పంచాయతీ కార్యదర్శుల నియామకానికి కౌన్సెలింగ్
జిల్లాలో 48 మందికి పోస్టింగ్లు
ఖమ్మం జెడ్పీసెంటర్: పంచాయతీ కార్యదర్శులు 48 మందికి జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బాబురావు పోస్టింగ్ ఉత్తర్వులు అందజేశారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ ఏడాది మార్చి 23న ఏపీపీఎస్సీ నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్షల్లో అర్హత సాధించి అపాయింట్మెంట్ పొందిన వారికి ఇప్పుడు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 83 పోస్టులకు గాను 83 మంది అర్హత సాధించారు. వీరిలో ఒక అభ్యర్థి ఎంపికైన తర్వాత ఉద్యోగం వద్దని చెప్పడంతో 82 మంది మిగిలారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన జరగడంతో పోస్టింగ్లు నిలిపివేశారు. జిల్లాలో 7 మండలాలు ఆంధ్రలో వీలినం కావడంతో అక్కడ 35 పోస్టులను భర్తీ చేయడానికి వీలు లేకపోవడంతో చివరకు అధికారులు ప్రభుత్వనికి లేఖ రాశారు. దీంతో మిగిలిన మండలాల్లో 48 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో 82 మంది అభ్యర్థుల్లో మెరిట్ ఆధారంగా 48 మందికి కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్లు ఇచ్చారు.