breaking news
Kagaznagar Town
-
కాగజ్‌నగర్‌లో వలస కార్మికుడి ఆత్మహత్య
కాగజ్‌నగర్‌టౌన్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లులో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న వలస కార్మికుడు గురువారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లా సోలాపూర్ తాలూకా ధాన్గంజ్ ప్రాంతానికి చెందిన వికాస్ చౌహాన్ (21), కొంతమంది అక్కడి యువకులతో కలిసి జనవరిలో గుజరాత్‌కు చెందిన అవినాష్ అనే కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో స్థానిక సిర్పూర్ పేపర్ మిల్లులో కాంట్రాక్టు కార్మికుడి (కూలి)గా చేరాడు. కాంట్రాక్టు కార్మికులకు మిల్లు యాజమాన్యం స్థానిక ఓల్డ్ కాలనీలోగల కంపెనీకి సంబంధించిన డి టైప్ క్వార్టర్ కేటాయించింది. అందులో వికాస్‌తోపాటు ఐదు గురు కార్మికులు నివాసముంటున్నారు. లాక్డౌన్ అమలుతో వీరంతా ఇక్కడే చిక్కుకున్నారు. మిల్లు యాజమాన్యం, కాంట్రాక్టర్ కార్మికులకు ఆహార సామగ్రి అందిస్తున్నా.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఉపాధి లేక 15 రోజులుగా వికాస్ చౌహాన్ సొంతూరుకు వెళ్లడానికి ప్రయత్నాలు చేశాడు. శ్రామిక్ రైలు ద్వారా వారణాసి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన క్వార్టర్‌లోనే గురువారం ఉరేసుకున్నాడు. తోటి కార్మికుడు పోలీసులకు సమాచారం అందించారు. వికాస్ చౌహాన్‌ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. వికాస్ చౌహాన్ మృతదేహం -
తల్లి గొంతు కోసిన కొడుకు
కాగజ్‌నగర్ టౌన్: మద్యం, గంజాయికి బానిసైన కొడుకు కసాయిగా మారి కన్నతల్లి గొంతుకోశాడు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాగజ్‌నగర్‌లోని సర్‌సిల్క్ కాలనీలో నివాసముంటున్న తాడూరి సంధ్యారాణి అంగన్వాడీ ఆయాగా పనిచేస్తోంది. సంధ్యారాణికి కుమారుడు, కూతురు ఉండగా భర్త నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. కొడుకు ప్రశాంత్ గత కొద్ది కాలంగా మద్యం, గంజాయికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. కాగా ప్రశాంత్ తనకు పెళ్లి చేయాలని, మద్యానికి డబ్బులు ఇవ్వాలని గత కొద్ది రోజులుగా తల్లిని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ప్రశాంత్ తల్లితో గొడవపడ్డాడు. కోపంతో ఉన్న ప్రశాంత్ గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో నిద్రిస్తున్న తల్లి సంధ్యారాణి గొంతును కత్తితో కోశాడు. దాంతో తీవ్ర గాయాలతో ఆమె కేకలు వేయడంతో ప్రశాంత్ అక్కడి నుంచి పారిపోయాడు. చుట్టుపక్కల వారు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడకు చేరుకుని సంధ్యారాణిని సిర్పూర్(టి) సామాజిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం సంధ్యారాణి ఉస్మానియాలో చికిత్స పొందుతుండగా, ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు ఎస్సై గంగన్న తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పట్టణ సీఐ తెలబోయిన కిరణ్ వెల్లడించారు. -
ట్రాన్స్‌కో ఏఈకి ఏసీబీ షాక్
కాగజ్‌నగర్‌టౌన్ : అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం కాగజ్‌నగర్ విద్యుత్ శాఖ (ట్రాన్స్‌కో) కార్యాలయంలో దాడులు నిర్వహించారు. విద్యుత్ కనెక్షన్ షిఫ్టింగ్ కోసం డిమాండ్ నోటిస్ ఇవ్వడానికి 20 వేల రూపాయలు లంచం తీసుకున్న రూరల్ ఇన్చార్జి ఏఈ వేణుగోపాల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ విలేకరులతో మాట్లాడారు. కాగజ్‌నగర్ మండలం రాస్పెల్లి గ్రామానికి చెందిన పెకర శ్రీకాంత్ తన మినీ రైస్ మిల్లును గ్రామ శివారులోకి మార్చే క్రమంలో విద్యుత్ కనెక్షన్ షిఫ్టింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రాస్పెల్లి మెయిన్ రోడ్డు వద్ద మినీ రైస్ మిల్లును ఏర్పాటు చేసి, త్రీఫేజ్ కరెంట్ షిఫ్టింగ్ కోసం ట్రాన్స్‌కో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో రూరల్ ఇన్చార్జి ఏఈ వేణుగోపాల్ షిఫ్టింగ్ కోసం ఇచ్చే డిమాండ్ నోటీస్ ఇవ్వడానికి మొదట 35 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని బాధితుడు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువచ్చాడు. పథకం ప్రకారం శనివారం కార్యాలయంలో రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని డీఎస్పీ సుదర్శన్ గౌడ్ పేర్కొన్నారు. నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ఏఈ వేణుగోపాల్ డీఈఈ ఒత్తిడి మేరకే తాను రూ.20 వేలు అడిగినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. షిఫ్టింగ్ చేయడానికి డీఈఈ డబ్బులు అడిగినందుకే తాను పెరక శ్రీకాంత్‌ను తీసుకుని కార్యాలయానికి రావాలని సూచించినట్లు వివరించాడు. ఇదిలా ఉండగా.. ఈ అంశంలో డీఈఈ పాత్రపైనా విచారణ చేపడుతామని డీఎస్పీ సుదర్శన్ గౌడ్ వెల్లడించారు. ఇన్చార్జి ఏఈ వేణుగోపాల్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ చెప్పారు. దాడిలో ఆదిలాబాద్ సీఐ సీహెచ్ వేణుగోపాల్, కరీంనగర్ సీఐ వీవీ రమణామూర్తితో పాటు సిబ్బంది వెంకటస్వామి, షేక్ జమీర్, వేణు తదితరులు పాల్గొన్నారు. లంచం అడిగితే నిర్భయంగా ఫిర్యాదు చేయండి.. - అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ సుదర్శన్ గౌడ్ కాగజ్‌నగర్ టౌన్ : జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో అవినితి పేరుకుపోయిందని, లంచం అడిగే అధికారులపై ప్రజలు నిర్భయంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ కరీంనగర్ రేంజి డీఎస్పీ సుదర్శన్ గౌడ్ సూచించారు. శనివారం కాగజ్‌నగర్ ట్రాన్స్‌కో కార్యాలయంలో దాడులు నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దశలవారీగా ఆయా శాఖల అధికారులపై నిఘా ఏర్పాటు చేసి వారి అక్రమాలకు చెక్ పెడుతామన్నారు. అనేక మండలాల్లో పహాని, పాస్ బుక్కులు, టైటిల్ బుక్కుల కోసం ఆయా తహశీల్దార్లు వీఆర్వోలపై డబ్బుల కోసం ఒత్తిడి తెస్తున్నారని, తద్వారా విలేజి రెవెన్యూ అధికారులు రైతుల నుంచి లంచం డిమాండ్ చేస్తున్నారని తమకు ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడే సిబ్బందితోపాటు డబ్బుల కోసం ఒత్తిడి చేసే అధికారిపైనా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. దళారులు ఎంతటివారైనా వారిపై కేసులు నమోదు చేసి, జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఏ ప్రభుత్వ శాఖలోనూ అవినీతి, అక్రమాలు జరిగినా బాధితులు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా నేరుగా జిల్లాలోని తమ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. సెల్ నెంబర్ 9440446150 (డీఎస్పీ), 9440446153 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఎస్ఎంఎస్ పంపినా ఫర్వాలేదని పేర్కొన్నారు. ఈ మెయిల్ చేయొచ్చని అన్నారు.