breaking news
Jithendra goud
-
బాబు డైలమా!
ఎన్నికల వేళ టీడీపీ అధినేత ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. టీడీపీకి ‘అనంత’ కంచుకోట అంటూ పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. అభ్యర్థులను మాత్రం ఎంపిక చేయలేక సతమతమవుతున్నాడు. నామినేషన్ స్వీకరణ రోజు సమీపిస్తున్నా బరిలో నిలిచే వారిని ప్రకటించలేకపోతున్నారు. ఎంపీ జేసీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోలేక.. సొంత నిర్ణయంపై మొగ్గుచూపలేక సందిగ్ధంలో పడిపోయారు. మరోవైపు కళ్యాణదుర్గం టిక్కెట్‌పై ఇటు ఉన్నం, అటు అమిలినేని ఆశలు పెంచుకున్నారు. ఎవరి ఏర్పాట్లు వారు చేసుకుంటున్నారు. ఇక గుంతకల్లులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: కళ్యాణదుర్గం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనమాట నెగ్గించుకునేందుకు బ్లాక్‌మెయిల్‌కు కూడా దిగారు. సిట్టింగ్‌లను మార్చి తాను చెప్పిన వారికే టిక్కెట్లు కేటాయించాలని గట్టిగా పట్టుబడుతున్నారు. అయితే జేసీ సిఫార్సు చేసిన వారికి టిక్కెట్లు ఇస్తే పార్లమెంట్ పరిధిలో జేసీ తనకంటూ ప్రత్యేక వర్గం ఏర్చరుచుకుంటారనీ, ఇది పార్టీకి ఇబ్బందిగా పరిణమించే ప్రమాదముందనే యోచనలో పార్టీ ఉంది. అందుకే జేసీ సిఫార్సులపై ఆచితూచి అడుగేయాలనే భావనలో బాబు ఉన్నారు. మళ్లీ మొదటికొచ్చిన కళ్యాణదుర్గం పంచాయితీ జేసీ సిఫార్సు చేసిన మూడు ప్రధాన నియోజకవర్గాల్లో కళ్యాణదుర్గం పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చింది. టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి సిద్ధమయ్యారు. సోమవారం నామినేషన్ వేస్తున్నట్లు ప్రకటించారు కూడా. ఇక కళ్యాణదుర్గం అభ్యర్థిత్వంపై అమిలినేని సురేంద్రకు టీడీపీ అధిష్టానం స్పష్టత ఇచ్చింది. దీంతో సురేంద్ర నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లలో ఉన్నారు. ఈ క్రమంలో చౌదరి నామినేషన్ వేస్తానని ప్రకటించడంతో సురేంద్రలో గుబులు మొదలైంది. దీనికి తోడు జేసీ దివాకర్‌రెడ్డి కూడా సురేంద్రను వ్యతిరేకిస్తున్నారు. బెళుగుప్పకు చెందిన ఉమామహేశ్వరనాయుడు పేరు ఖరారు చేయాలని చంద్రబాబు వద్ద పట్టుబడుతున్నారు. మరోవైపు చౌదరి వర్గం మాత్రం ఉమా, సురేంద్ర స్థానికేతులరని.. వీరిద్దరికీ కాకుండా తమలో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని అధిష్టానానికి స్పష్టం చేశారు. తద్వారా ఇద్దరినీ వ్యతిరేకిస్తున్నామని బాహాటంగానే చెప్పారు. చౌదరికి ఎసరు పెట్టాలనీ.. ఎంపీ జేసీ కళ్యాణదుర్గం టిక్కెట్ ఉమాకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో అది తెలుసుకున్న అమిలినేని సురేంద్ర, జేసీతో మాట్లాడినట్లు తెలిసింది. తన అభ్యర్థిత్వానికి సహకరించాలని కోరగా.. ఆయన ససేమిరా అన్నట్లు సమాచారం. కావాలంటే అనంతపురం అర్బన్‌కు వెళ్లాలని, సీఎంకు కూడా తాను సిఫార్సు చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభాకర్‌చౌదరిని మార్చాలని ముందు నుంచి దివాకర్‌రెడ్డి అధిష్టానం వద్ద తన వాణి వినిపిస్తున్నారు. మరోవైపు చౌదరి ఏకంగా ప్రచారం సాగిస్తున్నారు. జేసీ దివాకర్‌రెడ్డిని గట్టిగా వ్యతిరేకిస్తున్న ప్రభాకర్ చౌదరిని వదులుకోకూడదని చంద్రబాబుకు టీడీ జానార్దన్తో పాటు మంత్రి దేవినేని సూచించినట్లు తెలుస్తోంది. ఆయన దూకుడుకు బ్రేక్ వేయాలంటే కచ్చితంగా చౌదరి ఉండాలనే అభిప్రాయానికి వచ్చినట్లు చర్చ జరుగుతోంది. మరోవైపే జేసీ, మాజీ ఎంపీ సైఫుల్లా వర్గంతో పాటు బలిజ, కమ్మ సామాజికవర్గ నేతలు కూడా చౌదరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చౌదరికి టిక్కెట్ ఇస్తే గెలిచే అవకాశాలు లేవని సర్వే రిపోర్టులు కూడా రావడంతో చంద్రబాబు కూడా డైలమాలో ఉన్నట్లు సమాచారం. దీంతో సురేంద్ర పేరును అనంతపురం నియోజకవర్గానికి కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాను చెప్పిన స్థానాల్లో అభ్యర్థులను మార్చకపోతే ఎంపీగా తాము బరిలోకి దిగమని కూడా జేసీ బాహాటంగానే చెబుతున్నారు. ఇంత నేరుగా అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్న జేసీ తీరుతో ‘అనంత’ నేతలు కూడా విస్తుపోతున్నారు. అసలు ఈ ఎన్నికల్లో పార్టీకి జేసీనే మైనస్ కాబోతున్నారని, పవన్ ఎంపీగా ఓడిపోవడం ఖాయమని, ఆయన స్థానంలో మరొకరిని బరిలోకి దించితే ఎంపీగా ఓడిపోయినా కనీసం కొన్ని అసెంబ్లీ స్థానాల్లోనైనా గట్టి పోటీ ఇవ్వగలమనే అభిప్రాయాన్ని మంత్రి దేవినేనికి కొందరు నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. జితేంద్రగౌడ్ వైపే మొగ్గు ఇక గుంతకల్లు స్థానాన్ని జితేంద్రగౌడ్కే ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా పార్లమెంట్ అభ్యర్థినే బీసీని బరిలోకి దించుతోందని.. టీడీపీ తరఫున పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కాలవ మినహా మరో బీసీ నేత లేరని, గౌడ్‌ను తప్పిస్తే అంతా ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారే అవుతారని ఆ పార్టీ నేతలు చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ రెండు పార్లమెంట్ సీట్లూ తలారి పీడీ రంగయ్య, గోరంట్ల మాధవ్‌కు కేటాయించడంతో టీడీపీ బలమైన బీసీ ఓటు బ్యాంకు దారి మళ్లిందని, ఇది పార్టీకి తీరని నష్టం చేస్తుందని చెప్పినట్లు సమాచారం. మరోవైపు జేసీ మాత్రం గౌడ్‌ను తప్పించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ పరిణామాలతో ‘అనంత’ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సీట్లపై చంద్రబాబు తేల్చలేకపోతున్నారని తెలుస్తోంది. రెండో జాబితా ప్రకటిస్తే అందులోనూ ‘అనంత’ పార్లమెంట్‌లోని స్థానాలు లేకపోతే బాగుండదని జాబితాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. -
కోళ్లు లాక్కున్నందుకు టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం.. !
సాక్షి, అనంతపురం : కోడి పందేలను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అధికార జులుం ప్రదర్శించారు. వివరాలు.. పందేలు నిర్వహించనున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు బుధవారం అంకాలమ్మ గుడి వద్దకు చేరుకున్నారు. పందేలకు సిద్ధంగా ఉన్న నాలుగు కోళ్లను స్వాధీనం చేసుకుని జీపులో వేసుకుని వెళ్లారు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వారి జీపును చేజ్ చేశారు. పోలీసుల జీపునకు అడ్డం తిరిగి వీరంగం సృష్టించారు. ఏఎస్సై తిరుపాల్‌పై దౌర్జన్యం చేశారు. కోళ్లు లాక్కుని పందెం రాయుళ్లకు అప్పగించారు. ఇష్టమొచ్చినట్టు పనిచేస్తే ఊరుకోనని పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారు. ప్రజల సమక్షంలో ఎమ్మెల్యే పరుష పదజాలంతో తిట్టడంతో పోలీసులు తీవ్ర అవమానానికి గురయ్యారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కోడి పందాళ్లో పలువురికి గాయాలు.. గుడివాడ : అధికార పార్టీ నాయకుల అండదండలతో గుడివాడలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. వలంటీర్‌గా ఉండి పందేలను వీక్షిస్తున్న ఓ వ్యక్తిపై టీడీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించడంతో ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలవారు దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. వారిని గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గత రెండు రోజులుగా టీడీపీ నాయకులు కోడి పందేలు నిర్వహిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని కొందరు విమర్శిస్తున్నారు. -
నేను తలచుకుంటే.. నువ్వు, నీ అమ్మ ఉండరు: జేసీ
సాక్షి, అనంతపురం : తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గుత్తిలో హల్చల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తాతో కలిసి గుత్తిలో పర్యటించిన ఆయన గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ తులసమ్మ తనయుడు శీనుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘నేను తలచుకుంటే నువ్వు, నీ అమ్మ, గుత్తి మున్సిపల్ కమిషనర్ ఉండరంటూ’ దుర్భాషలాడుతూ శీనుని జేసీ బెదిరించారు. అయితే మధుసూదన గుప్తాతో కలిసి జేసీ పర్యటించడంపై గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. టీడీపీ సభ్యత్వం లేని గుప్తాను తనకు పోటీగా తెచ్చేందుకే జేసీ ఇలా చేస్తున్నారేమోనని గౌడ్ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
'నామినేషన్ వెనక్కా... తీసుకోను గాక తీసుకోను'
అనంతపురం జిల్లా గుంతకల్లులో బీజేపీకి టీడీపీ బుధవారం ఝలక్ ఇచ్చింది. గుంతకల్లులో స్థానిక టీడీపీ నేత జితేంద్రగౌడ్‌ను నామినేషన్ వేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అంతే బాబు ఆదేశాలతో ఎగిరి గంతేసిన జితేంద్ర ఆగమేఘాల మీద నామినేషన్ వేశారు. అయితే గుంతకల్ స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి చంద్రబాబు కేటాయించారు. అందులోభాగంగా బీజేపీకి చెందిన అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయాలి. అలాగే బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ఉపసంహరణ గడువు నేటితో ముగియనుండటంతో వేసిన నామినేషన్ ఉపసంహరించాలని జితేంద్రగౌడ్‌ను స్థానిక బీజేపీ నాయకులు కోరారు. అందుకు సదరు టీడీపీ నేత నిరాకరించి... పార్టీ అధినేత చంద్రబాబే నాకు స్వయంగా ఆదేశించినప్పుడు నేను ఎలా నామినేషన్ వెనక్కి తీసుకుంటా అంటూ బీజేపీ నేతలకు ఝలక్ ఇచ్చారు. దాంతో చంద్రబాబుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నామురా బాబు అంటు జుట్టు పీక్కుంటున్నారు.