breaking news
justice L.narasimhaReddy
-
వ్యవస్థల స్థాయిని కాపాడాలి
విశ్లేషణ ఆంధ్రప్రదేశ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వరకు ప్రస్తుతం ఉన్న భవనాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోసం విడిచిపెట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఇదే అంశాన్ని తెలియచేయడమైనది. న్యాయవ్యవస్థ విభజన గురించి ఒక నివేదికను ఇచ్చాను కాబట్టి, ఆ అంశాన్ని పరిశీలించడానికి నియమించిన సీనియర్ న్యాయమూర్తుల సంఘం నుంచి నన్ను తప్పిం చారు. ఆ తరువాత మరో సమావేశం గానీ, అవసరమైన చర్య గానీ తీసుకోలేదు. విభజన అంశాన్ని ఆ ప్రధాన న్యాయమూర్తి చర్చకు తీసుకువచ్చినప్పుడు ఆయనతో చెప్పాను, వెయ్యిమంది యువకుల ప్రాణత్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం, హైకోర్టు విభజనను వ్యతిరేకించడం ద్వారా ఆ సంతోషాన్ని హరించడం సరికాదు అని. అందుకు ఆయన, నేను హైదరాబాద్‌లో కొనసాగినంత కాలం హైకోర్టు విభజనకు అనుమతించే ప్రశ్నే లేదని తెగేసి చెప్పారు. ఆయన అటు పాలనాపరంగానూ, ఇటు న్యాయ వ్యవహారపరంగానూ నన్ను ఎంత హింస పెట్టా రంటే, నేను గుండె నిండా ప్రేమించే, ఆరాధించే న్యాయ వ్యవస్థ నుంచి నిష్ర్కమించే క్షణం కోసం ఎదురు చూడ వలసి వచ్చింది. హైకోర్టులో ఒక సీనియర్ న్యాయమూర్తి ఎదుర్కొన్న పరిస్థితి ఈ విధంగా ఉంటే, కింది కోర్టులలో న్యాయాధికారులు చిన్న చిన్న సాకులతో ఎంతగా వేధిం పులకు గురయ్యారో ఎవరైనా ఊహించవచ్చు. న్యాయవ్యవస్థ విభజనకు సంబంధించి చర్చ ఏ సందర్భంలో ఏ రూపంలో వచ్చినా, ప్రస్తుతం పని చేస్తున్నవారి కేటాయింపు వారి రికార్డుల మేరకు స్థానికత ఆధారంగా జరగాలని నేను చెప్పాను. ఒకవేళ ఒక ప్రాంతానికి కేటాయించిన వారి సంఖ్య అసలు కేటా యింపునకు మించి ఉంటే, ఆ పెరిగిన సంఖ్య మేరకు సీనియారిటీని తగ్గిస్తూ ఆదేశాలు ఇచ్చి ఇతర ప్రాంతంలో నియమించుకోవచ్చునని కూడా చెప్పాను. నిజానికి వివిధ క్యాడర్లకు చెందిన ఉద్యోగుల కేటా యింపులో అనుసరించవలసిన మార్గదర్శకాలు ఇలాగే ఉన్నాయి. దీనిని హైకోర్టు పరిగణనలోనికి తీసు కోలేదు. రెండు రాష్ట్రాలకు సంబంధించి అన్ని విభాగాల లోను ఉద్యోగుల విభజన జరిగినప్పుడు పెద్దగా నిర సనలు లేకుండా, కోర్టుల జోక్యం లేకుండా సాగిపోగా, హైకోర్టు విషయంలో మాత్రం వివాదం రేగడం ఒకింత చిత్రమే. ఇందులో గమనించవలసిన మరో ముఖ్య అంశం- హైకోర్టు తనకు తాను రూపొందించిన మార్గ దర్శకాలకు కూడా ఇది విరుద్ధం. నాడు పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు విభజనకు అవసరమైన చర్యలేవీ తీసుకోవడానికి నిరాకరించడమే కాదు, కేంద్ర ప్రభుత్వం ఇందుకు చొరవ చూపినప్పుడు అది వీలు పడకుండా కూడా అడ్డుకున్నారు. నా పరిజ్ఞానం మేరకు సుప్రీం కోర్టు కూడా ఇందుకు దాదాపు ఎలాంటి చొరవ చూపలేదు. ఒకవేళ ఏదైనా జరిగితే అది పరిపాలనా విభాగం నుంచి, న్యాయ వ్యవస్థ వైపునుంచే జరిగింది. న్యాయ విభాగం నుంచి ధర్మారావు అనే న్యాయాధికారి ఈ అంశం మీద రిట్ దాఖలు చేశారు. దీనితో మొత్తం ప్రక్రియ నిలిచిపోయింది. విధించిన స్టేని తొలగింప చేయడానికి తెలంగాణ ప్రభుత్వం, హైకోర్టు చేసిన ఖర్చు అంశం ఏ ఉద్యమ కారుడైనా తెలుసుకోవలసిన సమాచారం. విషాదం ఏమిటంటే, ఈ రిట్ దాఖలు చేసిన అధికారి పదవీ విర మణ చేసి, కోర్టులో పోరాడడానికి నిరాసక్తంగా ఉన్నప్ప టికీ, ఆఖరికి ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ విధించిన స్టేని తొలగించడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. తరువాత ఇప్పుడు మనం చూస్తున్నదంతా జరిగింది. పరిపాలనా విభాగం నుంచి జరిగిన ప్రయత్నం చూస్తే- బార్ కౌన్సిల్, బార్ల ప్రతినిధులు, ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కలుసు కుని హైకోర్టు విభజన అంశానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుకు చోటు చూపించి నట్టయితే, ఒక నెలలోనే విభజన అమలులోకి వస్తుందని ఒక దశలో తెలంగాణ ముఖ్యమంత్రికి తెలియచేశారు. ముఖ్యమంత్రి నాతో సంప్రదించారు. నేను, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇతర న్యాయ మూర్తులు కలసి తెలంగాణ హైకోర్టు ఏర్పాటుకు తగిన చోటును గుర్తిం చాం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వరకు ప్రస్తుతం ఉన్న భవనాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోసం విడిచిపెట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఇదే అంశాన్ని తెలియచేయడం జరిగింది. అయితే హైకోర్టు విభజనను, కింది స్థాయి న్యాయ వ్యవస్థల విభజనను అడ్డుకోవాలన్న ధ్యేయంతో ఉన్న లాబీ అంతకు మించి ముందుకు వెళ్లడానికి అనుమ తించలేదు. ఒక్క పిలుపుతో బయటకు వచ్చి తమ సమస్యలను తామే పరిష్కరించుకునే విధంగా కాన్స్టిట్యూషనల్ కోర్టులు సుప్రీంకోర్టు, హైకోర్టులు ప్రజలను తయారు చేస్తున్నాయని మనం వింటున్నాం. ఇలాంటి ఉద్య మంతో కొన్ని మంచి ఫలితాలు వచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అయితే న్యాయ వ్యవస్థలో భాగమైన వారు తమకు జరిగిన అన్యాయం గురించి పిలుపునిచ్చి నప్పటికీ దానిని సుప్రీంకోర్టు తీవ్రంగా తీసుకునే దాఖ లాలు కనిపించడం లేదు. ఇంకో కాన్స్టిట్యూషనల్ కోర్టు గురించి చెప్పాలంటే, అసలు సమస్య దానికి సంబం దించినదే. తమ సమస్యను పరిష్కరించాలంటూ అటు సుప్రీం కోర్టును గానీ, ఇటు హైకోర్టును గానీ ఆశ్రయించబో మంటూ ఏకగ్రీవంగా తీర్మానించి ఉద్యోగాలను, జీవి తాలను త్యాగం చేయడానికి ఒక రాష్ట్రానికి చెందిన మొత్తం న్యాయాధికారులు సిద్ధ పడ్డారు. దీనిని చూసిన ఏ సామాజిక శాస్త్రవేత్త అయినా గతకాలపు మన న్యాయ వ్యవస్థ ఎంత తటస్తంగా ఉండేదో సులభంగానే అంచనా వేయగలడు. నేటి పరిణామాలను చూసిన తరువాత కలిగిన వేదన మేరకు ఇది రాశాను గానీ, నా మీద నేను జాలి పడడానికి కాదు. నా ఆవేదన అంతా వ్యవస్థలు, వాటి గౌరవం, విశ్వసనీయతల గురించే. న్యాయ వ్యవస్థ స్థాయినీ మర్యాదనీ రక్షించుకోవడానికి లభించే ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకునే పరిస్థితి రాకూడదని ఆశిద్దాం. జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి, వ్యాసకర్త పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఈమెయిల్ : aravindreddy.l@me.com -
న్యాయస్థానంలోనే అన్యాయం
విశ్లేషణ హైకోర్టులోను, కింది స్థాయి న్యాయవ్యవస్థలోను ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు డిమాండ్‌కు మద్దతు లేకపోవడానికి గల కారణం అక్కడ తగినంత తెలంగాణ ప్రాంతీయులు లేకపోవడమేనని ఈ సందర్భంలో ఉదహరించడం అప్రస్తుతం కాదు. న్యాయవాదులు ఉద్యమంలో చురుకైన పాత్రను నిర్వహించారు. దాని ప్రభావం న్యాయస్థానాల మీద కనిపించింది. తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించినవారు, వారు ఏ స్థాయిలోని వారైనా కూడా ఉపేక్షించలేదు. అప్పుడు జరిగిన ఒక ఉదంతాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించవచ్చు. భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో కనీవినీ ఎరుగని ఘటన రెండురోజుల క్రితం చోటు చేసుకుంది. తమకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక పదవులకు రాజీనామాలు చేయాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన 120 మంది న్యాయాధికారులు నిర్ణయించినట్టు చెబుతున్నారు. న్యాయాధికారు లను నియమించే అధికారం కలిగిన గవర్నర్‌ను కూడా వారు కలుసుకున్నట్టు మీడియా వార్తలను బట్టి తెలుస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కింది స్థాయి న్యాయవ్యవస్థలో న్యాయాధికారులను 60:40 నిష్పత్తిలో రెండు రాష్ట్రా లకు కేటాయించారనీ, కానీ విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయాధికా రులను పెద్ద సంఖ్యలో తెలంగాణకు కేటాయించారనీ ఇదే తమ రాజీనామా నిర్ణయానికి కారణమని వారు చెబుతున్నారు. ఇందుకు వారు చూపుతున్న ఒక దృష్టాంతం ఇది- జిల్లా న్యాయమూ ర్తుల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు 140, తెలంగాణకు 94 వంతున విభజించినా, తెలంగాణకు 102 మంది న్యాయమూర్తులను కేటాయించారు. అయితే అందులో 72 మంది ఏపీకి చెందినవారు. పైగా ఏపీకి చెందినప్పటికీ తెలం గాణకు కేటాయించిన ఈ న్యాయమూర్తులంతా కొత్తవారేనని చెబుతున్నారు. కాబట్టి వచ్చే రెండున్నర దశాబ్దాల కాలంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన న్యాయమూర్తుల అవకాశాలకు వారు అడ్డంకిగా మారతారు. ఇతర క్యాడర్ లకూ ఇదే వర్తిస్తుందని తెలంగాణ న్యాయాధికారులు చెబుతున్నారు. గతంలోని కొన్ని వాస్తవాలను గమనించినా ఆత్మసాక్షి కలిగిన వారికి విభ్రాంతి కలిగించే విషయాలు అనుభవానికి వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి జరిగిన ఘటనలను పరిశీలిస్తే, ప్రస్తుత కేటాయింపులు స్వప్రయోజనాపరులైన కొందరు అమలు చేసిన పథకానికి కొనసాగింపుగానే కనిపిస్తాయి. ప్రధాన న్యాయమూర్తితోను, కొందరు న్యాయమూర్తులతోను, అత్యు త్తమ మౌలిక వసతులతోను హైదరాబాద్ హైకోర్టు 1956లో తన కార్య కలాపాలను ఆరంభించింది. మద్రాసు హైకోర్టు నుంచి విడవడి వచ్చినందున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గుంటూరులో అరకొర వసతులతో పనిచేసేది. ఇలాంటి రెండు న్యాయస్థానాలు విలీనమైనప్పుడు, అది కూడా గుంటూరులో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వచ్చి హైదరాబాద్ హైకోర్టులో కలుస్తున్న ప్పుడు, ఏపీ నుంచి వచ్చిన న్యాయమూర్తులు హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తుల తరువాతి స్థానం పొందుతారని ఎవరైనా భావిస్తారు. అలా కాకున్నా, వారి వారి అనుభవాల ఆధారంగా, వారి నియామక తేదీల ఆధా రంగా స్థానాలు పొంది ఉంటారని ఊహిస్తారు. కానీ అలా జరగలేదు. ఇందుకు విరుద్ధంగా హైదరాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు ఆ రోజునే నియమితులైనట్టు తాజాగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. దీని ఫలితం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి వచ్చిన న్యాయమూర్తులే దాదాపు దశాబ్దంపాటు ప్రధాన న్యాయమూర్తి హోదాను అనుభవించారు. ఈ పరిణామం సహజంగానే కిందిస్థాయి న్యాయాధికారుల నియామకాల మీద ప్రసరించింది. మరీ వివరాల జోలికి పోనక్కరలేకుండానే, ఇందుకు సంబంధించిన వ్యవహార సరళి ఎలా ఉందో ఒక వాస్తవం ద్వారా ఆవిష్కరించవచ్చు. 2014 నాటికి 25 మంది ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తులలో (23 జిల్లాల న్యాయమూర్తులు, మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి ఒకరు, స్మాల్ కాజెస్ కోర్టు న్యాయమూర్తి) ఇద్దరు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. ఇతర కేడర్ల సంగతి కూడా ఇదే తరహాలో ఉంది. ప్రస్తుత హైకోర్టు స్వరూపాన్ని చూసిన ఎవరికైనా కూడా ఆశ్చర్యం కలుగుతుంది. మొత్తం 25 మంది సిట్టింగ్ న్యాయమూర్తులలో ముగ్గురు మాత్రమే తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. ఆ ముగ్గురిలో మళ్లీ ఒకరు మరాఠా మూలాలు ఉన్నవారే. న్యాయాధికారి పదవులను సాధ్యమై నంత మేర ఆంధ్రప్రాంతం వారితో భర్తీ చేయాలన్న కొందరు స్వప్రయోజనా పరుల నిరంతర ప్రయత్నం వల్లనే ఇది సాధ్యపడింది. ఇది సహజంగానే తెలంగాణ ప్రజలకు చేటు చేసింది. ఇదంతా చూసిన తరువాత ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన న్యాయ మూర్తులు తెలంగాణ ఎడల సానుకూలంగా వ్యవహరించలేదన్న భావన ఎవరికైనా కలగవచ్చు. అయితే న్యాయవాదులు గానూ, న్యాయమూర్తులు గానూ నేటి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పలువురు సమున్నతులు హైకోర్టులో ఉన్నారని ఇక్కడ చెప్పవచ్చు. వారంతా వ్యవస్థకు శోభను సంతరించి పెట్టినవారే కూడా. ఇందులో కొందరు మహనీయులు-సుప్రీంకోర్టు మాజీ న్యాయమూ ర్తులు జస్టిస్ ఓ. చిన్నప్పరెడ్డి, జస్టిస్ కె. రామస్వామి, జస్టిస్ జయచంద్రారెడ్డి, జస్టిస్ ఎం. జగన్నాథరావు, జస్టిస్ పి. వెంకటరామారెడ్డి; మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. ఓబుల్‌రెడ్డి, జస్టిస్ ఆవుల సాంబశివరావు, జస్టిస్ కోకా రామచంద్రరావు, జస్టిస్ చెన్నకేశవరెడ్డి, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ అమరేశ్వరి, జస్టిస్ పి. కోదండరామయ్య, జస్టిస్ ఎ. గోపాలరావు, జస్టిస్ కేవీ సిద్దప్ప వంటివారు ఏదో ప్రాంతానికి చెందిన వారన్న ముద్రకు ఆస్కారం ఇవ్వలేదు. సమన్యాయం జరగడం లేదన్న అభిప్రాయానికి చోటి వ్వలేదు. న్యాయవాదుల విషయానికి వస్తే, మొదటి అడ్వొకేట్ జనరల్ నరస రాజు ఎంతో ప్రఖ్యాతులు. ఏపీ హైకోర్టు రూపు దిద్దుకుంటున్నప్పుడు న్యాయ వాదుల సంఘం అధ్యక్షుడు జస్టిస్ మాధవరెడ్డి. నరసరాజు కోసం తన పద విని వదలుకున్నారు. న్యాయవాదులలో పి. రామచంద్రారెడ్డి, పి. బాబుల్ రెడ్డి, వీఆర్ రెడ్డి, టి. అనంతబాబు, ఎస్. వెంకటరెడ్డి, వి. వెంకటరమణయ్య, సి. పద్మనాభరెడ్డి, చల్లా సీతారామయ్య వంటి మార్గదర్శకులను ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా తెలంగాణకు చెందిన న్యాయవాదులు, న్యాయ మూర్తులతో ఆంధ్రప్రాంతం నుంచి వచ్చిన వారిలో అత్యధికులు స్నేహ పూరితంగానే వ్యవహరిస్తున్నారు. హైకోర్టులోను, కింది స్థాయి న్యాయవ్యవస్థలోను ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు డిమాండ్‌కు మద్దతు లేకపోవడానికి గల కారణం అక్కడ తగినంత తెలంగాణ ప్రాంతీయులు లేకపోవడమేనని ఈ సందర్భంలో ఉదహరించడం అప్రస్తుతం కాదు. న్యాయవాదులు ఉద్యమంలో చురుకైన పాత్రను నిర్వహిం చారు. దాని ప్రభావం న్యాయస్థానాల మీద కనిపించింది. తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించిన వారు, వారు ఏ స్థాయిలోని వారైనా కూడా ఉపేక్షించలేదు. అప్పుడు జరిగిన ఒక ఉదంతాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించవచ్చునని అనుకుంటున్నాను. ఇది తెలంగాణ ఉద్యమం ఊపందు కోవడానికి చాలా ముందు జరిగింది. 2009 డిసెంబర్ ఆఖరివారంలో, అమె రికా ప్రవాస భారతీయుల ఆధ్వర్యంలోని తెలంగాణ అభివృద్ధి వేదిక వరం గల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి, ముఖ్యఅతిథిగా పాల్గొనవలసిందిగా నన్ను కోరింది. నేను ఆమోదం తెలియచేశాను కూడా. సరిగ్గా ఆ సమావేశం దగ్గర పడుతూ ఉండగానే అంటే 9-12-2009న కేంద్రం తెలంగాణ ఏర్పా టుకు సంబంధించిన ప్రకటన చేసింది. తరువాత మారిన కేంద్రం వైఖరితో ఉద్యమం ఉధృతమయింది. డిసెంబర్ ఆఖరివారంలో నేను వరంగల్ వెళ్లి ఆ సమావేశంలో పాల్గొన్నాను. అప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి, మీరు తెలంగాణ ఏర్పాటుకు కొమ్ము కాస్తున్నారని బెదిరించేవరకు వెళ్లారు. నిజానికి ఇది ఎంతవరకు వెళ్లిందంటే, నేను ఎంతో ముందుగానే సగం రోజు సెలవు కోసం దరఖాస్తు చేస్తే, మరు నాడు ఆ ప్రధాన న్యాయమూర్తి మీరు సెలవును వినియోగించుకోరాదు అన్న సందేశంతో రిజిస్ట్రార్ జనరల్‌ను నా చాంబర్‌కు పంపించారు. కానీ ఈ సందేశం నాకు పంపిన సదరు ప్రధాన న్యాయమూర్తిగారే కనీసం సెలవు దరఖాస్తు కూడా ఇవ్వకుండానే వారాలు, నెలల తరబడి చాలాసార్లు కోర్టుకు హాజరు కాలేదన్న సంగతి ప్రస్తావించడమూ అసందర్భం కాదు. జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ సమర్పించిన నివేదికకు సంబంధించి మాజీ ఎంపీ నారాయణరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ గురించి- ఆ అంశం మీద వాదో పవాదాలు నేను విన్నాను. ఇంకా అటార్నీ జనరల్, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్, చాలా మంది న్యాయవాదులు కూడా అప్పుడు అక్కడ ఉన్నారు. శ్రీకృష్ణ కమిషన్ నివేదికను సీల్డ్ కవర్లో అటార్నీ జనరల్‌కు అందివ్వడం గురించి నేను కొన్ని అభిప్రాయాలు ప్రకటించాను. దీనితో ఆంధ్రప్రాంతానికి చెందిన కొందరు రాజకీయవేత్తలు నా మీద విమర్శల వర్షం కురిపించారు. బదలీ చేయిస్తామంటూ నాకు బెదిరింపులు కూడా వచ్చాయి. తీర్పు వెలు వడిన తరువాత నన్ను న్యాయమూర్తి పదవి నుంచి తప్పించాలంటూ పలువురు విచక్షణా రహితంగా మాట్లాడారు. కానీ వీటి మీద ఎలాంటి చర్య లేదు. ఆ ప్రధాన న్యాయమూర్తి వారసుడైనా కొంచెం మెరుగ్గా వ్యవ హరిస్తారని ఆశించడం జరిగింది. రాష్ర్ట పునర్ విభజన చట్టాన్ని ఆయన హయాం లోనే పార్లమెంట్ రూపొందించింది. నోటిఫైడ్ (ప్రకటన) తేదీ 2-6-2014ని దృష్టిలో ఉంచుకుని వ్యవస్థల విభజనకు చర్యలు తీసుకోవ లసిందిగా 2014 మార్చిలో భారత ప్రభుత్వం నుంచి గౌరవ రాష్ట్ర గవర్నర్‌కు ఆదేశం అందింది. ఆ నెలలోనే ప్రధాన న్యాయమూర్తి పూర్తి స్థాయి సమావేశం నిర్వహించారు. భారత రాజ్యాంగం నిబంధనల మేరకు లేదా రాష్ట్ర పునర్ విభజన చట్టాన్ని అనుసరించినా హైకోర్టు, కింది కోర్టుల న్యాయాధికారుల విభజన పని నోటిఫైడ్ తేదీకే పూర్తి కావాలన్న సారాంశంతో, అందుకు సంబంధించిన ప్రస్తావనలతో నేనొక నివేదిక ఇచ్చాను. ప్రాంతం విషయంలో కిందిస్థాయి న్యాయాధికారులకు ఐచ్ఛికావకాశం ఇచ్చారన్న సంగతి గమనార్హం. ప్రధాన న్యాయమూర్తి మొండి వైఖరిని అనుసరిస్తూ, హైకోర్టు విభజన ప్రక్రియను నిరోధించాలన్న నిర్ణయానికి దాదాపు వచ్చేశారు. (తరువాయి రేపటి సంచికలో) జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి, వ్యాసకర్త పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఈమెయిల్ : aravindreddy.l@me.com