జనసేనకు షాక్.. వైఎస్సార్సీపీలోకి దేవమణి
ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీకి షాక్ తగిలింది. జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలానికి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు యేశపోగు దేవమణి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కృష్ణా, గుంటూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి సుబ్బారెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గతంలో జెడ్పీటీసీ సభ్యురాలు దేవమణి శ్రీనివాస్ వైఎస్సార్ సీపీ తరుపున ఎన్నికయ్యారు. తరువాత మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో కలిసి జనసేనలో చేరారు. జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలు నచ్చక తిరిగి సొంతగూటికి వచ్చారు. ఈ సందర్భంగా సుబ్బా రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విలువ ఇప్పుడు పేద ప్రజలకు తెలుస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ అభివృద్ధికి మారుపేరన్నారు. రానున్న కాలంలో పార్టీనుండి వెళ్లిన అందరూ తిరిగి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వానికి సరైన సమయంలో రాష్ట్ర ప్రజలు బుద్దిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, వత్సవాయి ఎంపీపీ కొలుసు రమాదేవి పాల్గొన్నారు.