తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2025 విజేతగా జమాల్
హైదరాబాద్: ఎన్ఎస్ఎల్ లక్స్ సమర్పించిన తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2025 టైటిల్‌ను బంగ్లాదేశ్ స్టార్ గోల్ఫర్ జమాల్ హుస్సేన్ కైవసం చేసుకున్నాడు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ (హెచ్ జీ ఏ)లో శుక్రవారం జరగాల్సిన ఫైనల్ రౌండ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. దీంతో టోర్నమెంట్ ఫలితాన్ని మూడు రౌండ్ల (54 హోల్స్) స్కోర్ల ఆధారంగా ప్రకటించారు.మూడో రౌండ్ ముగిసే సమయానికి 23-అండర్ 187 (61-62-64) అద్భుత స్కోర్‌తో ప్రత్యర్థులపై నాలుగు షాట్ల ఆధిక్యంలో ఉన్న జమాల్ హుస్సేన్‌ను విజేతగా ప్రకటించారు. 40 ఏళ్ల జమాల్‌కు ఇది కెరీర్లో ఆరవ టైటిల్. గత నవంబర్ తర్వాత మొదటిది. ఈ విజయంతో అతను రూ. 15 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. ఫలితంగా పీజీటీఐ 2025 ఆర్డర్ ఆఫ్ మెరిట్లో 14 నుంచి 10వ స్థానానికి ఎగబాకాడు.చండీగఢ్‌కు చెందిన అక్షయ్ శర్మ (62-64-65) మొత్తంగా 19-అండర్ 191 స్కోర్‌తో రన్నరప్‌గా నిలిచాడు. అతను రూ. 10 లక్షల చెక్‌ను అందుకుని, పీజీటీఐ మెరిట్ జాబితాలో 34వ స్థానం నుంచి 21వ స్థానానికి చేరుకున్నాడు. బెంగళూరు ఆటగాడు ఖలీన్ జోషి (65-66-66) 13-అండర్ 197 స్కోర్‌తో మూడో స్థానంలో నిలిచాడు. ఢిల్లీకి చెందిన అర్జున్ ప్రసాద్ 11-అండర్ 199 స్కోర్‌తో ఆరో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శన తర్వాత తన సీజన్ ఆదాయం రూ. 69,71,599తో పీజీటీఐ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఈ టోర్నీలో పాల్గొనని యువరాజ్ సంధు (చండీగఢ్) రూ. 88,67,200 సంపాదనతో పీజీటీఐ మనీ లిస్ట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, స్థానిక గోల్ఫర్లలో హైదరాబాద్‌కు చెందిన విశేష్ శర్మ ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. అతను 5-అండర్ 205 స్కోర్‌తో 22వ స్థానంలో నిలిచాడు.ఈ టోర్నమెంట్లో జమాల్ హుస్సేన్ మూడు రౌండ్లలోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించి, తన సమీప ప్రత్యర్థులకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు.మొదటి రౌండ్ లో టోర్నమెంట్‌లోనే అత్యల్ప స్కోర్ (61) నమోదు చేసి తొలి రోజు నుంచే ఒక షాట్ ఆధిక్యంతో అగ్రస్థానంలో నిలిచాడు. తర్వాతి రౌండ్లలోనూ అదే జోరు కొనసాగించాడు. అత్యంత నిలకడైన ఆట తీరుకు నిదర్శనంగా 54 హోల్స్‌లో జమాల్ కేవలం ఒక్క బోగీ మాత్రమే నమోదు చేయడం విశేషం.విజయం అనంతరం జమాల్ హుస్సేన్ మాట్లాడుతూ, "ఈ సీజన్లో టైటిల్ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో రెండు సార్లు టైటిల్‌కు దగ్గరగా వచ్చి విఫలమయ్యాను. ఫైనల్ రౌండ్ ఆడాలని చాలా అనుకున్నాను. కానీ వాతావరణం మన చేతుల్లో లేదు. ఈ వారం మొత్తం నా డ్రైవింగ్, పుట్టింగ్ అద్భుతంగా ఉన్నాయి. మొదటి రౌండ్లో సాధించిన 61 స్కోర్ టోర్నీ విజవానికి మంచి పునాది వేసింది. వచ్చే నెలలో ఢిల్లీలో జరిగే డీపీ వరల్డ్ ఇండియా ఛాంపియన్‌షిప్‌లో రాణించడమే నా తదుపరి లక్ష్యం" అని అన్నాడు.