పార్టీ మారను.. కాంగ్రెస్ ను వీడను: కోమటిరెడ్డి
ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారనని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఏదిఏమైనా చివరి వరకు కాంగ్రెస్ పార్టీ వీడను అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ వీడుతున్నట్టు వస్తున్న వార్తలను కోమటి రెడ్డి ఖండించారు. భువనగిరి ఎంపీ టికెట్ కేటాయింపుపై సందేహాలు తలెత్తడంతో కోమటిరెడ్డి సోదరులు పార్టీ వీడుతున్నట్టు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కోమటి రెడ్డి వెంకటరెడ్డి స్పందించారు.
తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి భువనగిరి సీటు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎంపీ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాకుండా తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య లేదా ఆయన కోడలు వైశాలికి భువనగిరి టికెట్ కేటాయింపు చేయవచ్చనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ వీడే యోజనలో ఉన్నారని మీడియాలో కథనాలు వెల్లవడిన సంగతి తెలిసిందే.