breaking news
kondru muralimohan
-
చంద్రబాబును కలిసిన ప్రతిభా భారతి.. తీవ్ర అసంతృప్తి!
సాక్షి, అమరావతి : టీడీపీ అధినాయకత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ స్పీకర్ ప్రతిభా భారతి బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిశారు. తన ప్రత్యర్థి అయిన మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ టీడీపీలో చేరబోతుండటాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాను టీడీపీలో ఉండగా కొండ్రు మురళీని పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరమేముందని ఆమె చంద్రబాబును ప్రశ్నించినట్టు తెలుస్తోంది. పార్టీ అవసరాల కోసమే కొండ్రు మురళీని టీడీపీలోకి తీసుకుంటున్నట్టు చంద్రబాబు ఆమెకు బదులిచ్చారు. ఆయన పార్టీలో చేరినా.. మీకు ప్రాధాన్యం తగ్గదని ప్రతిభా భారతికి నచ్చజెప్పేందుకు బాబు ప్రయత్నించినట్టు సమాచారం. కానీ, చంద్రబాబు తీరుపై ప్రతిభా భారతీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 6న కొండ్రు మురళీ టీడీపీలో చేరబోతున్నారు. -
'ఆ ముగ్గురూ ద్రోహులుగా మిగిలారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు చేయకుండా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముగ్గురూ ద్రోహులుగా మిగలారని పీసీసీ ఉపాధ్యక్షులు కొండ్రు మురళీ విమర్శించారు. రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై జరిగిన చర్చ ఎంతో బాధాకరమన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన ఏఐసీసీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి శైలజానాధ్, ప్రధాన కార్యదర్శులు జంగా గౌతమ్, గిడుగు రుద్రరాజు, కిసాన్‌సెల్ చైర్మన్ కె. రవిచంద్రారెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ హోదా కోసమే కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రైవేట్ బిల్లును చంద్రబాబు వేస్ట్ పేపర్ అనడం తెలుగు ప్రజలను అవమానపరచడమేనన్నారు. ఆగస్టు 5న రాజ్యసభలో ఈ బిల్లు మళ్లీ చర్చకు వస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు నీతి, నిజాయితీ, చిత్తశుద్ది ఉంటే ఢిల్లీకి వచ్చి ఏపీ ప్రత్యేక హోదా విషయమై బీజేపీని ఎండగట్టాలని శైలజానాధ్ సవాల్ విసిరారు. రాజ్యసభలో హోదాపై బిల్లు ఓటింగ్‌కు వచ్చి పాస్ అయితే బీజేపీ, టీడీపీ పుట్టగతులుండవనే బిల్లు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి ప్రధమ ముద్దాయి సీఎం చంద్రబాబే అని ఆరోపించారు. విజయవాడలో టీడీపీ, బిజేపీల విద్రోహంపై ఆగస్టు 1న జరిగే సభను జయపద్రం చేయాలని కోరారు. చంద్రబాబు వైఫల్యాల వల్లే ప్రత్యేక తరగతి హోదా రావడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు అసమర్థత వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం వాటిల్లుతుందని, తమ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని దుయ్యబట్టారు. దమ్మూ, ధైర్యం ఉంటే కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధించాలన్నారు. రెండేళ్ల పాలనలో రాష్ట్రానికి ఏమి సాధించారో చెప్పాలని ప్రశ్నించారు.