breaking news
ISIS sympathiser
-
చెన్నైలో ఐసిస్ సానుభూతిపరుడు అరెస్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై వాల్టాక్స్ రోడ్డుకు చెందిన హరూణ్ రషీద్ అనే ఐసిస్ తీవ్రవాద సంస్థ సానుభూతిపరుడిని మంగళవారం రాజస్థాన్ ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాద ఐసిస్ సంస్థకు ఆర్దిక సహకారంతో పాటు యువకులను రిక్రూట్ చేయడం వంటి పనులకు పాల్పడుతున్నట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. సెల్‌ఫోన్ అమ్మకాల పేరుతో రూ.5 లక్షల నిధులను నిందితుడు చేరవేసినట్లు సమాచారం. ఐసిస్‌కు భారతదేశం నుంచి పెద్ద ఎత్తున నిధులు, యువకులను చేరవేయడం వంటి కార్యకలాపాలు సాగుతున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖకు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. గత ఏడాది నవంబరులో రాజస్తాన్ పోలీసులు మహ్మద్ ఇక్బాల్, జమీల్ మహ్మమద్ అనే ఐసిస్ సభ్యులను అరెస్ట్ చేశారు. వీరి బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయగా దేశం నలుమూల నుంచి పెద్ద ఎత్తున నిధులు చేరుతున్నట్లు తేలింది. ఇందులో చెన్నై బర్మాబజార్‌లోని సెల్‌ఫోన్ దుకాణం కూడా ఉంది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు దుకాణం నిర్వాహకుడు హరూణ్ రషీద్ సోమవారం రాత్రి అరెస్ట్ చేసి రాజస్థాన్‌కు తీసుకెళ్లారు. -
హైదరాబాద్‌లో మరో ఐసిస్ సానుభూతిపరుడు అరెస్ట్
రేపు ఎన్ఐఏకు అప్పగించే అవకాశం హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మంగళవారం మరో ఐసిస్ సానుభూతిపరుడు అరెస్ట్ అయ్యాడు. గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) వేడుకలను లక్ష్యంగా చేసుకుని కుట్రలు చేస్తున్న ఐసిస్ సానుభూతిపరుల ప్రయత్నాలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో ఐసిస్ సానుభూతిపరుడుని అదుపులోకి తీసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు విచారిస్తున్నారు. అతడి పేరును అధికారులు వెల్లడించలేదు. రేపు(బుధవారం) ఎన్ఐఏ అధికారులకు ఐసిస్ సానుభూతిపరుడిని అప్పగించే అవకాశం ఉంది. అయితే తమకు ఎలాంటి సమాచారం లేదని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో గత శుక్రవారం నలుగురు ఐసిస్ సానుభూతిపరులను ఎన్ఐఏ అధికారులు తమ అధీనంలోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, దేశవ్యాప్తంగా మొత్తం 14 మంది ఐసిస్ సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే వేడుకలను లక్ష్యంగా చేసుకొని కుట్రలు చేస్తున్న వీరి ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు.