడ మిగిలిపోయిన బిర్యానీని ఆశ్రమానికి తెచ్చి రాత్రి విద్యార్థులకు పెట్టారు. దాన్ని తిన్న విద్యార్థుల్లో ఐదుగురు అదేరోజు అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు చేసుకున్నారు.వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. తెల్లవారుజామున మరో 15 మంది అస్వస్థతకు గురవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి రప్పించారు. తల్లిదండ్రులతో విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. తీవ్ర అస్వస్థతతో ఇంటి దగ్గరే మరుసటి రోజు ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మరో 35 మందిని తల్లిదండ్రులు సమీపంలోని నర్సీపట్నం, పాడేరు ఏరియా ఆస్పత్రులకు, డౌనూరు, చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. నర్సీపట్నంలో చికిత్స పొందుతున్న 16 మందిలో 14 మంది ఆరోగ్యం విషమించడంతో విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు.ప్రస్తుతం నర్సీపట్నం, పాడేరు, డౌనూరు, చింతపల్లి ఆస్పత్రుల్లో 21 మంది చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజన్ జరిగిన రోజు అర్ధరాత్రి అస్వస్థతకు గురైన ఐదుగురిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వారిలో కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీ రెల్లలపాలేనికి గెమ్మెలి నిత్య(భవాని)(8), చింతపల్లి మండలం తిరుమల పంచాయతీ నిమ్మలపాలేనికి చెందిన తంబెలి జాషువా(7), చింతపల్లి మండలం బలభద్రకు చెందిన కొర్రా శ్రద్ధ(7) ఆదివారం రాత్రి ఇంటి వద్దే మృతి చెందారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జెస్సికాకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. 13 ఏళ్లుగా అనధికారికంగానే..పాస్టర్ కిరణ్‌కుమార్ 13 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పాసా ట్రస్టుకు ఎలాంటి అనుమతుల్లేవు. తొలుత అతను కోటవురట్ల మండలం హనుకు గిరిజన గ్రామంలో చర్చి ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో ఓ అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో గ్రామస్తులు పంపించేశారు. ఆ తర్వాత ఇక్కడ ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. ఇక్కడున్న 86 మందిలో 80 మంది అల్లూరి జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులే.సంఘటన స్థలాన్ని సందర్శించి, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఘటనపై విద్యాశాఖ అధికారులు, పోలీసులతో విచారణకు ఆదేశించారు. పాసా ట్రస్ట్ నిర్వాహకుడు కిరణ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ సోమవారం రాత్రి మీడియాకు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, ఉన్నతస్థాయి కమిటీ విచారణకు సీఎం ఆదేశించినట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ వెల్లడించారు.విద్యా సంస్థల తనిఖీలకు సీఎం ఆదేశంసాక్షి, అమరావతి: రెండు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా కోటవురట్లలోని హాస్టల్లో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మరణించిన నేపథ్యంలో ఇతర విద్యా సంస్థల్లో పరిస్థితులను తనిఖీ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు వారి పరిధిలోని ప్రయివేటు, చైల్డ్ కేర్ సెంటర్లను తనిఖీ చేయాలని సోమవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు.విద్యార్థుల మృతి ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం, కైలాసపట్నంలో కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు మరణించిన ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సరైన పర్యవేక్షణ కొరవడిందనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. చికిత్స పొందుతున్న ఇతర విద్యార్థులకు మంచి వైద్య సదుపాయాలను అందించాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలు ఇకనైనా మాని వ్యవస్థలపై దృష్టి పెట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. -
నేనూ కూలీ బిడ్డనే: ఎమ్మెల్యే బాబూరావు
కోటవురట్ల: నేనూ కూలీ బిడ్డనే..కష్టమంటే ఏమిటో నాకు బాగా తెలుసు..కష్టపడి చదివా..మంచి ఉద్యోగం చేశా..ఉన్నతాధికారిగా ఊరూరూ తిరిగా..మీ సమస్యలు నాకు తెలుసు..మీ బిడ్డలకు మంచి భవిష్యత్ ఇవ్వాలంటే బాగా చదివించండి.. అంటూ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఉపాధి హామీ పథకం వేతనదారులను పలకరించారు. మండలంలోని నీలిగుంట, జి.సన్యాసిరాజుపాలెం గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మార్గంమధ్యలో టి.జగ్గంపేటలో ఉపాధి పనులు చేస్తున్న వేతనదారులతో మాట్లాడారు. వారితో చేయి కలిపి పలుగూ పారా చేత బట్టారు. గునపంతో మట్టి తవ్వి వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి వెనువెంటనే అధికారులకు ఆదేశాలిచ్చారు. పిల్లల భవిష్యత్‌పై దృష్టి సారించాలని విద్యతోనే ఉన్నతమైన జీవితం వస్తుందని వారికి హితబోధ చేశారు. పిల్లలను కూలీలుగా మార్చొద్దని, వారిని బడికి పంపి మంచి జీవితాన్ని ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల బంగారు భవితకు నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా అభివృద్ధి చేసిందన్నారు. చదవండి: (రక్తపింజర పామును మింగేసిన నాగుపాము) -
అన్నయ్యలా డెరైక్షన్ చేస్తా
సినీహీరో సాయిరామ్ శంకర్ కోటవురట్ల, న్యూస్‌లైన్ : పూరీ అన్నయ్యలా డైరక్షన్ చేయాలని ఉందని వర్ధమాన యువ హీరో, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ తన మనసులోని మాటను బయటపెట్టారు. సాయిరామ్ శంకర్ సంక్రాంతి పండుగను తన స్వంత ఊళ్లో కుటుంబ సభ్యులతో జరుపుకొనేందుకు తన స్వగ్రామమైన బి.కె.పల్లికి వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ముచ్చటించారు...ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే.. డెరైక్షన్ అంటే ఇష్టం... డైరక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. ఏడేళ్లపాటు పూరీ అన్నయ్య వద్ద శివమణి సినిమా వరకు అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేశాను. హీరోగా ఇప్పటి వరకు 9 సినిమాలు చేశాను. రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి... 143, బంపర్ ఆఫర్... మంచి పేరు తెచ్చాయి... ఇడియట్, నేనింతే సినిమాల్లో అతిథి పాత్రలు పోషించాను. నేను నటించిన 143, బంపర్ ఆఫర్ సినిమాలు నాకు మంచి పేరు తెచ్చాయి..అవి నాకిష్టమైన సినిమాలు. బంపర్ ఆఫర్ సినిమాకు పూరీ అన్నయ్య కథ మాటలు అందించారు. అన్నయ్య డెరైక్షన్‌లో నటించాలని... అన్నయ్య బిజీగా ఉండడం వల్ల అన్నయ్య డైరక్షన్లో నటించే అవకాశం కలగలేదు. అన్నయ్యకు నేను, గణేష్ అన్నయ్య అంటే చాలా ఇష్టం ఎప్పుడూ మా క్షేమాన్ని ఆయన ఆశిస్తారు. అందుకే తాను బిజీగా ఉన్నప్పటికీ నేను నటించిన రోమియో, దిల్లున్నోడు (రెండూ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి) సినిమాలకు కథ, మాటలు ఇచ్చారు. త్వరలో మూడు సినిమాల్లో... ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళ్లో ఒకటి సినిమాలు అంగీకరించాను. తమిళ్ సినిమా ఈ నెలాఖరు ప్రారంభమవుతుంది. కొత్త సినిమా కోసమే ఈ గెడ్డం పెంచుతున్నా. కథ నచ్చితే ఏ పాత్ర అయినా... నాకు డ్రీమ్ రోల్ అంటూ ఏదీ లేదు. కథ నచ్చితే ఏ పాత్రనైనా చేస్తాను. గణేష్ అన్నయ్య(వైఎస్సార్ సీపీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త) ఎన్నికల్లో పోటీ చేస్తే నేను, పూరీ అన్నయ్య కూడా ప్రచారం చేస్తాం. ఉదయ్ ఉదంతం బాధ కలిగించింది... ఉదయ్‌కిరణ్‌తో నాకు పరిచయం ఉంది.. తను చాలా దృఢమైన మనస్తత్వం ఉన్నవాడు... కానీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఇప్పటికీ అర్ధం కావడం లేదు. సొంతూళ్లోనే సంక్రాంతి ఎంత హీరో అయినా నేను మా గ్రామంలో సాయిని మాత్రమే. పాత మిత్రులు, వారితో చేసిన అల్లరి పనులు గుర్తుకు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. అందుకే ప్రతి ఏటా సంక్రాంతి పండుగను స్వంత ఊళ్లో,కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకొంటాను.