breaking news
JLM
-
ఆ 553 పోస్టులను మెరిట్ ప్రకారం భర్తీ చేయండి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 553 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులను పరీక్షలు నిర్వహించిన వారితో భర్తీ చేయాలని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్)ను హైకోర్టు ఆదేశించింది. జేఎల్ఎం నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు, ‘స్థానికత’లాంటి అంశాలు వర్తించవని తేల్చిచెప్పింది. ఇప్పటికే స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహిస్తే వారితో పోస్టులను భర్తీ చేయాలని, ఒకవేళ ఆ పరీక్ష నిర్వహించిన వారు లేకుంటే వెంటనే నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. 2019లో టీఎస్ఎస్పీడీసీఎల్ 2,500 జేఎల్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన తిరుమలేశ్ సహా మరికొందరు హైకోర్టులో 2020లో పిటిషన్లు దాఖలు చేశారు. జిల్లాల విభజన కారణంగా అటు ఉమ్మడి జిల్లాకు, ఇటు కొత్త జిల్లాకు కాకుండా తాము నష్టపోయామని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టి గురువారం తీర్పు వెలువరించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, న్యాయవాదులు సుంకర చంద్రయ్య, చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయూమూర్తి.. రాష్ట్రపతి ఉత్తర్వులను జేఎల్ఎం పోస్టులకు వర్తింపజేయలేరని టీఎస్ఎస్పీడీసీఎల్కు తేల్చిచెప్పారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలను యూనిట్‌గా తీసుకొని 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేయడాన్ని తప్పుబడుతూ కొత్త జిల్లాల అభ్యర్థులు ఉమ్మడి జిల్లాకు నాన్ లోకల్ కారని చెప్పారు. ఇప్పటికే 1,900కుపైగా పోస్టులను అధికారులు భర్తీ చేయడంతో మిగిలిన ఖాళీలను మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని ఆదేశించారు. -
ఆపసోపాలు
సాక్షి, ఏలూరు:విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్ పోస్టులకు ఎంపిక పరీక్షలు బుధవారం మొదలయ్యాయి. మొదటి రోజు 214 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పరీక్షలో భాగంగా సిమెంట్, ఐరన్ విద్యుత్ స్తంభాలు ఎక్కాల్సి రావడంతో అభ్యర్థులు ఆపసోపాలు పడ్డారు. మీటర్ రీడింగ్, సైక్లింగ్ వంటి పరీక్షలు విజయవంతంగా పూర్తిచేసిన వారిలో కొం దరు స్తంభాలు ఎక్కడంలో విఫలమై ఉద్యోగానికి అర్హత కోల్పోయారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్)లో జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీకి తుది పరీక్షలు బుధవారంనుంచి ఆగస్టు 13 వరకూ నిర్వహిస్తున్నారు. జిల్లాలో 310 జేఎల్ఎం పోస్టులు ఉండగా, 3,539 మందికి కాల్ లెటర్స్ పంపించారు. వట్లూరులోని ఈపీడీసీఎల్ జిల్లా స్టోర్స్ పక్కన గల పోల్ తయారీ సెంటర్లో ఎంపిక పరీక్ష ప్రారంభమైంది. 12 వీడియో కెమెరాలతో ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయించారు. అభ్యర్థుల హాజరు నమోదుకు బయోమెట్రిక్ మెషిన్ ఉపయోగించారు. ఎంపికలో భాగంగా అభ్యర్థులు 8మీటర్ల సిమెంట్ స్తంభం, 30 అడుగుల ఇనుప స్తంభం ఎక్కాలి. సైకిల్ తొక్కి చూపించాలి. ఎలక్ట్రానిక్ మీటర్, మెకానికల్ మీటర్లలో రీడింగ్ తీయాలి. సైకిల్ తొక్కడం, మీటర్ రీడింగ్ తీయడం వరకూ అందరూ బాగానే చేయగలిగినప్పటికీ స్తంభాలు ఎక్కాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆపసోపాలు పడ్డా రు. కొందరు మధ్యవరకూ వెళ్లి దిగిపోయారు. మరి కొందరు కిందకు దిగేందుకు ఇబ్బందిపడ్డారు. ఐరన్ స్తంభాన్ని సులభంగా ఎక్కగలిగినవారు సిమెంట్ స్తంభం విషయంలో ఇబ్బంది పడ్డారు. ఫలితాలు చివరి రోజునే : మొదటి రెండు రోజులు రోజు కు 250 మంది చొప్పు న ఎంపికకు పిలిచామని, 36 మంది గైర్హాజరయ్యారని ఏలూరు (ఆపరేషన్స్) సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ టీవీ సూర్యప్రకాష్ తెలిపారు. మూడో రోజు నుంచి రోజుకు 300 మందికి పరీక్షలు నిర్వహిస్తామని, చివ రి రోజు పరీక్షలు ముగిసిన తర్వాత ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈపీడీసీఎల్ డెరైక్టర్ (ఆపరేషన్స్) పి.రామ్మోహన్, సీజీఎం (ఎనర్జీ ఆడిట్) ఓ.సింహాద్రి పరిశీలకులుగా వ్యవహరించారు.