కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్లు
                  
	పుస్తక సమీక్ష
	 ఈ కథలనిండా అపరిమితమైన దుఃఖం పరచుకొని వుంది. విమల ఏళ్ళకేళ్ళుగా గడ్డకట్టుకొనిపోయిన తనలోని వేదననీ బాధనీ అక్షరాలుగా మలచి మనతో పంచుకున్నారా అనిపిస్తోంది.
	
	అంతగా ఆకట్టుకోలేని ముఖపత్రంతో వెలుపడిన విమల కథలు చదవటం మొదలుపెట్టాక విడిచిపెట్టలేనంతగా కట్టిపడేస్తాయి. ఈ పుస్తకంలో 13 కథలు వున్నాయి. ‘వదిలేయ్’ తప్ప మిగిలినవన్నీ 2011 నించి 2015 వరకూ వివిధ పత్రికలలో వచ్చినవే.
	ఈ కథలనిండా అపరిమితమైన దుఃఖం పరచుకొని వుంది. విమల ఏళ్ళకేళ్ళుగా గడ్డకట్టుకొనిపోయిన తనలోని వేదననీ బాధనీ అక్షరాలుగా మలచి మనతో పంచుకున్నారా అనిపిస్తోంది.
	
	నల్లపిల్ల నవ్వు, నీలావాళ్ళమ్మ మరికొందరు, వాళ్ళు ముగ్గురేనా?, దౌత్య, చుక్కలకింద రాత్రి కథలలో మగవాళ్ళ మోసానికి గురైన మహిళలు కనిపిస్తారు. నల్లపిల్ల నవ్వులోని మధురిమ, నీలా వాళ్ళమ్మ కథలోని శ్యామల, వాళ్ళు ముగ్గురేనా? కథలోని యాదమ్మ ఏదో ఒకవిధంగా నిలదొక్కుకుని తమ జీవితాలను కొనసాగించడాన్ని చూస్తాం. కానీ దౌత్య కథలో తనని అర్థం చేసుకుని, తన అభిప్రాయాలకు విలువనిచ్చే తల్లిదండ్రులూ, చదువూ, ఆస్తీ, ఉద్యోగం అన్నీ వున్న దౌత్య తనను ప్రేమించి, కొంతకాలం సహజీవనం కూడా చేసి వదిలిపోయిన వ్యక్తిపై ప్రేమను వదులుకోలేక, తనను ప్రేమించే తల్లిదండ్రుల గురించి కొంచమైనా ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుంటుంది.
	
	కనకలత కథలో హింసని ఎదిరించి, బతకటమే ముఖ్యంగా భావించి, సంఘాలలో పనిచేసి, జీవితంలో ఎప్పటికైనా మార్పు వస్తుందనే ఆశతో జీవన పోరాటం చేసిన కనకలత ఆ క్రమంలో అనేక సంబంధాలలోకి వెళ్తుంది. అయినా ఆమెకు ఎక్కడా హింస తప్పలేదు.
	చుక్కల కింద రాత్రి కథ పదిహేడేళ్లయినా నిండకుండానే ఏడాదిన్నర బిడ్డకు తల్లై, మత్తుమందులు పీల్చడానికి అలవాటుపడి, వీధులే ఇల్లుగా జీవించే సల్మా, ఆమె తల్లీ అక్కల కథ. మార్తా ప్రేమ కథ, కొన్ని నక్షత్రాలు కాసిని  కన్నీళ్లు ఉద్యమ నేపథ్యం కలిగిన కథలు. ఉద్యమంతో కలిసి నడవటం మార్తాలో సున్నితత్వాన్ని పెంచటమే కాక ఆమెని గట్టిపరుస్తుంది కూడా. ఆ గట్టితనం వల్లనే సహచరుడి వియోగంతో విషాదంలో కూరుకుపోకుండా తన జీవితాన్ని కొనసాగించగలుగుతుంది.
	
	పుస్తకం శీర్షికగా ఉన్న కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్ళు ఉద్యమాలను అణచివెయ్యడానికి రాజ్యం, ఎంత గుడ్డిగా, అమానుషంగా మనుషుల జీవితాలను ఛిద్రం చేసెయ్యగలదో చూపించిన కథ. మాధవ అనే అనాథ యువకుడు ఉద్యమంలో పనిచేయడానికి వస్తాడు. తనగురించీ, తన ప్రేమ గురించీ, దాన్ని విఫలం చేయడానికి అమ్మాయి వైపు వాళ్లు ఆమెను బాధపెడుతుండటం గురించీ, భావి జీవితం గురించిన తన ఆశలూ కలల గురించీ రాజకీయ కార్యకర్తగా పనిచేస్తున్న కథకురాలితో చెప్పుకున్న తెల్లవారే తన జట్టుతో రాజకీయ ప్రచారంకోసం గ్రామాలకు వెళ్తూ మరొకరితోపాటు అనామకంగా పోలీసుల చేతుల్లో హత్యకు గురవుతాడు. కొన్ని రోజులకు అతడు ప్రేమించిన జ్యోతి అనే అమ్మాయి కథకురాలిని కలిసి మాట్లాడుతుంది. అప్పటి కలచివేసిన సంఘటనలను కథకురాలు గుర్తు చేసుకునే కథ ఇది.
	
	ఈ కథలో చిన్న తప్పు ఉందనిపిస్తోంది. కథకురాలితో మాట్లాడిన తెల్లవారే మాధవ హత్యచేయబడతాడు. సిరిసిల్ల దగ్గర గ్రామాల్లో ఉన్న ఇతను సిద్ధిపేటలో ఉన్న జ్యోతిని కలిసి తాను కథకురాలితో మాట్లాడినట్టుగా ఆమెకు చెప్పే అవకాశం లేదు. అయితే కథకురాలిని కలిసి మాట్లాడటానికి వచ్చిన జ్యోతి ‘మీరు మాట్లాడతానన్నారని చెప్పిండు’ అంటుంది.
	
	ఈ రచనల్లో ఇదీ కథ అని నిర్దిష్టంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. అయినా ఒక కథనించి ఇంకో కథకీ అందులోంచి మరోదాన్లోకి ఎక్కడా లంకె చెడకుండా పకడ్బందీగా పేర్చారు విమల. అనేక పాత్రలు వస్తూ పోతూ ఉంటాయి. వాతావరణ వివరణ, పాత్రల ఇష్టాయిష్టాల్లాంటి వివరాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయితే అవేవీ అతిగా కాక కథను నడిపించటంలో సరిగ్గా పనిచేశాయనిపించింది.  
	 మరికాస్త శ్రద్ధగా ప్రూఫ్ రీడింగ్ చేసివుంటే ఆ వచ్చిన కాసిన్ని అక్షరదోషాలూ, అనవసర ఖాళీలూ ఉండివుండేవి కావు. కొన్నిచోట్ల ప్రింటింగ్ సరిగ్గా లేదు. సగంసగం అక్షరాలు ఒకదాని పక్కనే ఒకటి ఇరికినట్లుగా వచ్చాయి.
	                                                                                                                                                          -  అమృత