breaking news
jeesi
-
ప్రొ.కోదండరాం అర్రెస్ట్ అప్రజాస్వామికం
ఖండించిన జెఎసి సంగారెడ్డి టౌన్ఃపోలీసులు దాడి చేసిన మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను పరామర్శించడానికి వెల్లనీయకుండా జెఎసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను అర్రెస్టు చేయడం అప్రజాస్వామికమని జెఎసి నాయకులు అశోక్ కుమార్, బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బీరయ్య యాదవ్‌లు మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నీటిపారుదల ప్రాజెక్టు నిపుణులు అక్కడ 50 టిఎంసిల ప్రాజెక్టు అవసరం లేదని చెబుతున్నారని, అయితే ప్రభుత్వ బలవంతంగా భూసేకరణ ఎందుకు చేస్తున్నారని వారు ప్రశ్నించారు. కార్పోరేట్ శక్తులకు భూములు అప్పగించేందుకే ప్రభుత్వ భూములను బలవంతంగా గుంజుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల మాదిరిగానే ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతులపై దాడులు దేనికి సంకేతమని నిలదీశారు. రైతులకు, ప్రజలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్ఛరించారు. -
జల సాధన ఉద్యమాలు తెలంగాణకు కొత్తకాదు- కోదండరామ్
జలసాధన ఉద్యమాలు తెలంగాణకు కొత్తకాదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ఎం. కోదండరామ్ అన్నారు. ఉద్యమాల ద్వారానే ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ, జనగామ, కరీంనగర్‌లలో సాగునీటి ప్రాజెక్టులు సాధించుకున్నట్లు తెలిపారు. అదే స్ఫూర్తితో నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టు కోసం ముందుకెళ్లాలన్నారు. నారాయణ పేట- కొడంగల్ ఎత్తిపోతల జలసాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. కోదండరామ్‌తో పాటు కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, గద్వాల ఎమ్మెల్యే డి.కె. అరుణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కోదండరామ్ మాట్లాడుతూ ‘వెనుకబాటు తనం పోవడానికి నీరు అవసరం. వెనుకబడ్డ పడమటి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలోని పరిగి వరకు సాగునీరు, తాగునీరు అందించే ఉద్ధేశ్యంతో పాలమూరు- రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకాన్ని రిటైర్డ్ ఇంజినీర్లు రూపొందించారు. జూరాల నుంచి నీటిని తీసుకోవడం ద్వారా వెనుకబడిన ప్రాంతాలను సశ్యశ్యామలం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. అయితే ప్రభుత్వం శ్రీశైలం నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకానికి నీటిని తీసుకోవాలని నిర్ణయించింది. దీనివల్ల నారాయణ పేట, కొడంగల్, మక్తల్, పరిగి, చేవెళ్ల ప్రాంతాలకు నీరురాదు. ప్రభుత్వం జూరాల నుంచి నీటిని తీసుకొని నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని అమలు చేయాలి. శ్రీశైలం నుంచి వచ్చే నీరు రానియ్యండి. కానీ ఒరిజనల్ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మాత్రం కొనసాగించాలి’ అని కోదండరామ్ కోరారు. ‘సాగునీటి అంశాలపై లోతుగా చర్చ జరగాలి. ఇప్పుడున్న ప్రణాళికల మీద చర ్చఅవసరం. ఒక ప్రాజెక్టు కింద ఆయకట్టు వస్తే అదే ఆయకట్టు మరో ప్రాజెక్టు కింద ముంపుకు గురయ్యే పరిస్థితి కల్వకుర్తి, పాలమూరు లిఫ్ట్‌ల కింద కనిపిస్తుంది. ముంపును తగ్గించాలి. ఇందుకోసం జేఏసీ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. జిల్లాలోనే సమావేశమై సాగునీటితో పాటు ఇతర అనేక సమస్యలపైన చర్చించి ముందుకు వెళతాం’ అని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ ‘45 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్న నాకు ముఖ్యమంత్రి తీరు అర్థం కావడం లేదు. ప్రాజెక్టుల ఆకతి మార్చడం అవినీతి కోసమే. జూరాల నికర జలాల ద్వారా వచ్చే నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టును వదిలేసి ఆకృతిని మార్చి శ్రీశైలం ద్వారా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథ కం చేపట్టడం అదే. కేసీఆర్‌కు ఎంపీగా ఐదేళ్లు అవకాశం ఇచ్చిన మూడు నియోజకవర్గాల ప్రజలపై కతజ్ఞతతోనైనా సీఎం పాత డిజైన్ ద్వారా ప్రాజెక్టు చేపట్టాలి. శ్రీశైలం నుంచి కొల్లాపూర్ మీదుగా నారాయణపేటకు నీళ్లు ఇవ్వడం సాధ్యం కాదని సీఎంకు తెలుసు. ఈ ప్రాంతానికి నీళ్లివ్వడం ఆయనకు ఇష్టం లే దు. గెలిచిన పార్టీ మారి టీఆర్ఎస్లో చేరిన నారాయణపేట, మక్తల్ ఎమ్మెల్యేలు సీఎం కాళ్లు, చేతులు పట్టుకొనైనా 69 జీవోను అమలు చేయిస్తే, ప్రజలు క్షమిస్తారు’ అని అన్నారు. రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టు కోసం గవర్నర్ అధికారికంగా జీవో 69 జారీ చే సి, సర్వే పూర్తయిన తరువాత ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లకపోవడం శోచనీయమన్నారు. అధికార పార్టీ పక్షపాత దోరణితో వ్యవహరించకూడదని, అవినీతిని సహించకుండా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. మల్లన్నసాగర్‌కు రిజర్వాయర్ అవసరం లేదని చెపుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. గద్వాల ఎమ్మెల్యే డి.కె. అరుణ, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ నిర్మాణదశలో ఉన్న ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా, జూరాల నుంచి 30 కిలోమీటర్ల దూరంలో రూ. 1500 కోట్లతో పూర్తయ్యే నారాయణపేట - కొడంగల్ ప్రాజెక్టును పక్కనబెట్టారని విమర్శించారు. ఎలాంటి వివాదాలు లేకుండా నీరు తీసుకునే వీలున్న జూరాలను వదిలి అంతర్రాష్ట సమస్యగా మారే శ్రీశైలం నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నారని విమర్శించారు. నారాయణపేట ప్రాజెక్టు సాధన కోసం ప్రజలు రోడ్లపైకి రావాలని, పాదయాత్రల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. జలసాధన సమితి అధ్యక్షుడు అనంతరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పీసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్‌కుమార్, రైతు సంఘం అధ్యక్షుడు చంద్రారెడ్డి, సీపీఎం కార్యవర్గ సభ్యుడు భూపాల్, జేఏసీ కో- కన్వీనర్ వెంకటరెడ్డి, జిల్లాకు చెందిన పవన్‌కుమార్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, వెంకటయ్య, శ్రీశైలం, వెంకట్రాములు తదితరులు ప్రసంగించారు.