breaking news
kinfisher airlines
-
'వాళ్ల ఉద్యోగాలు పోనివ్వం'
న్యూఢిల్లీ : లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాదిరి ఎయిరిండియాను అవ్వాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని సివిల్ ఏవియేషన్ మంత్రి అశోక్ గణపతిరాజు చెప్పారు. ఎయిరిండియా ఎప్పటికీ దేశానికి సేవ చేసేలా ఉండేలా చేయాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ఎయిరిండియాలో పనిచేసే ఎవరూ కూడా ఉద్యోగం కోల్పోవడానికి వీలులేదని అశోక్ గణపతిరాజు లోక్‌సభలో చెప్పారు. ఈ నేషనల్ క్యారియల్ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.'' ఎయిరిండియాలో పనిచేసే ఏ ఒక్కరూ నిరుద్యోగులుగా మారాలని కోరుకోవడం లేదు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాదిరి ఎయిరిండియా కావాలనుకోవడం లేదు. ఎయిరిండియా దేశానికి, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. అతి పైపై ఎత్తులకు ఇంకా ఎగరాలి'' అని ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన చెప్పారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటుచేశామని, ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ఈ కమిటీ చూస్తుందని తెలిపారు. ఈ ప్యానల్‌కు ఎంపీలతో సహా సలహాలు ఇవ్వొచ్చని చెప్పారు. జూన్ 28న ఎయిరిండియాలోని పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కానీ తుది పద్ధతులను ఆర్థికమంత్రి నేతృత్వంలోని మంత్రులే నిర్ణయిస్తారని అశోక్ గణపతి రాజు పేర్కొన్నారు. ఇప్పటికే ఎయిరిండియా రుణభారం రూ.52వేల కోట్లకు చేరుకుంది. రుణాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ సంస్థను ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. -
దిగివస్తున్న మాల్యా?
బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి తప్పించుకు తిరుగుతున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా వ్యవహరంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇటు సుప్రీంకోర్టు హెచ్చరికల నేపథ్యంలో విదేశాల్లో చక్కర్లు కొడుతున్న మాల్యా బెంబేలెత్తినట్టు కనిపిస్తోంది. ఈడీ, కోర్టుముందు హాజరుకాకుండా, బేరసారాలకు దిగుతున్న విజయ్‌మాల్యా మరింత దిగివచ్చినట్టు తెలుస్తోంది. తమ హెచ్చరికలను ఖాతరుచేయని మాల్యా వ్యవహారంపై ఈడీ సీరియస్ గా స్పందించడంతో రుణాల సెటిల్ మెంట్ కు సంబంధించి మరో కొత్త ఆఫర్ ను తెరపైకి తెచ్చారు. బుదవారం నాటి ఈడీ షాక్‌తో మొదటికే మోసం వస్తుందని భావించిన మాల్యా.. మొత్తం సెటిల్మెంట్ను రూ.6 వేల కోట్లకు పెంచుతూ ప్రతిపాదించారు. గతంలో 4వేల కోట్లు మాత్రమే చెల్లిస్తానని చెప్పిన మాల్యా, ఇప్పుడు మరో 2వేల కోట్లను జోడించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త ప్రతిపాదనను ఆయన త్వరలోనే కోర్టుకు ముందుకు తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పాస్ పోర్టు రద్దుచేయాలని ఈడీ ప్రభుత్వానికి లేఖ రాయడం వల్లే ఈ ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. ముందుగా మీ ఆస్తుల విలువ ఎంతో చెప్పండన్న సుప్పీంకోర్టు మొట్టికాయలు కూడా గట్టి ప్రభావాన్నే చూపించాయి. కాగా, ఐడీబీఐ కేసులో తన ముందు విచారణకు హాజరుకాని మాల్యా పాస్ పోర్టు రద్దు చేయాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రభుత్వానికి బుధవారం లేఖ రాసింది. మరోవైపు బ్యాంకుల వద్ద తీసుకున్న రూ.4,900 కోట్లు, దానికి అయిన వడ్డీ... మొత్తం కలుపుకుని రుణం రూ.9 వేల కోట్లకు చేరుకున్న సంగతి తెలిసిందే.