breaking news
jammu kashmir next cm
-
తదుపరి సీఎంగా మహబూబా ముఫ్తీ?
-
తదుపరి సీఎంగా మహబూబా ముఫ్తీ?
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ (79) అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆయన కుమార్తె మహబూబా ముఫ్తీ తదుపరి సీఎం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే పీడీపీ, బీజేపీల మధ్య కూడా ఓ అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. చాలాకాలం నుంచి ముఫ్తీ మహ్మద్ సయీద్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో ఒకవేళ ఆయన కొంతవరకు కోలుకున్నా కూడా ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వహించే స్థాయిలో లేరని, అందువల్ల ఇక కుమార్తెకు నెమ్మదిగా పగ్గాలు అప్పగిస్తే మంచిదని ఇంతకుముందే పీడీపీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. ఈనెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉన్నాయి. మెహబూబా ముఫ్తీని సీఎం చేసేందుకు తమవైపు నుంచి ఎలాంటి అభ్యంతరం లేదని బీజేపీ కూడా చెప్పేసింది. మహబూబాను సీఎం చేయడానికి పార్టీలో ఏకాభిప్రాయం ఉందని పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ అధికార ప్రతినిధి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నయీం అఖ్తర్ కూడా అన్నారు. ప్రభుత్వానికి నేతృత్వం వహించేందుకు మహబూబాయే సరైన చాయిస్ అని గతంలో ముఫ్తీ మహ్మద్ సయీద్ కూడా చెప్పారని, ఆమె నాయకత్వం విషయంలో పార్టీలో కూడా రెండో ఆలోచన ఏదీ లేదని తెలిపారు. నవంబర్ 13వ తేదీన జరిగిన ఓ విలేకరుల సమావేశంలో ముఫ్తీ మహ్మద్ సయీద్ కూడా ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. ఆమెకు ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయని, అందువల్ల ఆమె సీఎం కావడమే మంచిదని అన్నారు. తనకు ప్రజలను కలిసేందుకు టైమ్ సరిపోవడం లేదని, ఆమెకు ఇటు ప్రజలతోను, అటు పార్టీ కార్యకర్తలతో కూడా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు.