breaking news
John F Kennedy Airport
-
ఫ్లైట్‌లో సాంకేతిక సమస్య.. 32 మందికి గాయాలు
న్యూయార్క్: విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడటంతో 32 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఇస్తాంబుల్ నుంచి న్యూయార్క్ బయలుదేరిన టర్కీష్ ఎయిర్‌లైన్స్ విమానంలో శనివారం రోజున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విమానం మరో గంటలో న్యూయార్క్ జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుందన్న సమయంలో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానంలో అల్లకల్లోల వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో ప్రయాణికలతో పాటు, ఫ్లైట్ సిబ్బందికి కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. అదృష్టావశాత్తు విమానం శనివారం సాయంత్రం 5.30 గంటలకు జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయంలో క్షేమంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనపై న్యూయార్క్ ఎయిర్పోర్ట్ అధికార ప్రతినిధి స్టీవ్ కోల్మన్ మాట్లాడుతూ.. ‘ది బోయింగ్ 777 విమానం 326 ప్రయాణికులు, 21 మంది సిబ్బందితో ఇస్తాంబుల్ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరింది. విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యే 45 నిమిషాల మందు విమానంలో భయానక పరిస్థితి నెలకొంది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు ఆందోళకు గురయ్యారు. ఈ ఘటనలో మొత్తం 32 మంది గాయపడగా.. వారిలో కొందరిని అధికారులు చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటన వల్ల ఇతర విమానాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేద’ని తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఓ వ్యక్తి కాలు విరిగినట్టు సమాచారం. గాయపడినవారిలో ఓ చిన్నారి కూడా ఉన్నారు. -
మీకే కాదు...'మాకూ' ఓ ఎయిర్‌పోర్టు
ఇప్పటివరకూ మనుషులకు మాత్రమే ఎయిర్‌పోర్టులను చూశాం...త్వరలో జంతువులకు ప్రత్యేకంగా ఓ విమానాశ్రయం రానుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, ఒక దేశం నుంచి మరో దేశానికి వేగంగా వెళ్లేందుకు మానవులైన మనకు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిర్వహించేందుకు విమానాశ్రాయాలు ఉన్నాయి. పిల్లులు, కుక్కలు, కోళ్లు, కొంగలు, పక్షులు, పశువుల రవాణాకు విమాన సర్వీసులు ఇప్పటి వరకు ఎక్కడా లేవు. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారి అలాంటి సౌకర్యం న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందుబాటులోకి రానుంది. ఈ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్ పక్కనే వున్న 14.4 ఎకరాల స్థలంలో 48 మిలియన్ డాలర్లతో జంతువుల కోసం ప్రత్యేక టెర్మినల్‌ను నిర్మించాలని నిర్ణయించారు. దీనికి 'ది ఆర్క్' అని అప్పుడే నామకరణం కూడా చేశారు. 2016 నుంచి అందుబాటులోకి రానున్న ఈ టెర్మినల్ నిర్మాణానికి రేస్బ్రూక్ కేపిటల్ అనే ప్రముఖ రియల్టర్ సంస్థకు అనుబంధమైన ఏఆర్కే డెవలప్మెంట్ సంస్థ సంబంధిత సంస్థలతో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే కెన్నడీ విమానాశ్రయం నుంచి ప్రపంచంలో ఎక్కడికైనా సరకు రవాణాలాగా జంతువులను రవాణా చేయవచ్చు. జంతువులంటే పెంపుడు కుక్కలు, పిల్లులు, పక్షుల లాంటివే కాకుండా గుర్రాలు, పశువులు లాంటి పెద్ద జంతువులను కూడా రవాణా చేస్తారట. 1, 78, 000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ టెర్మినల్‌లో ప్రత్యేకంగా మూడు విభాగాలు ఉంటాయి. జంతువుల మేతకు, వాటి విశ్రాంతికి అవసరమైన వేర్వేరు గదులను నిర్మించడమే కాకుండా, వాటికి ఎలాంటి జబ్బులు సోకకుండా నిరంతరం పర్యవేక్షించేదుకు పశువుల డాక్టర్ల కోసం ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు.