breaking news
ITD
-
ఏకలవ్య పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, పాడేరు: కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రవేశాలకు గాను దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ తెలిపారు. సీబీఎస్ఈ ఇంగ్లీష్ మీడియంలో బాలబాలికలకు కో ఎడ్యుకేషన్ పద్ధతితో విద్యాబోధన ఉంటుందని ఆయన వివరించారు. ప్రతి తరగతికి 60 సీట్లు చొప్పున బాలికలకు 30, బాలురకు 30 కేటాయిస్తున్నామని ఆయన వివరించారు. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి జి.కె.వీధి, డుంబ్రిగుడ(అరకు సంతబయలు), చింతపల్లి, ముంచంగిపుట్టు(పెదబయలు), అనంతగిరి, అరకులోయ, హుకుంపేట(పాడేరు), పెదబయలు, పాడేరు, జి.మాడుగుల, కొయ్యూరులోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలు కోరుతున్నామన్నారు. 6వ తరగతిలో ప్రవేశాలకు గాను 5వ తరగతి పాసైన విద్యార్థిని, విద్యార్థులు ధరఖాస్తులు చేసుకోవాలన్నారు. కొయ్యూరులో 7వ తరగతిలో బాలురకు మూడు సీట్లు, బాలికలకు మూడు సీట్లు ఖాళీలున్నాయని, పాడేరులో 7వ తరగతిలో బాలురకు ఆరు సీట్లు ఖాళీలున్నాయన్నారు. దరఖాస్తు, ఇతర వివరాలకు www.aptwgurukulam.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని ఆయన కోరారు. మే 16వ తేదీలోపు 6,7తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని, మే 21వ తేదీన ప్రవేశపరీక్ష ఉంటుందన్నారు. దరఖాస్తుల సమర్పణకు దగ్గరలోని గురుకుల పాఠశాల/కళాశాలలో సంప్రదించాలని ఆయన కోరారు. ప్రతిభ పాఠశాలల్లో ప్రవేశాలకు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2022–23 విద్యాసంవత్సరానికి గాను ప్రతిభ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రతిభ విద్యాలయాల్లో నాణ్యమైన విద్య, ఇతర సౌకర్యాలను అమలు చేస్తుందన్నారు. విశాఖలోని మారికవలస ప్రతిభ పాఠశాలలో 8వ తరగతిలో బాలికలకు 45 సీట్లు, విజయనగరం జిల్లా జోగంపేట ప్రతిభ పాఠశాలలో 8వ తరగతి(బాలురు)కు 45సీట్లు కేటాయించారన్నారు. అలాగే ప్రతిభా కళాశాలల్లో సీవోఈ, ఎస్వోఈ విభాగాల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రవేశాలకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఆయన వివరించారు. మారికవలసలో బాలికలు, జోగంపేటలో బాలురు ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని, కేవలం గిరిజన బాలబాలికలు మాత్రమే అర్హులన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని ఆయన వివరించారు. 8వ తరగతి ప్రవేశాలకు గాను ప్రభుత్వం, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 7వ తరగతి ఉత్తీర్ణులైన గిరిజన బాలబాలికలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. అర్హులైన బాలబాలికలు వచ్చేనెల 20లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ప్రవేశపరీక్షను పాడేరు గురుకుల పాఠశాల, అరకులోయ గురుకుల కళాశాలల్లో మే 29న నిర్వహిస్తామని పీవో వెల్లడించారు. (చదవండి: మే నెలాఖరుకు 40 వేల టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాం: ఆదిమూలపు సురేశ్) -
ఐటీడీఏకు శాపం
14 నెలలుగా కానరాని పాలకవర్గ సమావేశం గత ఐదేళ్లలో నాలుగుసార్లే నిర్వహణ కొత్త పాలనలోను జాప్యమేనా? అధికారుల్లో ఏదీ జవాబుదారీతనం పాడేరు: గిరిజనుల అభివృద్ధి కార్యక్రమాలపై 3 నెలలకు ఒకసారి నిర్వహించ వలసిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశాల పట్ల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు సక్రమంగా జరగలేదు. ఐదేళ్లపాలనలో నాలుగు సార్లే సమావేశాలు నిర్వహించడం గమనార్హం. చివరిసారిగా 2013 మే 11వ తేదీన ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. తరువాత ఇంత వరకు ఐటీడీఏ పాలకవర్గ సమావేశాల జోలికి అధికారులు వెళ్లలేదు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తరువాత పాలకవర్గ సమావేశాలు జరుగుతాయని గిరిజనులు ఆశపడినప్పటికి ఫలితం లేకపోయింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు కావస్తున్నా పాలకవర్గ సమావేశం ఊసెత్తడం లేదు. జిల్లా కలెక్టరు, ఐటీడీఏ పీఓలు పాలకవర్గ సమావేశాన్ని 3 నెలలకు ఒకసారి నిర్వహించాల్సి ఉంది. గిరిజనాభివృద్ధికి కీలకమైన పాలకవర్గ సమావేశాన్ని నిర్లక్ష్యం చేయడంతో అభివృద్ధిపై చర్చించే పరిస్థితి ఉండడం లేదు. ఐటీడీఏకు వచ్చే నిధులు వాటిని గిరిజనాభివృద్ధికి ఉపయోగించేందుకు చేపట్టే చర్యలపై సమీక్ష జరపాల్సి ఉంది. గిరిజన ఉప ప్రణాళిక, ఐఏపీ, సమగ్ర కార్యచరణ ప్రణాళిక పథకాల ద్వారా ఐటీడీఏకు వచ్చే నిధులకు పాలకవర్గ సమావేశం లేక జవాబుదారీతనం కూడా లోపిస్తోంది. ఐటీడీఏ ద్వారా చేపట్టే కార్యక్రమాలన్నీ ఇష్టారాజ్యంగానే మారుతున్నాయనే ఆరోపణలు అధికంగా వినిసిస్తున్నాయి. రాష్ట్రం లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికి పాడేరు ఐటీడీఏ పరిధిలోని ఎమ్మెల్యేలు, అరకు పార్లమెంట్ సభ్యురాలంతా వైఎస్సార్ కాంగ్రెస్పార్టీకి చెందిన వారే. గిరిజనాభివృద్ధి కార్యక్రమాలను సంపూర్ణంగా నిర్వహించాలని వారంతా కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఐటీడీఏ పాలకవర్గ సమావేశం జోలికి అధికారులు వెళ్లకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలను మూడు నెలలకు ఒకసారి నిర్వహించి తమ అభివృద్ధికి పాటుపడాలని గిరిజనులు కోరుతున్నారు.