breaking news
KGBV Illnesses
-
కేజీబీవీలో నాసిరకం ఆహారం
నేరడిగొండ: నాసిరకం భోజనం కారణంగా 19 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని కేజీబీవీలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనను నిరసిస్తూ విద్యార్థినులు భవనం పైకెక్కి ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలోని కేజీబీవీలో 248 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఉదయం టిఫిన్ (చపాతి, పెసరపప్పు) చేసిన 11మంది విద్యార్థినులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురికావడంతో వారిని వెంటనే సిబ్బంది స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు రిఫర్ చేశారు. ఈ క్రమంలో మిగతా విద్యార్థులు కేజీబీవీ భవనం పైకెక్కి ఆందోళన చేపట్టారు. ఇటీవల భోజనంలో తరచూ రాళ్లు, వెంట్రుకలు వస్తున్నాయని ఎన్నిసార్లు చెప్పినా సిబ్బంది పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆదివారం సెలవుదినం కావడంలో అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు కూడా సిబ్బందిని నిలదీశారు. దీంతో ప్రిన్సిపాల్ జయశ్రీ అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు. సెక్టోరల్ అధికారి ఉదయశ్రీకి పలువురు పిల్లల తల్లిదండ్రులు ఫోన్ చేయగా, సోమవారం వచ్చి సమస్య లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. కాగా, ప్రిన్సిపాల్‌ను ఈ విషయమై సంప్రదించగా.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. కాగా, లంబాడా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు జాదవ్ మహేందర్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విద్యార్థినుల నిరసనకు మద్దతు తెలిపారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించారు. -
కేజీబీవీకి అస్వస్థత
సీతంపేట : రాత్రి భోజనం చేసి పడుకున్న విద్యార్థినులు తెల్లారేసరికి విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సీతంపేటలోకి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో ఈ సంఘటన చోటుచేసుకోవడంతో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. 20 మంది అనారోగ్యంపాలు కాగా పరిస్థితి తీవ్రంగా ఉన్న ఎనిమిది మందిని స్థానిక 30 పడకల ఆస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి విద్యార్థినులకు అన్నంతోపాటు ఆనపకాయ, అరటి, పెసరపప్పు, క్యాబేజీ కలిపి కూర వండి పెట్టారు. అది తిన్న విద్యార్థినులు మంగళవారం ఉదయం నుంచి అనారోగ్యం బారిన పడ్డారు. వీరిలో ఏడో తరగతి విద్యార్థినులే అధిక సంఖ్యలో ఉన్నారు. ఎ.శ్రావణి, ఎ.సుశీల, ఎస్.కళ్యాణి, బి.సరస్వతి, సూర్యకాంతంతో పాటు బి.చాందిని, గాయత్రి, పి.అశ్వనీ, సోనియా, ఎస్.రోజా, ఎం.లక్ష్మి, కె.లావణ్య తదితరులు అస్వస్థతకు గురి కాగా వారిలో కొందరిని స్థానిక యూపీహెచ్సీకి తీసుకువె ళ్లారు. అయితే అక్కడ ఉంచి వైద్యసేవలు అందించకుండా కొద్దిసేపటికే పాఠశాలకు తీసుకువచ్చేశారు. నీరసించిపోతున్న ఎనిమిది మంది విద్యార్థినులు ఎన్.శ్రావణి, ఎన్.మాదురి, ఎ.గాయిత్రి,బి.చాందిని, బి.మినతి, టి.అశ్విని, కె.కార్తీకలను అంబులెన్స్‌లో 30 పడకల ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా 20 మంది అస్వస్థతకు గురికావడంతో పాఠశాలలో మిగతా విద్యార్థినులు కూడా ఆందోళన చెందుతున్నారు. పీవో ఆగ్రహం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎన్.సత్యనారాయణ పాఠశాలను సందర్శించారు. అనారోగ్యానికి గురైన వారందరికీ దగ్గరుండి వైద్యసేవలందించాలని ఎస్పీహెచ్వో రాంబాబుకు సూచించారు. కోలుకుంటున్న కొంతమందికి పాఠశాలలోనే ఉంచి వైద్యం అందించాలని హెల్త్ అసిస్టెంట్ జగదీష్, ఏఎన్ఎంలు లలిత, లక్ష్మిలకు సూచించారు. ఇంతమంది విరేచనాలతో బాధపడుతుంటే పీహెచ్సీలో ఉంచి ఎందుకు వైద్యసేవలందించలేదని, పర్యవేక్షణ ఇదేనా అని డిప్యూటీ డీఎంహెచ్‌వో నాయక్‌ను పీవో ప్రశ్నించారు. ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహించారంటూ స్పెషలాఫీసర్ ఎ.రేవతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా ప్రత్యేకాధికారి తమను బాగా చూడడం లేదని, కాస్మొటిక్స్ ఇవ్వలేదని, మెనూ సరిగా అమలు చేయడం లేదని 9వ తరగతి విద్యార్థిని కె.అనీలతో పాటు పలువురు విద్యార్థినులు పీవోకు పిర్యాదు చేశారు. ప్రత్యేకాధికారితో చాలా ఇబ్బందులు పడుతున్నామని ఉపాద్యాయినులు కూడా పీవో దృష్టికి తెచ్చారు. ఎంపీడీవో గార రవణమ్మ, ఈఈ శ్రీనివాస్, ఏటీడబ్ల్యూవో కె.ఎర్రన్నాయుడు, నోడల్ ప్రిన్సిపాల్ ఎ.అచ్చెప్ప, ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు కేజీబీవీని సందర్శించారు. ప్రత్యేకాధికారిపై వేటు విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై సీతంపేట కేజీబీవీ ప్రత్యేకాధికారి ఎ.రేవతిపై వేటు పడింది. ఈ విద్యాలయంలో కలుషితాహారం తిని 20 మంది విద్యార్థినులు అస్వస్థులు కావడం, ప్రత్యేకాధికారిపై విద్యార్థినులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆమెకు స్థానచలనం కలిగిస్తూ ఐటీడీఏ పీవో ఉత్తర్వులు జారీ చేశారని గిరిజన సంక్షేమశాఖ డీడీ ఎంపీవీ నాయక్ తెలిపారు. ఆమె స్థానంలో మినీ గురుకులం ఇన్చార్జి బి.విజయలక్ష్మికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. రేవతిని మినీ గురుకులంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయినిగా బదిలీ చేస్తున్నట్టు తెలిపారు.