breaking news
kavi samrat viswanatha satyanarayana
-
కవి సమ్రాట్ మూవీ రివ్యూ
టైటిల్ : కవిసమ్రాట్ దర్శకత్వం: సవిత్ సి చంద్ర నిర్మాత : ఎల్. బి. శ్రీరామ్ సంగీతం: జోశ్యభట్ల కవి సమ్రాట్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్..ఎన్నో అవార్డులు, మరెన్నో సత్కారాలు, సన్మానాలు.. ఇవన్నీ విశ్వనాథ సత్యనారాయణకు విశేషణాలు, అలంకారాలు, అభినందన మాలలు. వాస్తవానికి విశ్వనాథ సత్యనారాయణ భారతరత్న కంటె ఎక్కువే. మేరు నగధీరుడు. ఆయన... అల నన్నయకు లేదు తిక్కనకు లేదా భోగము.. అన్న ధిషణాహంకారి.ఆ ధిషణ ఆయనకు అలంకారం. ఆ అహంకారం ఆయనకు ఆభరణం.కవన్నాక.. కాదు కాదు కవిసమ్రాట్ అన్నాక ఆ మాత్రం ఆత్మగౌరవం ఉండాల్సిందే. అదే చూపారు కవిసమ్రాట్ సినిమాలో దర్శకులు సవిత్ సి. చంద్ర.ఈ యువకుడి వయసు రెండున్నర పదులు. చదివింది ఇంజనీరింగ్. అసలు విశ్వనాథ సత్యనారాయణను అర్థం చేసుకోగలిగే వయసు కాదు.కాని... ఆయనను తనలోకి ఆవహింపచేసుకున్నాడు ఈ యువ దర్శకుడు.తాతగారయిన డా. చివుకుల సుందరరామశర్మ గారి నుంచి వారసత్వంగా తెలుగు సాహిత్యం వచ్చి ఉండొచ్చు. ఈ చిత్రంలో మూసధోరణిలో ఆయన ఎక్కడ ఎప్పుడు పుట్టారు, బాల్యం విద్యాభ్యాసం వంటి అంశాలు కనిపించవు. ఆయన ధిషణ మాత్రమే మనకు చూపాడు దర్శకుడు.ఏది ఏమైనా యువతరం తలచుకుంటే సాధించలేనిది, చేసి చూపించలేనిది లేదని నిరూపించాడు దర్శకుడు సవిత్ సి. చంద్ర.ఇందులో ఎల్. బి. శ్రీరామ్ ను చూస్తుంటే సాక్షాత్తు విశ్వనాథ సత్యనారాయణ కళ్ల ముందు కదలాడారు. పాత్రలోకి ప్రవేశించి, ఎక్కడా ఎల్. బి. శ్రీరామ్ అనే నటుడు కనపడకుండా సహజంగా నటించారు. విశ్వనాథ సత్యనారాయణ సోదరుడి పాత్రలో అనంత్, తండ్రిగా ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి ఎంతో చక్కగా నటించారు. ఒక తెలుగు సాహితీవేత్తను వెండి తెర మీద చూపి తెలుగు కవి ఔన్నత్యానికి వన్నె తెచ్చి, తెలుగు ఖ్యాతిని సినీ లోకానికి పరిచయం చేసిన ఈ యువదర్శకుడి తెలుగు భాషాభిమానానిని మెచ్చుకోవాలి. విశ్వనాథ సత్యనారాయణ చెప్పినట్లుగా నన్నయ, తిక్కనల మీద కాకుండా ఆయన మీదే ఒక చిత్రం రావటం కూడా ఆయన దార్శనికత కనిపిస్తుంది.విశ్వనాథ సత్యనారాయణను ఒక తెలుగు హీరోగా చిత్రీకరించాడు దర్శకుడు.ఈ చిత్రాన్ని ఆదరించి, తెలుగు జ్ఞానపీఠాన్ని ఈ తరానికి చేరువ చేయడం తెలుగు ప్రేక్షకుల బాధ్యత.ఈ చిత్రంలో పద్మనాభం పాత్రలో నటించిన శ్రీఅన్వేష్ వెండితెరకు మరో మంచి కొత్త కమెడియన్, విలన్గా అందరినీ ఆకర్షిస్తాడు. జోశ్యభట్ల చేసిన సంగీతం ఈ చిత్రాన్ని ఆ రోజుల్లోకి తీసుకువెళ్తుంది. ఇదొక ఫీల్ గుడ్ సినిమా. -
ఉరి
క్లాసిక్ కథ నాకు మీరు ఉరిశిక్ష వేశారు. నన్ను చెప్పుకునేది చెప్పుకోమన్నారు శిక్ష వేయకముందు చెప్పుకోమంటే అర్థం ఉండేది. ఇప్పుడు చెప్పుకొన్నా ఒకటే చెప్పుకొనకపోయినా ఒకటే. కాని మీరిప్పుడు చెప్పుకోమనటంలో ఒక విశేషం ఉంది. ఎట్లాగూ చస్తున్నాడు కదా! చచ్చింతర్వాత మాట్లాడేది లేదు, పెట్టేది లేదు, ఆ మాట్లాడేది కాస్తా యిప్పుడే మాట్లాడమని. మనుష్యుడై జన్మ యెత్తిన తర్వాత మాట్లాడటంలో కొంత లౌకికమైన సంతోషం ఉంటుంది. అది మాయాపి హితులైన మానవులకు సహజ లక్షణం. మీకు నా శరీరం మీద ప్రేమలేదు. నా ఆత్మ మీద ప్రేమ. నా ఆత్మ మీ ఆత్మలు అందరివి ఒకటే గనుక, అయినా కాకపోయినా మీరనుకొంటున్నారు గనుక యిది ఒక మామూలు. ఇప్పుడు నేను మాట్లాడకపోతే నష్టం లేదు, మాట్లాడితే వచ్చే లాభం లేదు. కాని నేను మాట్లాడితే లాభం ఉంటుందని కొందరనుకొంటారు. వాళ్ల ఉద్దేశంలో మాట్లాడవలసిందే. ఏమైనా సరే మాట్లాడవలసిందే. బ్రతికియున్నంత వరకు ప్రయత్నం చేయవలసిందే. బ్రతికి ఉన్నంత మంది ప్రయత్నం చేయవలసిందే. వాళ్లు మీ కన్న మాయాపిహితులు. నేను మనిషిని చంపానని మీరు నాకు ఉరిశిక్ష వేశారు. ఆ చంపానన్నది నాకు తెలియదు. మీకూ తెలియదు. చంపానని సాక్ష్యం యిచ్చినవాళ్లకీ తెలియదు, నాకు తల్లీ పెళ్లాం బిడ్డలు ఉన్నారు. వాళ్లను పోషించలేక నేను చాలా బాధపడ్డా. వాళ్లకు తిండిలేదు, నాకూ తిండిలేదు. మీ దయవల్ల రెండు నెలల నుండి ఖైదులో కూర్చొని అన్నం మాత్రం తిన్నాను. ఈ రెండు నెలలు వాళ్లేమైనారో నాకు తెలియదు. ఈపాటికి వాళ్లూ చచ్చే ఉంటారు. వాళ్లకన్న నేనే అదృష్టవంతుణ్ని. వాళ్లు చావకముందు మాడిమాడి చచ్చి ఉంటారు, నేను చచ్చేముందు ఏదో యింత అన్నం తినే చస్తున్నా. నేను ఉద్యోగం చేయలేదు. కూలీ నాలీ కుదురలేదు, మోసం చేయలేను. ఎక్కడో నాల్గురాళ్లు సంపాదిస్తే దాంతో బియ్యం కొనుక్కుందామంటే బియ్యం దొరకలేదు. అదివరకు నాల్గురోజులు ఇంటిల్లి పాదీ పస్తున్నాం. నేను నా భార్య ఎల్లాగో అల్లాగా తమాయించుకొన్నాం. పిల్లలు బక్కనరాలై కూర్చున్న చోటునించి లేవలేక యేడ్చేశక్తిగూడా లేక బ్రతికి ఉన్న శవాలల్లే పడి ఉంటే చూడటం యెలాగా? బియ్యం అమ్మే దుకాణం పెద్దపులల్లే ఇరవై గజాలతోక పెంచుకొని ఆ తోకచివ్వర నేను. నాలుగు రోజులు ఈ తోక చివరితనం పొందలేక పొందలేక విసిగి చివరికి యింటికి వచ్చాను. ఒక ముసలిది నామీద దయపుట్టి తనకు వచ్చిన బియ్యంలో సగం నాకు రెట్టింపు ధరకు అమ్మింది. ఆ బియ్యం తీసుకొని వచ్చి వండి పిల్లలకు పెడ్దామంటే అవి గొడ్లు తినాలిగాని మనుష్యులు తినరు. నాలుగు పోట్లు వేసి చెరిగేతేనే గాని వండటానికి పనికిరావు. దంచాలి అంటే నాలుగురోజులు తిండిలేని మా యింటిదానికీ ఓపికలేదు, నాకూ లేదు. అయినా పిల్లల స్థితి చూడలేక మా యింటిది ఆ బియ్యం చిరిగిన చీర కొంగున కట్టుకొని పది కొంపలు తిరిగింది. ఒకళ్లు విసిరికొట్టారు, మరి ఒకళ్లు - వాళ్ల యింట్లో నోమట. అట్లకోసం పిండి దంచుకొంటున్నారు. అన్ని యిళ్లూ ఇట్లాగే అయినవి. చివరికా బియ్యమే పొయ్యి రాళ్లమీద పెట్టింది మా యింటిది, పొయ్యి క్రింద మంట లేదు. ఒకాయన దొడ్డి చుట్టూ కంచె వేశాడు. ఆ కంచెను గాడిదలూ, కుక్కలూ, పందులూ విరగ తొక్కినవి. కంచెపుల్లలు ఇటు అటు పడి ఉన్నవి, అవి యెవరికీ పనికిరావు. అవి నేను ఏరితెస్తూంటే ఒకాయన ‘‘ఎవడి అమ్మా మొగుడి సొమ్మనుకొన్నావు’’ అనివచ్చి నన్ను కర్రతో విరగకొట్టాడు. ఇంటికి వచ్చాను, ఇల్లంటే నవ్వు వస్తోంది. ఎవరిదో పడిపోయిన గోడ ఉంటే ఆ స్థలంలో యెవళ్లూ కాపురానికి లేరు. ఆ గోడక్రింద ఉంటున్నాం, అదేయిల్లు, పైన పుల్లాపుడకా పెట్టి తలలు మాత్రం దానిక్రింద పెట్టి నిద్రపోయేటట్లుగా మా యింటికి ఆధారం చేసింది. నేను వెళ్లేటప్పటికి ఆ ఆధారం తీసి దానితో మంట వేస్తోంది. ఈ ఆధారం ఎక్కువా? పిల్లల కడుపు మంట యెక్కువా? మరునాడు మా పిల్లల స్థితి చూడ కడుపులో నొప్పితో మెలి తిరిగిపోయినారు. నాలుగు వాము పరకలు తెద్దామంటే చేతిలో ఉన్న నాలుగణాలు నిన్నటి ముసలమ్మే కాజేసింది. మళ్లీ తర్వాత నాలుగురోజుల వరకు బియ్యం లేవు, పిల్లల కడుపునొప్పులూ తగ్గలేదు. మా యింటిది లేవనే లేకపోయింది. నేనట్టాగే తిరుగుతున్నాను. ఆ రోజున మధ్యాహ్నం జనం గుంపులుగా వెళుతున్నారు. నేను వాళ్లెక్కడికి వెళుతున్నారని అడిగాను. అందరికీ బియ్యం ఇస్తారట అని చెప్పారు. నేను వాళ్ల వెంట వెళ్లాను, వాళ్లు వందా రెండువందలమంది ఉన్నారు. జనం ఒకచోటికి వెళ్లారు. జనం కేకలూ బొబ్బలూ నానా హంగామా ఉంది. ఒక యింటి దగ్గర ఆగారు. ముందర యేమి జరుగుతోందో నాకు తెలియదు. నేను వెనక ఉన్నాను. బియ్యం కోసం త్రొక్కిళ్లాడుతున్నారనుకొన్నాను. చుట్టుప్రక్కల యిళ్లవాళ్లందరూ కొందరు, తలుపులు వేసికొన్న వాళ్లు కొందరు తొంగిచూచేవాళ్లుగా కన్పించారు. కొంతసేపటికి రక్షకభటులు వచ్చారు. నేననుకొన్నాగదా ‘అమ్మయ్యా వీళ్లువచ్చారుగదా అందరికీ సరిగ్గా పంచిపెట్టిస్తారు’ అని. క్రమక్రమంగా నాకు తెలిసింది ఈ గుంపుకీ ఆ రక్షకభటులకీ దెబ్బలాట జరుగుతోందని. ఇంతలో రక్షకభటులు తుపాకులు కాల్చారు. ఈ గుంపులోంచి రక్షకభటుల మీద రాళ్లు విసురుతున్నారు. వ్యవహారం యెప్పుడైతే ముదిరిందో నాకెందుకురా బాబూ ఇది పోదామనుకొన్నాను. కాని పోవటమెట్లా? ఆట వరకు నెల్లాళ్లబట్టి తిండి లేదు. వారానికొకసారి యేదో తినీతిననట్టు తిన్నా నా ఒంట్లో ఓపిక లేదు. మనిషిని మరీ అబ్బనా కొరివి రాదు గనుక మనుష్యాకృతిలో లోపం లేదు. రక్షకభటులలో కొందరికి దెబ్బలు తగిలినవి. ఒకడు రాయి కణతకు తగిలి చచ్చాడు, ఆ రాయి ఆ చుట్టుప్రక్కలవాడెవడు విసిరాడో నాకు తెలియదు. పైగా చంపడంలో యిన్ని భేదాలేమిటి? రాయి తగిలితే చచ్చి, తుపాకీ గుండు తగిలితే బ్రతుకుతాడా? తుపాకీ గుండు తగిలిస్తే శిక్ష లేదూ! రాయి తగిలి చస్తే శిక్ష? ఆ కళ్లులేని దేవుడు ఆ రాయి నేనే విసిరానన్నాడు. రాయి విసరటం మాట అట్లా ఉంచండి. నేను చేయి యెత్తగలిగితే చాలు! ఆ స్థితిలో ఉన్నాను. రక్షకభటులు తరిమారు. అందరూ పారిపోతున్నారు. నేనూ పారిపోతున్నాను. పరిగెత్తేందుకు నాకు ఓపిక యేది? వెనక నుంచి నా నెత్తిమీద పెద్ద దెబ్బపడ్డట్టుగా మాత్రమే నాకు తెలుసు. ఒక రాత్రివేళ నాకు మెలకువ వచ్చింది. గాఢాంధకారంలో కూర్చొని ఉన్నా, మరునాటి ప్రొద్దుటికి తెలిసింది నాకు అది ఖైదని. ఒకటి రెండు పూటలైన తర్వాత నాకన్నం పెట్టారు. అన్నం చూస్తే నా ప్రాణాలు లేచి వచ్చినవి. వెంటనే పిల్లలు జ్ఞాపకం వచ్చారు. వాళ్లకు పెడదామని అన్నం అట్టే పెట్టాను. మరునాటికి తెలిసింది యింక వాళ్లు నా దగ్గరకు రారని. వాళ్లేమైనారో! ఏమైనారో యెవడికి కావాలి? పూటపూటా అన్నం తినటం నాకూ అలవాటైంది. నా పని రాజభోగంగా ఉంది. రెండు పూటలా తిండి. ఎక్కడికైనా తీసుకొనివెళితే మోటారు కారులో తీసుకొనివెళ్లారు. పెద్దకోర్టుల్లో కూడ నా కోసం ఒక ప్రత్యేక స్థానం చివరి రోజుల్లో నాకు దశయెత్తుకొంది. ఆ పాడుదేవుడు ఈ మాత్రంగా ఆ వెనుక కూడా సాగిస్తే యెంతబాగుండేది. ఇంతకన్న యేమిచెప్పను? నాకు ఇంత ఉపకారం చేసిన మీరు వెయ్యేళ్లు బ్రతకండి. బ్రతుకంతా తిండిలేక చచ్చిన నాకు రెండు నెలలు సుఖంగా తిండిపెట్టారు. మీ కడుపులు చల్లగా ఉండాలి. కాని నా యింటిదీ, పిల్లలు ఏమైనారో తెలియలేదు, నాకు ఒక్కటే చింతగా ఉంది - నా పిల్లలు కొంచెం పెద్దవాళ్లు అయితే, ఎలాగోలాగా పెద్దవాళ్లు అయితే చివరిరోజుల్లో వాళ్లకుగూడా నాకు పట్టిన యోగం పడుతుందా అని. అదంతా మీ దయ, వాళ్లని వెదికించి యీ ఉపకారం చేయిస్తే మీ కడుపున పుడ్తాను. చివరికా బియ్యమే రాళ్ల పొయ్యి మీద పెట్టింది మా యింటిది, పొయ్యి కింద మంట లేదు. ఒకాయన దొడ్డి చుట్టూ కంచె వేశాడు. ఆ కంచెను గాడిదలూ, కుక్కలూ, పందులూ విరగ తొక్కినవి. కంచె పుల్లలు ఇటు అటు పడి ఉన్నవి, అవి యెవరికీ పనికిరావు. అవి నేను ఏరి తెస్తూంటే ఒకాయన ‘‘ఎవడి అమ్మ మొగుడి సొమ్మనుకొన్నావు’’ అని వచ్చి నన్ను కర్రతో విరగకొట్టాడు. - కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ