breaking news
Jammikunta hospital
-
పట్టాల మధ్యలో యువతి..
సాక్షి, జమ్మికుంటరూరల్: తీవ్రగాయాలతో రైలు పట్టాల మధ్య పడి ఉన్న ఓ గుర్తు తెలియని యువతిని గమనించిన రైలు గార్డు సమయస్పూర్తితో వ్యవహరించి రైల్వే అధికారులకు అప్పగించిన సంఘటన ఆదివారం జమ్మికుంట పట్టణంలో జరిగింది. పట్టణ సమీపంలోని మడిపల్లి రైల్వే గేటు వద్ద తీవ్రగాయాలతో ఓ యువతి పట్టాల మధ్య పడి ఉంది. ఈ క్రమంలో కాజీపేట నుంచి బల్లార్ష వైపు వెళ్తున్న గూడ్స్ రైలు గార్డు సదరు యువతిని గమనించి, డ్రైవర్‌కు సమాచారం అందించటంతో యువతిని రైల్వేస్టేషన్ రైల్వే అప్పగించారు. దీంతో అధికారులు 108కు సమాచారం అందించి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. -
ఆసుపత్రుల రూపరేఖలు మార్చాల్సిందే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మంత్రి ఈటెల రాజేందర్ గురువారం కలెక్టరేట్లో స్వైన్‌ఫ్లూ వ్యాధి నివారణ చర్యలపై వైద్య, విద్య, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతుప్రసాద్కుమారి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసేందుకు, వాటిపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు, స్వైన్‌ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఈటెల అడిగి తెలుసుకోవడంతోపాటు అధికారులకు పలు ఆదేశాలు, సూచనలిచ్చారు. కలెక్టర్ సైతం పీహెచ్‌సీల పనితీరు, మౌలిక సదుపాయల కల్పనకు అవసరమైన చర్యలతోపాటు జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్మూలన, ప్రజల్లో అవగాహన కల్పించేం దుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. అధికారులను ఉద్ధేశించి మంత్రి ఏమన్నారంటే.. * స్వైన్‌ఫ్లూపై వ్యాధి నిర్మూలన, అవగాహనపై విస్తృత కార్యక్రమాలు నిర్వహించండి. ఏఎన్ఎంలు, ఆశావర్కర్లతోపాటు రాజకీయ నాయకులను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయండి. * ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్మూలనకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచండి. బాధితులకు ప్రత్యేక గదులను కేటాయించండి. డాక్టర్లు సెలవు పెట్టకుండా పూర్తిస్థాయిలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోండి. టైంపాస్‌కు వచ్చే డాక్టర్లు స్వచ్ఛందంగా తప్పుకోవాలి. లేనిపక్షంలో మీరే వారిని గుర్తించి రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోండి. * ప్రతి ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికులు, నైట్వాచ్మెన్లను నియమించాలి. బోరు మొదలు, కరెంట్, టాయిలెట్, బాత్రూంసహా కనీస సదుపాయాలు కల్పించండి. డ్రైనేజీకి, చెత్తకుప్పలకు, పందులకు, మందుబాబులకు నిలయంగా మార్చకండి. బిల్డింగ్ మరమ్మతులు, అదనపు బ్లాక్‌లు నిర్మించడంతోపాటు ఆసుపత్రులను అప్‌గ్రేడ్‌కు అవసరమైన ప్రతిపాదనలు పంపండి. * ప్రస్తుత అవసరాలకు తగినట్లు పీహెచ్‌సీల డిజైన్లను రూపొందించండి. ఆసుపత్రిల్లో అవసరమైన యంత్రాలు, భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయల కల్పనకు డబ్బు కొదవలేనేలేదు. ప్రతిపాదనలు పంపితే మంజూరు చేయిస్తా. * అన్ని సదుపాయాలున్నా డాక్టర్లు, సిబ్బంది పనితీరు సరిగా ఉండటం లేదు. గతంలో మాదిరిగా రొటీన్‌గా పనిచేస్తే లాభం లేదు. ఆసుపత్రుల్లోనే ఉండాలి. అక్కడే తింటూ రోగులతోపాటే ఉండాలి. గతంలో కంటే సర్కారీ ఆసుపత్రుల్లో మార్పు వచ్చిందనే నమ్మకం ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత మీదే. * ఆసుపత్రుల్లో నెలకొన్న చిన్న చిన్న సమస్యలకు ఆసుపత్రి అభివృద్ధి నిధులను వాడుకోండి. ఈ విషయంలో రూల్స్ ప్రకారం కాకుండా ప్రజల అత్యవసరాలను దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేయండి. * ఆసుపత్రుల అభివృద్ధి, సదుపాయల కల్పనకు ఎమ్మెల్యేల, ఎంపీల నిధుల నుంచి రూ.5 కోట్లు విడుదల చేస్తున్నాం. చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి కలెక్టర్ స్థాయిలోనే జీవోలిచ్చేలా చర్యలు తీసుకుంటాం. * కాంట్రాక్టు కార్మికులకు ఆరేడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే ఎలా? ప్రతినెలా వేతనాలిచ్చేలా ఆర్థిక శాఖ ఆదేశాలిచ్చినా ఇంకా ఎందుకు ఇవ్వడం లేదు? వాళ్లకు నెలనెలా వేతనాలు ఇవ్వాల్సిందే. * కలెక్టర్ నీతుకుమారిప్రసాద్ సైతం జిల్లాలో ఉన్న పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలు, కావాల్సిన పరికరాలు, డాక్టర్లు, సిబ్బంది ఖాళీలు వంటి అంశాలపై వైద్యాధికారులను అడిగి నోట్ చేసుకున్నారు. స్వైన్‌ఫ్లూపై రూపొందించిన పోస్టర్లను అన్ని గ్రామాలు, మండలాలు, పట్టణాల్లోని అన్ని బహిరంగ ప్రదేశాల్లో అంటించాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలపై ఈనెల 28న ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు. * పాఠశాలలు ప్రారంభమైన వెంటనే స్వైన్‌ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిరోజు ఐదు నిమిషాలపాటు విద్యార్థులకు వివరించాలని జిల్లా డీఈఓ లింగయ్యను ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లన్నింటిలోనూ ఈ వ్యాధిపై విద్యార్ధులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. * జిల్లా వైద్యాధికారి డాక్టర్ అలీం మాట్లాడూతూ ఇకపై ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో రిసెప్షన్ కౌంట ర్ను ఏర్పాటు చేసి రోగులకు అవసరమైన సౌకర్యాలు అందిస్తామని తెలిపారు. మీరు మారరా? * ల్యాబ్‌టెక్నీషియన్ లేడని * సిటీస్కాన్‌ను పక్కనపడేస్తారా? * డీసీహెచ్ఎస్ అధికారిపై ఈటెల ఆగ్రహం * జమ్మికుంట ఆసుపత్రి నిర్వహణపైనా అసంతృప్తి సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.25 లక్షలతో సిటీస్కాన్‌ను ఏర్పాటు చేసినా ల్యాబ్‌టెక్నీషియన్ లేడనే కారణంతో పక్కనపెట్టడంపై మంత్రి ఈటెల రాజేందర్ డీసీహెచ్ఎస్ డాక్టర్ భోజాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మీకు ల్యాబ్టెక్నీషియనే దొరకకపోతే నాకు చెప్పండి. నేను ఒక్కరిని కాదు, ఎంతమందినైనా పంపిస్తా అంటూ మండిపడ్డారు. ల్యాబ్టెక్నీషియన్ను నియమించుకోవాలని మూడు నెలల క్రితమే చెప్పినా ఇంతవరకు ఆ పని ఎందుకు చేయలేదని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రశ్నించగా.. డాక్టర్ భోజా పొంతనలేని సమాధానాలిచ్చారు. దీంతో మళ్లీ ఈటెల స్పందిస్తూ ఁఅసలు మీతో వచ్చిన తిప్పలే ఇవి? ఇన్ని చెబుతున్నా మీరు మారరా? అందుకేనేమో తెలంగాణలో అభివృద్ధిలో నెంబర్‌వన్‌గా ఉన్న కరీంనగర్ జిల్లా డెంగీలోనూ ముందుంది* అంటూ అసహనం వ్యక్తం చేశారు. యంత్రాలు ఎక్కడెక్కడ పనిచేయడం లేదు? కారణాలేమిటి? అనే వివరాలు వెంటనే పంపడంతోపాటు అవన్నీ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, డీఎంహెచ్లను ఆదేశించారు. జమ్మికుంట ఆసుపత్రిలో అన్ని సదుపాయాలున్నాయంటూ స్థానిక వైద్యాధికారి బదులివ్వగా జిల్లా ప్రధాన ఆసుపత్రి తరువాత ఎక్కువమంది రోగులొచ్చే ఆసుపత్రి అది. ఇప్పటికి 10 సార్లు రివ్యూ చేసినా ఎందుకో సక్రమంగా నడవడం లేదు. చాలా బాధాకరం. ఫిబ్రవరి నాటికి జమ్మికుంట ఆసుపత్రి రూపురేఖలు మారాలి అని ఆదేశించారు. వెంటనే కలెక్టర్ స్పందిస్తూ త్వరలోనే జమ్మికుంట ఆసుపత్రిని సందర్శించడంతోపాటు అవసరమైన సదుపాయాల కల్పనకు డబ్బులు మంజూరు చేయిస్తానని పేర్కొన్నారు.