breaking news
istamble
-
కాంస్యం ఖాయం చేసుకున్న జరీన్
టర్కీ: ఇస్తాంబుల్ వేదికగా జరుగుతున్న బాస్ఫోరస్ మహిళల బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్, హైదరాబాద్ అమ్మాయి కాంస్య పంతకం ఖాయం చేసుకుంది. 51 కేజీల విభాగంలో జరీన్.. కజకిస్థాన్‌కు చెందిన నాజీమ్ కైజేబ్‌ను మట్టికరిపించింది. జరీన్ 4-1 తేడాతో కైజేబ్‌ను ఓడించి సెమీస్‌కు చేరింది. దాంతో కనీసం కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకుంది. 2014, 2016 వరల్డ్‌చాంపియన్ షిప్లో రెండుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన కైజేబ్‌ను ఓడించడం ద్వారా అందర్నీ ఆశ్చర్యపరిచింది. జరీన్ తర్వాత గౌరవ్ సోలంకీ 57 కేజీల విభాగంలో ప్యూజిలిస్ట్ ఐకోల్ మిజాన్‌ను గెలిచి సెమీఫైనల్ చేరుకున్నాడు. దాంతో సోలంకీ కూడా కాంస్యాన్ని ఖాయం చేసుకున్నాడు. అయితే, సోనియా లూథర్ (57కేజీలు), పర్విన్ (60కేజీల), జ్యోతి(60కేజీల) విభాగాలలో క్వార్టర్‌లోనే వెనుదిరిగారు. అయితే శివథాప(63 కేజీలు) టర్కీకి చెందిన హకన్డొగన్ చేతిలో ఓడిపోయాడు. అయితే జరీన్ తన తుది పోరులో టర్కీకి చెందిన రజత పతక విజేత బుసేనాజ్ కాకిరోగ్లూ ఎదుర్కొవాల్సి ఉంది. ఇక సోలంకీ అర్జెంటినాకు చెందిన నిర్కో క్యూలోతో తలపడతాడు. చదవండి:రితికా ఆలోచనల్ని ఎవరూ గమనించలేకపోయారా? -
ఇస్తాంబుల్‌లో ఇరుక్కుపోయి...
– అవస్థలు పడ్డ తొండూరు యువకుడు – తుపాకుల మోత మధ్య బిక్కుబిక్కుమంటూ గడిపిన వైనం – ఎంబసీ అధికారుల చొరవతో స్వగ్రామానికి చేరిన గౌతమ్‌రెడ్డి సాక్షి, కడప : దక్షిణ కొరియాలోని క్యూంబంగ్ నేషనల్ యూనివర్సిటీలో పీహెచ్డీ కంప్యూటర్లో ఇంజనీరింగ్ చేస్తున్న పులివెందుల నియోజకవర్గం తొండూరు గ్రామానికి చెందిన యువకుడు అలవలపాటి గౌతమ్‌రెడ్డి నరకం అనుభవించాడు. సుమారు మూడు రోజులపాటు ఇస్తాంబుల్‌లో అవస్థలు ఎదుర్కొన్న గౌతమ్‌ను మంగళవారం సాక్షి పలకరించింది. ఆయన అనుభవించిన నరక యాతన ఏమిటో ఆయన మాటల్లోనే.. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న రద్దార్ యూనివర్సిటీలో జరుగుతున్న అత్యున్నత కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు శనివారం బయలుదేరా. దక్షిణ కొరియా నుంచి ఇస్తాంబుల్ మీదుగా విమానం వెళ్లాల్సి ఉంది. ఆ విమానం శనివారం అంతా ఇస్తాంబుల్‌లోనే ఉండి మరుసటి రోజు అమెరికా బయలుదేరి వెళుతుంది. అందువల్ల ఇస్తాంబుల్‌లో శనివారం సాయంత్రం టాజీం స్కైర్ షాపింగ్ మాల్లో షాపింగ్ చేసుకొని అతిథి గృహానికి వెళదామని బయలుదేరా.. షాపింగ్ మాల్ నుంచి బయటకు వచ్చి కొద్ది దూరం వెళ్లానో.. లేదో అంతలోనే ఒక్కసారిగా తెలియని ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఒక పక్క కాల్పులు... మరోపక్క పరుగులు : అక్కడ తుపాకుల మోత మోగుతోంది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు వేలల్లో ఉన్న జనం ఒక్కసారిగా ఉరుకులు.. పరుగులు.. ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎవరిని అడిగినా తెలియదంటున్నారు. ఏం చేయాలో దిక్కు తోచక మళ్లీ షాపింగ్ కాంప్లెక్స్‌కు వెళ్లాను. కళ్లెదుటే సైనికులు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతుంటే.. పదుల సంఖ్యలో జనం పట పటా రాలిపోతున్నారు. విషయం ఎవరికి తెలియదు.. తర్వాత ఆరా తీస్తే సైనికులకు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న తిరుగుబాటు అని చెప్పుకుంటున్నారు తప్ప స్పష్టత లేదు. దేశం కాని దేశంలో ఒంటరిగా ఉన్న నేను ఒకదశలో భయంతో పరుగులు తీశా.. అది ఎలా అంటే.. దాదాపు 3 కిలో మీటర్ల మేర 40 నిమిషాల్లో పరుగెత్తుకుంటూ వెళ్లి ఎట్టకేలకు అర్థరాత్రి 12.30 గంటలకు అతిథి గృహానికి చేరుకున్నా.. నేను పరుగెడుతున్న సమయంలోనే ఎక్కడ చూసినా సైనికులు యుద్ధ ట్యాంకర్లతో దాడులకు తెగబడుతున్న దృశ్యాలు కళ్లెదుటే కనబడుతున్నాయి. రెండు రోజులపాటు ఎయిర్‌పోర్ట్‌లో పస్తులే.. ఎక్కడ.. ఎప్పుడు.. ఎలా ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో ఎట్టకేలకు ఎంబసీ అధికారుల సమాచారంతో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నా. అయితే నేను ప్రయాణించిన విమానం వెళ్లిపోవడంతో కనీసం ఎయిర్‌పోర్ట్‌లో సమాచారం ఇచ్చే అధికారి లేరు. పైగా అమెరికా, లండన్, ఐరోపా తదితర దేశాలు కూడా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విమానాలను రద్దు చేశాయి. దీంతో రెండు రోజులపాటు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయా.. నిద్రలేదు.. తిండిలేదు.. అమెరికా విమానాలు కూడా నడవకపోవడంతో చివరగా ఎంబసీ అధికారులు ఇండియాకు విమానాలు నడుస్తున్న నేపథ్యంలో వెళ్లాలని ఆదేశించడంతో తప్పని పరిస్థితిలో ఢిల్లీకి వచ్చి అక్కడి నుంచి తొండూరుకు సోమవారం చేరుకున్నా.. ఇప్పుడు ఆ సంఘటనను తలుచుకుంటూనే భయమేస్తోంది.. ఎంబసీ అధికారుల చొరవతో.. ఇస్తాంబుల్ సంఘటనలో నేను చిక్కుకోగానే.. అర్థరాత్రి రూంకు వచ్చిన తర్వాత ఫేస్బుక్, ట్విట్టర్లలో నేను ఇబ్బందులలో ఉన్నట్లు అందరికి పోస్ట్‌లు చేసి హెల్ప్ చేయమన్నా.. చాలామంది మిత్రులు వెంటనే విదేశాంగ మంత్రిత్వ శాఖకు మెసేజ్‌లు పెట్టారు. వెంటనే నేను ఇస్తాంబుల్‌లోని దౌత్య కార్యాలయానికి.. తర్వాత రెండవ సారి కాన్సలేట్‌కు ఫోన్ చేయడంతో సమాచారం లభించింది. దౌత్య అధికారుల సమాచారం మేరకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని ఎట్టకేలకు ఇండియా చేరా.. అందుకు దౌత్య వేత్తలు, ఫ్రెండ్స్ సహాయం మరువలేనిది. కుటుంబీకులు, బంధువులు, స్నేహితులతో హడావుడిగా గౌతమ్ సోమవారం తొండూరు చేరుకున్న గౌతమ్‌రెడ్డిని చూడగానే తండ్రి, పులివెందుల ఇన్‌ఛార్జి ఎంపీడీవో ముకుందారెడ్డి, తల్లి, వైఎస్ఆర్సీపీ మండల నాయకురాలు, మాజీ ఎంపీటీసీ రమాముకుందారెడ్డిలు అక్కున చేర్చుకొని దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్లారు. గౌతమ్‌రెడ్డి వచ్చిన విషయం తెలుసుకున్న మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు బంధువులు, స్నేహితులు అతని ద్వారా విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు.