కడుపుకోత మిగిల్చిన క్షణికావేశం
క్షణికావేశంలో తల్లి తీసుకున్న నిర్ణయం ఇద్దరు చిన్నారులను బలిగొంది. అప్పటి వరకూ తల్లితో కలసి ఆడుకున్న చిన్నారులు.. కొద్ది క్షణాల్లోనే మృత్యు ఒడికి చేరారు. వారిని ఎత్తుకున్న తల్లి అమాంతం గోదావరిలోకి దూకగా, తల్లి ఆప్యాయంగా ఎత్తుకుందనుకున్నారు కానీ, తమను బలి చేసేందుకు మృత్యుదేవతగా మారిందని పనిగట్టలేకపోయారు వారు.
– రాజమహేంద్రవరం క్రైం/ కడియం/ ధవళేశ్వరం
వేమగిరి గ్రామానికి చెందిన పసువాదుల విజయలక్ష్మి తన ఇద్దరు పిల్లలతో గోదావరిలోకి దూకిన సంఘటనలో, చిన్నారులు మరణించగా.. జాలర్లు కాపాడడంతో ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ధవళేశ్వరం సీఐ ఆశీర్వాదం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వేమగిరికి చెందిన పసువాదుల విజయలక్ష్మికి సత్యసుబ్రహ్మణ్యం ఆచార్యులుతో వివాహమైంది. వీరికి పిల్లలు ఎల్కేజీ చదువుతున్న ఐదేళ్ల సత్చ్చంద్రాచార్యులు, నర్సరీ చదువుతున్న మూడేళ్ల శ్రీనిధి ఉన్నారు. ఆచార్యులు కోకోకోలా కంపెనీలో, విజయలక్ష్మి టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆచార్యులు బావ మరణించడంతో తన అక్క, ఆమె ఇద్దరు పిల్లలు, ఆచార్యులు తల్లిదండ్రులు కూడా వీరి వద్దే ఉంటున్నారు. దీంతో వేరే కాపురం పెడదామని విజయలక్ష్మి ఎప్పటి నుంచో భర్తను కోరుతోంది. అందుకు భర్త నిరాకరించడంతో, మనస్తాపం చెందిన విజయలక్ష్మి మంగళవారం మధ్యాహ్నం భర్త ఇంటి వద్ద ఉండగానే పిల్లలను తీసుకుని ఆమె బయటకు వచ్చింది. హాస్పటల్‌కు వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పింది. ధవళేశ్వరంలోని రామ పాదాల రేవు వద్దకు చేరుకుని, అక్కడున్న ఆశ్రమం వద్ద చాలాసేపు కూర్చుంది. ఈ సమయంలో భర్త ఆచార్యులు ఫోన్ చేసి, ఎక్కడున్నావని అడిగితే, స్నేహితురాలి ఇంటి వద్ద ఉన్నట్టు చెప్పింది. అనంతరం సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసింది. చాలాసేపటి వరకు తల్లితో చిన్నారులు ఆడుకున్నారు. సాయంత్రం 6.30 ప్రాంతంలో ఇద్దరు పిల్లలను ఎత్తుకుని, రేవు నుంచి గోదావరిలోకి దిగిపోయింది. దీనిని అక్కడున్న ఓ యువకుడు గమనించి కేకలు వేశాడు. అక్కడున్న జాలర్లు అప్రమత్తమై, మోటారు నావలో విజయలక్ష్మి వద్దకు చేరుకున్నారు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆమెను కాపాడారు. ఇద్దరు పిల్లలు నదిలో కొట్టుకుపోయారు. ఒడ్డుకు చేరిన విజయలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించింది. కొద్దిసేపటి తర్వాత పనివాళ్ల మృతదేహాలను జాలర్లు ఒడ్డుకు చేర్చారు. భర్త ఆచార్యులు ఫిర్యాదు మేరకు ధవళేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు.
తీరని వేదన మిగిలింది
కుటుంబ కలహాలతో విజయలక్ష్మి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కన్నబిడ్డలను తీసుకుని ఆమె చేసిన ఆత్మహత్యా యత్నం.. ఆమెకే కడుపుకోతను మిగిల్చింది. ఇంటి నుంచి బయలుదేరి, గోదావరి ఒడ్డుకు చేరుకునే వరకూ ఆమె పిల్లలతోనే ఆనందంగా గడిపింది. తమను ఎక్కడికి తీసుకెళుతుందో తెలియక పిల్లలు అమాయకంగా ఆమె వెంట నడిచారు. పిల్లలతో ఆమె నదిలో దూకడంతో, చిన్నారులు నీరు తాగి మరణించారు. జాలర్ల సాయంతో ఒడ్డుకు చేరిన ఆమె పిల్లలు చనిపోయారన్న విషయం తెలిసి అపస్మార స్థితికి చేరుకుంది. ఇంతటి పరిస్థితి ఎదురవుతోందని ఊహించని కుటుంబ సభ్యులూ తీవ్ర శోకంలో మునిగిపోయారు. వేమగిరిలో విషాదఛాయలు
అలుముకున్నాయి.