breaking news
Kanneganti Hanumanthu
-
జైహింద్ స్పెషల్: వీళ్లంతటివాడు పుల్లరి హనుమంతుడు
నారు పోశావా? నీరు పెట్టావా? కోత కోశావా? ఎందుకు కట్టాలిరా శిస్తు!.. అంటూ నిలదీసిన ఆ గొంతు పల్నాటి ప్రజల్లో పరపాలనకు వ్యతిరేకంగా ఉద్యమస్ఫూర్తిని నింపింది. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి సాధారణ రైతు జీవితం గడుపుతున్న ఆ శక్తి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. ఆ స్ఫూర్తి, ఆ శక్తే.. పల్నాడు పుల్లరి ఉద్యమానికి వెన్నుముకగా నిలిచిన కన్నెగంటి హనుమంతు! చదవండి: జైహింద్ స్పెషల్: ఈస్టిండియా కుటిల వ్యూహం దేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం జోరుగా సాగుతున్న తరుణంలోనే పల్నాడులో పుల్లరి సత్యాగ్రహం ఊపందుకుంది. పుల్లరి అంటే పచ్చిక మైదానాలపై విధించే పన్ను. అడవుల్లో కట్టెలు కొట్టాలన్నా, మైదానాల్లో పశువుల్ని మేపాలన్నా శిస్తు కట్టాల్సిందేనన్న బ్రిటిష్ ఆజ్ఞలను ధిక్కరిస్తూ సత్యాగ్రహ స్ఫూర్తి పల్నాడు మొత్తం వ్యాపించింది. ఈ ఉద్యమ కాలంలో హనుమంతును పలుమార్లు బ్రిటిష్ పాలకులు అరెస్టు చేశారు. సత్యాగ్రహ కొనసాగింపుగా నల్లమల ప్రాంత చెంచులతో కలిసి హనుమంతు పోరుబాట పట్టారు. 1921–22 కాలంలో హనుమంతు పేరు వింటే పల్నాడులో బ్రిటిష్ అధికారులకు ముచ్చెమటలు పట్టేవంటే అతిశయోక్తి కాదు. కన్నెగంటి హనుమంతు కోర మీసము దువ్వి.. పలనాటి ప్రజలచే పన్నులెగ గొట్టించె అని కవులు ఆయన పోరాటాన్ని గానం చేశారు. అసామాన్య యోధుడు గుంటూరు జిల్లా దుర్గి మండలం పరిధిలోని మించాలపాడు గ్రామంలో వెంకటప్పయ్య, అచ్చమ్మ దంపతులకు పుట్టిన అసామాన్య స్వాతంత్య్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతు. పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, వెల్దుర్తి, జట్టిపాలెం, రెంటచింతల వంటి ప్రాంతాల్లో ప్రజాజీవనం ఆ ప్రాంతపు అడవులతో ముడిపడి ఉంది. 1921 సంవత్సరం ప్రాంతంలో పల్నాడులో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. పరాయి పాలనలో సామాన్య ప్రజలకు కూడు, గుడ్డ వంటి కనీసావసరాల మాట దేవుడెరుగు కనీసం పశువులకు గ్రాసం, గ్రామ జీవితంలో భాగమైన కట్టెలు కొట్టుకోవడం, ఆకూ అలమూ పోగుచేసుకోవడం వంటి వాటికి సైతం బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలపై ఆంక్షలు విధించింది. పశువుకు రెండు రూపాయలు శిస్తుగా పుల్లరి కట్టాలని ఆదేశించారు. ఈ అమానుషంపై ప్రజలను సంఘటితపరచి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి నాయకత్వం వహించాడు కన్నెగంటి. ప్రభుత్వానికి ప్రజలు పుల్లరి చెల్లించరాదనే ఉద్యమాన్ని లేవదీశాడు. దీంతో పల్నాడులో ప్రజలు పుల్లరి కట్టడం మానేయడంతో పాటు అటవీ అధికారులను, రెవెన్యూ అధికారులనూ సాంఘిక బహిష్కారానికి గురిచేశారు. మిణుగురులు లేచె బెడదవు శౌర్యాగ్నిశిఖలు మాంచాలపురిన్ హనుమంతుడన వీరుడు.. తెల్ల దొరల నేదిరించెన్... అని గుర్రం జాషువా కన్నెగంటి హనుమంతు పోరాటాన్ని ప్రశంసించారు. పాలకుల కుయుక్తులు దావానలంలాగా రేగుతున్న ఉద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనేక కుట్రలు పన్నింది. తొలుత హనుమంతుకు లంచమిచ్చి తమవైపు తిప్పుకోవాలని నాటి బ్రిటిష్ అధికారి రూథర్‌ఫర్డ్ కుయుక్తి పన్నాడు. స్థానిక కరణం ద్వారా హనుమంతుకు వర్తమానం పంపాడు. దుర్గి ఫిర్కాకు కన్నెగంటిని జమిందార్ గా చేస్తామన్నారు. ఇష్టం వచ్చినంత శిస్తు వసూలు చేసుకోవచ్చని ఆశ పెట్టారు. కానీ నిష్కళంక దేశభక్తుడైన కన్నెగంటి తాను తార్పుడు గాడిని కాననీ, నా తోటి భారతీయులను వంచించి నెత్తుటి కూడు తిననని తెగేసి చెప్పాడు. దీంతో ఇక దండోపాయమే శరణ్యమని భావించిన రూథర్‌ఫర్డ్ ఆమేరకు గుంటూరు కలెక్టర్ వార్నర్‌కు ఆదేశాలిచ్చాడు. బలి ఇచ్చె హనుమంతు నూ పలనాడు! పర ప్రభుత్వము గుండ్లకు ! అని పులపుల శివయ్య కవి గానం చేసిన రీతిలో స్థానికులే నమ్మకద్రోహం చేసి హనుమంతు మరణానికి కారణమయ్యారు. 1922 ఫిబ్రవరి 22 శివరాత్రి రోజున కొందరు అటవీ, రెవిన్యూ శాఖలకు చెందిన అధికారులు మించాలపాడు గ్రామానికి వచ్చి హనుమంతును కలిసి పుల్లరి కట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించారు. ఆప్పటికే గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని విరమిస్తూ నిర్ణయం తీసుకొని వున్నారు కనుక పుల్లరి చెల్లించడానికి అభ్యంతరం లేదని కన్నెగంటి చెప్పారు. పోరాటాన్ని తర్వాత వేరే రూపాల్లో కొనసాగించాలని ఆయన భావించారు. పల్నాటి కాళరాత్రి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మించాలపాడుతో సహా చుట్టు పక్కల గ్రామాలలోని యువకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కన్నెగంటి అనుచరులు, అభిమానులు కాంగ్రెస్ ప్రభతో కలసి వెళ్ళారు. గ్రామాల్లో మహిళలు, పెద్దలు మాత్రమే ఉన్నారు. అదే అదనుగా భావించిన గుంటూరు జిల్లా కలెక్టర్ వార్నరు దుర్గి సబ్ ఇన్స్పెక్టర్ రాఘవయ్య నాయుడికి తోడుగా మరికొంత మంది సైన్యాన్ని ఇచ్చాడు. పుల్లరి కట్టని మించాలపాడు గ్రామస్తుల పశువులను నిర్బంధించవలసిందిగా ఆదేశించాడు. అంతే.. బ్రిటిష్ సైన్యం మించాలపాడు గ్రామంపై విరుచుకుపడింది. పశువుల్ని నిర్బంధించడం మొదలు పెట్టింది. పుల్లరి చెల్లిస్తామని తాము చెప్పినా బ్రిటిషర్లు దొంగదెబ్బ తీయడాన్ని హనుమంతు సహించలేకపోయారు. ఆయన ఆధ్వర్యంలో గ్రామస్తులంతా ఎదురుదాడికి దిగారు. శిస్తు కడతామని అధికారులతో చెప్పేందుకు వెళ్లిన కన్నెగంటిని స్థానిక కరణం గుర్తించి బ్రిటిషర్లకు తెలియజేశాడు. దీంతో సైనికులు ఆయనపై కాల్పులు జరపడంతో 26 తూటాలు హనుమంతు శరీరంలోకి దూసుకుపోయాయి. ఆయనతో పాటు మరో ఇద్దరిని సైనికులు పొట్టనబెట్టు కున్నారు. సాయంకాలం 6 గంటలకు తుపాకి తూటాలకు గాయపడిన పల్నాడు సింహం కన్నెగంటి అర్థరాత్రి వరకు శక్తి కూడదీసుకొని వందేమాతరం అని నినాదాలు చేస్తూనే ఉన్నాడు. అర్థరాత్రి దాటాక పల్నాటి వీరబిడ్డడు అమరుడయ్యాడు. పల్నాటి పుల్లరి సత్యాగ్రహంలో వీరమరణం పొందిన కన్నెగంటి త్యాగాన్ని జాతీయ కాంగ్రెస్ సంఘం గుర్తించింది. బ్రిటిష్ అధికారుల పట్ల పల్నాటి ప్రజలు అనుసరించిన సాంఘిక బహిష్కరణ విధానం తక్కిన దేశానికంతటికీ దారిచూపింది. హనుమంతు త్యాగనిరతిని శ్లాఘిస్తూ మించాలపాడు గ్రామ ప్రజలు అతని సమాధిపై ఏర్పాటు చేసిన శిలాశాసనం నేటికీ ఆ వీరుని పోరాట స్ఫూర్తికి చిహ్నంగా నిలిచి వుంది. – దుర్గరాజు శాయి ప్రమోద్ -
అబ్బురం కన్నెగంటి సమరం
‘కన్నెగంటి హనుమంతు వెన్నులోని బాకూ వెన్నుతట్టి నడవమంది కడ విజయం వరకూ’ అల్లూరి సీతారామరాజు చిత్రంలోని ప్రారంభ గీతంలోని ఓ చరణం ఇది. ఎంతో మంది విప్లవకారులను స్వాతంత్య్రోద్య మంలో వెన్నుతట్టి నడిపిన స్ఫూర్తి కన్నెగంటి హనుమంతు. శరీరంలోకి 24 గుండ్లు దూసుకెళ్లిన తరువాత కూడా సుమారు రెండు గంటలపాటు మాతృమూర్తి దాస్య శృంఖలాలను తెంచ డానికి బ్రిటిష్ సైన్యంతో పోరాడిన ధీరుడు కన్నెగంటి హను మంతు. సుమారు ఓ దశాబ్దంన్నర క్రితం పుల్లరి (పన్ను) చెల్లింపు నకు వ్యతిరేకించే నేపథ్యంలో వచ్చిన స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రదాయక చిత్రం ‘లగాన్’కు భారతీయులు హృదయాల్ని అర్పిం చారు. అదంతా వారి నరనరాల్లో జీర్ణించుకుపోయిన దేశభక్తి మరో సారి వెల్లువలా పెల్లుబికిన వైనం. అలాంటి స్ఫూర్తికి ప్రతీకగా నిలి చిన ఓ తెలుగు వాడు కన్నెగంటి హనుమంతు. పుల్లరి చెల్లింపును ధిక్కరిస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన నాయకుడు. కన్నెగంటి హనుమంతుకి జన్మనిచ్చింది మించాలపాడు అనే ఓ కుగ్రామం. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని దుర్గికి సమీపంలోని కోలెకుట్ట శివారు ప్రాంతమే మించాలపాడు. అది 1920వ సంవత్సరం ప్రాంతం. దేశమంతా గాంధీగారి పిలుపుతో సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొంటోంది. 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలోని నాయకుల పిలు పునందుకొని ఆంధ్రదేశం కూడా సహాయ నిరాకరణోద్యమంలోకి దూకింది. సహాయ నిరాకరణోద్యమంలో పన్నుల నిరాకరణ ఓ భాగం. గుంటూరు జిల్లాలో ఉన్నవ లక్ష్మీనారాయణగారు దీనికి నాయకులు. పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, వెల్దుర్తి, జట్టిపాలెం, రెంటచింతల వంటి ప్రాంతాల్లో ప్రజాజీవనం ఆ ప్రాంతపు అడవులతో ముడిపడి ఉంది. 1921 సంవత్సరం ప్రాంతంలో పల్నాడులో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. పరాయి పాలనలో సామాన్య ప్రజలకు కూడు, గుడ్డ వంటి కనీసావసరాల మాట దేవుడెరుగు కనీసం పశువులకు గ్రాసం, గ్రామ జీవి తంలో భాగమైన కట్టెలు కొట్టుకోవడం, ఆకూ అలమూ పోగుచేసుకోవడం వంటి వాటికి సైతం బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలపై ఆంక్షలు విధించింది. అడవిలో పశువుల్ని మేపుకోవడానికీ, కట్టెలు కొట్టుకోవడానికీ ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వానికి పుల్లరి చెల్లించాలనే నిబంధన విధిం చింది. దరిమిలా ప్రభుత్వాధికారులు మేతకు వచ్చిన పశువుల్ని బందెలదొడ్డికి తోలడం, ప్రజలు వాటిని విడిపించు కోవడానికి నానా అవస్థలూ పడటం పరిపాటి అయింది. ఈ క్రమంలో ప్రజలను సంఘటిత పరచి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి నాయకత్వం వహించాడు కన్నెగంటి. ప్రభుత్వానికి ప్రజలు పుల్లరి చెల్లించరాదనే ఉద్యమాన్ని లేవదీశాడు. ప్రజలు పుల్లరి కట్టడం మానేశారు. పెపైచ్చు ప్రజలు కన్నెగంటి నాయకత్వంలో అటవీ అధికారులను, రెవెన్యూ అధికారులనూ సాంఘిక బహిష్కారానికి గురిచేశారు. దీన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర పన్నింది. అది 1922వ సంవత్సరం, ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం. అమావాస్య మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలు. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఓ దుర్దినం. మరో బ్రిటిష్ దౌష్ట్యం రూపుదిద్దుకోబోతున్న వేళ. గుంటూరు జిల్లా కలెక్టర్ వార్నరు పల్నాడు గ్రామం చేరుకున్నాడు. దుర్గి సబ్ ఇన్స్పెక్టర్ రాఘవయ్య నాయుడిని పిలిచాడు. అతనికి తోడు మరికొంత మంది సైన్యాన్ని ఇచ్చాడు. పుల్లరి కట్టని మించాలపాడు గ్రామస్తుల పశువులను నిర్బంధించవలసిందిగా ఆదేశించాడు. అంతే.. బ్రిటిష్ సైన్యం మించాలపాడు గ్రామంపై విరుచుకు పడింది. పశువుల్ని నిర్బంధించడం మొదలు పెట్టింది. కన్నెగంటి నాయకత్వంలో గ్రామస్తులంతా తిరగబడ్డారు. సుమారు రెండు నుంచి మూడు వందల మంది గ్రామీణ స్త్రీలు, పురుషులు ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు. బ్రిటిష్ సైన్యం ప్రజలపై దమనకాండ జరిపింది. ఈ పోరాటంలో తుది వరకూ పోరాడిన కన్నెగంటి పోలీసుల తూటాలకు నేలకొరిగాడు. ఈ యోధుడితో పాటు మరో ఇద్దరు పోలీసులు ఆ దమనకాండలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. పల్నాటి పుల్లరి సత్యాగ్రహంలో వీరమరణం పొందిన కన్నెగంటి త్యాగాన్ని జాతీయ కాంగ్రెస్ సంఘం గుర్తించింది. బ్రిటిష్ అధికారుల పట్ల పల్నాటి ప్రజలు అనుసరించిన సాంఘిక బహిష్కరణ విధానం తక్కిన దేశానికంతటికీ దారిచూపింది. హనుమంతు త్యాగనిరతిని శ్లాఘిస్తూ మించాలపాడు గ్రామ ప్రజలు అతని సమాధిపై ఏర్పాటు చేసిన శిలాశాసనం నేటికీ ఆ వీరుని పోరాట స్ఫూర్తికి మౌన సాక్షిగా నిలుస్తుంది. (నేడు కన్నెగంటి హనుమంతు 92వ వర్ధంతి సందర్భంగా...) డా॥అడబాల అప్పారావు కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్. మొబైల్:9494868936