breaking news
KG Reddy Engineering College
-
అనాథల కోసం నిత్యం పిడికెడు బియ్యం సేకరణ
సాక్షి, చేవెళ్ల: అనాథ పిల్లలకు అన్నం పెట్టి కడుపు నింపాలనే గొప్ప ఆశయంతో ఆ విద్యార్థులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిత్యం అందరూ పిడికెడు బియ్యం తీసుకొచ్చి జమ చేశారు. పదిరోజుల్లో 500 కిలోలు జమ కావడంతో అనాథ ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు. వివరాలు.. మండల పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో ఉన్న కేజీరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలోని ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనతో అనాథ పిల్లలకు తమవంతు సహకారం అందించాలని ఆలోచించారు. ఎవరూ లేని చిన్నారులకు అన్నం పెట్టి కడుపు నింపాలని భావించారు. అందుకోసం బియ్యం సేకరణకు శ్రీకారం చుట్టారు. పది రోజులపాటు ఒక్కో విద్యార్థి పిడికెడు చొప్పున బియ్యాన్ని తీసుకొచ్చి జమచేశారు. గురువారానికి 500 కేజీల బియ్యం కావడంతో వాటిని అనాథ ఆశ్రమాలు నడుపుతున్న నాలుగు సంస్థలకు అందజేశారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. -
అవి.. హ్యాపీడేస్
- ఉత్సాహంగా ‘టాలెంటైన్-2015 టెక్నోఫెస్ట్’ - కాలేజీ రోజులను గుర్తు చేసుకున్న సినీనటుడు అల్లరి నరేష్ మొయినాబాద్: ప్రతి ఒక్కరి జీవితంలో కాలేజీ రోజులు ఎంతో మధురమైనవని ప్రముఖ సినీ నటుడు అల్లరి నరేష్ అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో ఉన్న కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న ‘టాలెంటైన్-2015 టెక్నోఫెస్ట్’ శుక్రవారం మూడోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అల్లరి నరేష్ విద్యార్థులను చూసి తన కళాశాల రోజులను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. విద్యార్థి దశలో చిలిపి చేష్టలు చేయడం సహజమే అయినప్పటికీ భవిష్యత్‌కు బాటలు వేసేది సైతం ఇదే దశ అన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు. ప్రముఖ గాయని లిప్సిక పాడిన పాటలు విద్యార్థులచే ఉత్సాహంగా కేరింతలు కొట్టించాయి. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం అనాథ విద్యార్థులకు అల్లరి నరేష్ చేతులమీదుగా బ్యాగులు పంపిణీ చేసింది. క్రీడాపోటీలు, సాంస్కృతిక పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కార్గో కంపెనీ డెరైక్టర్ కమల్‌జైన్, ఒలింపియన్ విజేత పవన్, కళాశాల చైర్మన్ కృష్ణారెడ్డి, ప్రిన్సిపాల్ మధుసూదన్‌నాయర్, అధ్యాపకులు సౌజన్య, ప్రసన్న, ఏఓ రవికిరణ్, ప్లేస్మెంట్ ఆఫీసర్ మురళీకృష్ణ, కోఆర్డినేటర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.