పంచాయతీ కార్యదర్శిపై పోలీసుల దాడి
పెద్దేముల్, న్యూస్‌లైన్: ఓ పంచాయతీ కార్యదర్శిపై పొలీసులు దాడి చేశారు. ఈ సంఘటన ఆదివారం పెద్దేముల్ మండల పరిధిలోని తట్టెపల్లిలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా తట్టెపల్లి పంచాయతీ కార్యదర్శి రాజేందర్ మధ్యాహ్నం 12 గంటల సమయంలో గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్ వద్ద ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్లాలని పోలీసులు ఆయనకు తెలిపారు.
తాను పంచాయతీ కార్యదర్శినని రాజేందర్ చెప్పినా వినకుండా ఆయనపై దాడి చేశారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఉండాలని ఆయనను పోలీసులు తోసి వేశారు. దీంతో రాజేందర్ మండల ఎన్నికల అధికారి శివనాగిరెడ్డితో పాటు ఇన్చార్జి ఎంపీడీఓ జర్నప్పకుకు ఫిర్యాదు చేశారు. ఉదయం నుంచి తాను పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నానని, అప్పుడు అభ్యంతరం చెప్పని పోలీసులు దాడి చేయడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శిైపై దాడి చేసిన పోలీసులు అనంతరం ఆయనకు క్షమాపణ చెప్పినట్లు తెలిసింది.
జైరాం తండాలో ఓటర్ల ఆందోళన
జైరాం తండాలో పోలింగ్ ఆలస్యమవుతోందని ఓటర్లు మధ్యాహ్నం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగులు, వృద్ధులు ఓట్లు వేస్తుండడంతో ఆలస్యం జరిగిందని అధికారులు ఓటర్లకు నచ్చజెప్పడంతో సమస్య సద్దుమణిగింది.