breaking news
Jan Dhan scheme
-
రూ.64,564 కోట్లకు జన్‌ధన్ డిపాజిట్లు
న్యూఢిల్లీ: సామాన్యుల కోసం మోదీ సర్కారు ప్రవేశపెట్టిన జన్‌ధన్ పథకం కింద ప్రారంభమైన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు రూ.64,564కోట్లకు చేరాయి. ఈ పథకం కింద జీరో బ్యాలన్స్ సదుపాయంతో ఖాతాలు తెరిచి నిర్వహించుకోవచ్చు. ఈ ఏడాది జూన్ 14 నాటికి జన్‌ధన్ ఖాతాల సంఖ్య 28.9 కోట్లు. వీటిలో 23.27 కోట్లు ప్రభుత్వ బ్యాంకుల్లోవి కాగా, 4.7 కోట్లు గ్రామీణ బ్యాంకుల్లో, 92.7 లక్షల ఖాతాలు ప్రైవేటు బ్యాంకుల్లోనివి. ఈ మొత్తం ఖాతాల్లో నగదు నిల్వలు రూ.64,564 కోట్లుగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతేడాది మోదీ సర్కారు పెద్ద నోట్లను రద్దు చేసే నాటికి ఈ ఖాతాల్లోని డిపాజిట్లు రూ.64,252 కోట్లుగా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లధనం మార్పిడికి జన్‌ధన్ ఖాతాలను ఉపయోగిస్తున్నారన్న ప్రచారం జరగ్గా ప్రభుత్వం హెచ్చరించడం తెలిసిందే. -
వృద్ధి పరుగు గ్యారంటీ
న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆర్థిక వ్యవస్థ మళ్లీ రికవరీ బాట పట్టిందని, రాబోయే త్రైమాసికాల్లో వృద్ధి మరింత మెరుగుపడగలదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనల సడలింపుతో విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంటు మెరుగుపడిందని, అలాగే తయారీ రంగానికి ఊతమివ్వడం వంటి చర్యలతో ద్రవ్యోల్బణమూ దిగొస్తోందని ఆయన చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని జైట్లీ ఈ విషయాలు పేర్కొన్నారు. పన్నుపరమైన వివాదాల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయడం తదితర చర్యల కారణంగా విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంటులో కూడా మార్పు వచ్చిందని, వారు భారత్‌లోని పెట్టుబడి అవకాశాలపై ఆసక్తి చూపుతున్నారని ఆయన చెప్పారు. స్థల సమీకరణకు సంబంధించిన కొత్త చట్టాలు తదితర అంశాల పరిష్కారంపైన నిర్ణయాలు తీసుకునే కొద్దీ వృద్ధి మెరుగుపడేందుకు మరిన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో సాధించిన 5.7 శాతం వృద్ధి ప్రోత్సాహకరంగానే ఉందన్నారు. వృద్ధికి తోడ్పడేలా వడ్డీ రేట్లు తగ్గించే అంశంపై స్పందిస్తూ.. రిజర్వ్ బ్యాంక్ తాజా పరిణామాలను సమీక్షిస్తోందని, తగు నిర్ణయం తీసుకుంటుందని తాను ఆశిస్తున్నట్లు జైట్లీ చెప్పారు. రాబోయే రోజుల్లో డిజిన్వెస్ట్‌మెంట్ ప్రణాళిక లక్ష్యాలు, వస్తు సేవల పన్నుల విధానం అమలు వంటివి ప్రకటించబోతున్నామని జైట్లీ చెప్పారు. జన ధనతో 2.14 కోట్ల ఖాతాలు.. ఈ నెల 28న ప్రవేశపెట్టిన జన ధన యోజన కింద ఇప్పటిదాకా 2.14 సేవింగ్స్ ఖాతాలు తెరిచినట్లు జైట్లీ చెప్పారు. ఇప్పటికే బ్యాంకు ఖాతా ఉన్న వారు కూడా ఆలోగా తమ బ్యాంకు శాఖల నుంచి రూపే కార్డు తీసుకుంటే జన ధన యోజన కింద ఇస్తున్న రూ. 1 లక్ష ప్రమాద బీమా, రూ. 30,000 జీవిత బీమా పొందడానికి అర్హులవుతారని చెప్పారు. లక్ష్యంలో 61.2 శాతానికి ద్రవ్యలోటు ఇదిలాఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై ముగింపు నాటికి ద్రవ్యలోటు రూ.3.24 లక్షల కోట్లను దాటింది. ఆర్థిక సంవత్సరం మొత్తం లక్ష్యంలో ఇది 61.2 శాతానికి సమానం. జీడీపీ పరిమాణంతో పోల్చితే 4.1 శాతానికి ఈ మొత్తం మించరాదని (రూ.5.31 లక్షల కోట్లు) 2014-15 బడ్జెట్ నిర్దేశిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ఈ మొత్తం రూ.5.08 లక్షల కోట్లు. ఆ సంవత్సరం జీడీపీలో 4.5 శాతానికి ఇది సమానం. ఒక నిర్దిష్ట కాలంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం-చేసే వ్యయానికి మధ్య వ్యత్యాసమే ద్రవ్యలోటు.